బదరీనాథ్ క్షేత్రంలోని విష్ణు భగవానుడు వేరే ప్రాంతానికి తరలిపోతాడా ?
భవిష్యత్తులో బదరీనాథ్ క్షేత్రంలోని విష్ణు భగవానుడు వేరే ప్రాంతానికి తరలిపోతాడా ?
- లక్ష్మి రమణ
ఉత్తరాఖండ్ రాష్ట్రం గంగమ్మకి జన్మనిచ్చిన ప్రాంతం. పరవశంతో పరవళ్ళు తొక్కే గంగమ్మ పావనం చేస్తున్న పుణ్య ప్రాంతం . ఎన్నో ఏళ్ళు కలలుకని చార్ధామ్ యాత్రీకులు భక్తితో అడుగిడి , కైమోడ్పులు అర్పించే ప్రాంతం . చార్ధామ్ యాత్రల్లో భాగంగా బదరీనాథ్ యాత్ర చేస్తుంటారు యాత్రీకులు. బదరీనాథ్ క్షేత్రంలో త్రిమూర్తులూ కొలువయ్యారు . అందుకే కాబోలు ఉత్తరాఖండ్ ను దేవభూమి అని పిలుస్తారు . ఈ ప్రాంతమంతా ఆధాయాత్మిక శోభతో వెలుగులీనేదే ! అయితే ఇక్కడ ప్రత్యేకమైన ఒక నారసింహ క్షేత్రం ఉంది. ఏటా పెరిగే నారసింహుడు ఇక్కడి ప్రత్యేకత . దాంతో పాటు పంచ బదరీ క్షేత్రాల వైశిష్యం ఈ ప్రాంతాన్ని మరింత మహిమోపేతంగా మారుస్తోంది . ఆ విశేషాలు ఇక్కడ మీ కోసం .
భవిష్యత్తులో బదరీనాథ్ క్షేత్రంలోని విష్ణు భగవానుడు తానుండే చోటుని మార్చుకుంటాడా ? అంటే అవుననే సమాధానంతో పాటు భవిష్య బదరీ క్షేత్రం వివరాలు కూడా చెబుతున్నారు స్థానికులు. బదరీ నారాయణుడు నారసింహుడై పూజలందుకునే రోజు ఖచ్చితంగా వస్తుందని, ఆ సమయంలో బదరీ నారాయణుడి ప్రశాంత వదనం నారసింహ మూర్తిలో లీనమై భవిష్య బదరిలోని మూర్తిగా దర్శనమిస్తుందని స్థల పురాణం .
చరిత్ర :
భవిష్య బదరీని పంచ బదరీ క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు . ఒక్కొక్క యుగంలో ఆయా యుగ ధర్మాన్ని అనుసరిస్తూ, నారాయణుడు అవతరించారు . సత్యయుగంలో ఆయన స్వయంగా బదరీ వనంలో నివసించేవారు. భక్తులు కోరుకున్నప్పుడల్లా ఆయనను స్వయంగా చూసే అవకాశం ఉండేది. అందుకే ఈ ప్రదేశాన్ని ముక్తిప్రద అని కూడా అంటారు. త్రేతాయుగంలో మహా తపస్సు చేసిన భక్తులకు మాత్రమే భగవంతుడు దర్శనమిచ్చారు . భక్తులు యోగము, తపస్సు ద్వారా మాత్రమే ముక్తిని పొందారు. కాబట్టి, ఈ ప్రదేశం యోగసిద్ధిత్ అని పేరొందింది. ద్వాపరయుగంలో, బదరీనాథుని కీర్తి వ్యాప్తి చెందడంతో చాలా మంది భక్తులు తరచూ వస్తుండేవారు. ఆ విధంగా పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులకు భగవంతుడు తన దర్శనం అనుగ్రహించారు . కాబట్టి ఆ ప్రదేశానికి బదరీవిశాల/ విశాల బదరీ అనే పేరు వచ్చింది. చివరగా, ఈ కలియుగంలో, ఈ ప్రదేశంలో బదరీ వృక్షాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దీనిని బదరీకాశ్రమం అని పిలుస్తూ ఉన్నారు.
కానీ ఇక్కడ విశేషం భవిష్య బదరిగా మారనున్న నారసింహుని ఆలయానిది ఏమిటీ అని కదా ! ఆ విషయం తెలుసుకొనే ముందు ఛోటా చార్ధామ్ యాత్రగా పిలిచే పంచబదరీ క్షేత్రాల గురించి తెలుసుకోవాలి . అవే వృద్ధ బదరీ -ఆదిశంకరాచార్యులు బద్రీనాథ్ స్వామిని ఇప్పుడున్న ప్రధాన బద్రీనాథ్ ఆలయంలో ప్రతిష్ఠించే ముందు పూజించిన స్వామి , యోగబదరీ -పాండవులు జన్మించిన స్థలంలో ఉన్న విష్ణుమూర్తి కాంశ్య ప్రతిమ . ధ్యాన బద్రీ-ఊర్వశి స్థాపించిన మూలమూర్తి , అర్థ బదరీ లేదా చిన్న బదరీ , భవిష్య బదరీ- ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నారసింహుని ఆలయం .
భవిష్య బదరీ :
నారసింహుడు కొలువైన ప్రతి ఆలయమూ చాలా ప్రత్యేకమైనది . ఆయన ఎక్కడున్నా గొప్ప సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు . పైగా భక్త సులభుడైన విశ్వరూపుడైన పరమాత్మ స్వరూపమే నారసింహుడు . ప్రత్యేకించి భవిష్య బదరిలో ఉన్న స్వామి ప్రతి ఏడాదీ పెరుగుతూ ఉంటారట . పైగా కత్తిని ధరించిన ఆ మూలవిరాట్టు చేయి ప్రతి ఏడాదీ సన్నబడుతూ ఉంటుందట . అలా ఆ చేయి విరిగినప్పుడు కలియుగం అంతమైపోతుందని , ఆ తర్వాత మొదలయ్యే సరికొత్త యుగంలో బదరీ నాధుడు ఈ నారసింహునిగా కొలవబడతాడని స్థానిక విశ్వాసం. అప్పటికి, ఇప్పుడు బదరీనాధుని మందిరానికి వెళ్లే దారంతా కొండచెరియలతో మూసుకు పోతుందని చెబుతారు .
ఇలా వెళ్లొచ్చు :
జోషిమఠ్ నుండీ కేవలం 17 కిలోమీటర్ల దూరంలో భవిష్య బదరీనాథ్ ఆలయం ఉంది . దగ్గరలోని విమానాశ్రయం డెహ్రాడూన్ , దగ్గరలోని రైల్వే స్టేషన్ కేదార్నాథ్ . ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ ,రిషికేష్ , హరిద్వార్ వంటి అన్ని ప్రధాన నగరాల నుండీ రోడ్డు మార్గంలో భవిష్య బదరీకి వెళ్ళడానికి చక్కని సౌకర్యాలున్నాయి .