Online Puja Services

మహిమ గలిగిన క్షేత్రం మాతృగయ !

18.220.182.171

తల్లి ఋణం కొంతైనా తీర్చే మహిమ గలిగిన క్షేత్రం మాతృగయ !
లక్ష్మీ రమణ 

తల్లి రుణం తీర్చుకోలేనిది . గర్భంలో ప్రవేశించినది మొదలు, పిండమై తల్లి శక్తిని, రక్తాన్ని,మాంసాన్ని,తల్లి సమస్తాన్ని పీల్చి పిప్పిచేసినా, నా బంగారు కొండా చక్కగా తయారవవయ్యా అంటుందా తల్లి . పిండం బిడ్డై  బయటపడే సమయంలో ఆ తల్లి కి అన్నిరకాల కష్టాన్ని,దుఃఖాన్ని,బాధను కలిగించినా, నా ప్రాణం పోయినా , నా బిడ్డ చల్లగా ఉండాలని కోరుకుంటుంది తల్లి మనసు .  బిడ్డల క్షేమం కోసం  తన సర్వమును త్యాగం చేసిన అటువంటి తల్లికి ఆమె శరీరము విడిచి పెట్టాక , యధాశక్తి ఉపశమనం కల్గించి,క్షమాపణ వేడుకొని,ఆమె కు విష్ణుసాయుజ్యాన్ని కలిగించ గలిగిన పవిత్ర ప్రదేశం ఒకటుంది . బాధ్యత కలిగిన ప్రతి బిడ్డా ఇక్కడికి తమ తల్లి రుణాన్ని తీర్చుకోవడానికి వెళ్ళాలి .  దానిగురించి పూర్తివివరాలు తెలుసుకుందామా !

తల్లి రుణాన్ని తీర్చే ఆ పవిత్ర ప్రదేశమే "మాతృగయ". ‘మాతృదేవోభవ’ అనే వేదవాక్యం గొప్పతనం,మనకు అర్ధమై అనుభవంలోకి రావాలంటే ,ప్రతి ఒక్క తనయుడు(తల్లి ని కోల్పోయిన వారు) వచ్చి తీరవలసిన ఏకైక ప్రదేశం ఈ  "మాతృగయ".
 
గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ కు 100కిలోమీటర్ల దూరంలో ఉన్న సిద్దపూర్ నే మాతృగయగా పిలుస్తారు. ఈ ప్రదేశంలోనే శ్రీ కర్ధమఋషి, దేవహూతి పుణ్యదంపతులు తపస్సు చేసి శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకొని, ఆయన్నే పుత్రునిగా పొందాలని వరం కోరుకుంటారు . అప్పుడు స్వయంగా విష్ణువే  కపిలమహర్షిగా జన్మిస్తాడు. ఆయన పుట్టిన    నాలుగుసంవత్సరాలకు, తన తల్లికి జ్ఞానోపదేశం చేసి, వైకుంఠానికి పంపుతాడు. తల్లి, కపిలుడుతో "నాయనా నారాయణా! నువ్వంటే సర్వేశ్వరుడవు. మాకు వైకుంఠ ప్రాప్తి కల్పించావు. లోకంలో సామాన్య తల్లులకు వైకుంఠప్రాప్తి ఏ విధంగా కలుగుతుంది?అని ప్రశ్నినిస్తుంది.
    
అప్పుడు కపిలమహర్షి "ఏ కుమారుడయైతే ఇక్కడ బిందుసరోవరంలో స్నానమాచరించి, తల్లికి పిండప్రదానం చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తానని" వాగ్దానం చేస్తారు . ఆ తరువాత కాలంలో పరశురాముడు రేణుకాదేవికి ఇక్కడ పిండప్రదానం చేశారు . 

ఇక్కడ కర్ధమ మహర్షి ,దేవహూతి మాత   కుమారులైన విష్ణుస్వరూపుడు కపిల మహర్షి  తో పాటు సాక్షిభగవానుని విగ్రహాలు చూడవచ్చు.

ఇక్కడ మీరు తల్లిగారికి పిండాలు పెట్టాలి అనుకుంటే, మొత్తం 21 పిండాలను పెట్టిస్తారు‌. వీటిలో 16 రకాలు తల్లి జన్మనివ్వటానికి పడినబాధలకు, ఆతర్వాత విష్ణువునకు, సాక్షిభగవానునికి, మాతృ, పితామహి, ప్రపితామహి లకు పిండాలు పెట్టిస్తారు . 

 తల్లి ఋణం భగవంతుడుకూడా తీర్చుకొనలేడు. అటువంటి  కన్నతల్లి కి యధాశక్తి క్షమార్పణ చెప్పుకోని, ఆమెను ఉధ్ధరించని కొడుకుజన్మ వృధా అని పెద్దల మాట. కాబట్టి వీలైనవారు, మాతృ వియోగాన్ని అనుభవిస్తున్నవారు  తప్పక ఈ మాతృగయ సందర్శనాన్ని చేయండి .  

 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba