మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు
మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలు - వీటిని కలిపితే, సర్పాకార సుబ్రహ్మణ్యం ప్రత్యక్షం !
లక్ష్మీ రమణ
సుబ్రహమణ్యస్వామి అమ్మవారి అనుగ్రహంగా సర్పస్వరూపంలో పూజలందుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ , ఇక్కడున్న మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాలని ఒక వరుసలో కలిపితే, సర్పాకారం వస్తుంది . పైగా ఈ క్షేత్రాలు స్వయంగా ఆ సుబ్రహ్మణ్యుని సడిని వినిపిస్తాయి. ఆయన వ్యక్తిని వివరిస్తాయి. స్వామి మహిమని నిరూపిస్తాయి . అటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రం అందులోని విచిత్రమైన ఒక ఆనవాయితీని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి .
కర్నాటక రాష్ట్రములో సుబ్రహ్మణ్యుని క్షేత్రాలు ఎంతో ప్రసిద్ధి . ఇక్కడి వారు ఎక్కువగా ఆ స్వామి సహస్రనామాలనే తమ పేర్లుగా పెట్టుకుంటూ ఉంటారు . ఇక్కడ ప్రఖ్యాతిని పొందిన ప్రధానమైన మూడు సుబ్రహ్మణ్య క్షేత్రాల గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం . అవే ఆది సుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య) , మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) , అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక - పావగడ నగలమడికే సుబ్రహ్మణ్య)) . ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది.
ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడతాయి . స్వామి అనుగ్రహముతోటి , సకల అభీష్టములు నెరవేరతాయని విశ్వాసం .
శ్రీరామచంద్రుడు వనవాస కాలంలో నాగలమడకలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీరాముడు ఈప్రదేశం వదలి కామనదుర్గ (నీళ్లమ్మనహళ్ళి) కాకాద్రి కొండకు ప్రయాణ మైనట్లు చెబుతారు. ఈ కొండనే కామిలకొండ అని పిలుస్తారు.
ఈ కొండపై శ్రీ రామచంద్ర స్వామి వారి గుడి ఉన్నది
నాగాభరణం - అన్నం భట్టుగారు :
నాగలమడకలో అన్నంభట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవారట . ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుడిగా వుంటూ దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి ప్రతి సంవత్సరం కాలి నడకన వెళ్లేవారు . వృద్ధాప్యం కారణంగా , ఒకసారి అన్నంభట్టు గారు కుక్కేలో రథం లాగే సమయానికి చేరుకోలేక పోయారు . అప్పుడా స్వామి తన భక్తుడు కుక్కే చేరుకునే వరకూ రథంపైన ఆశీనుడై అలాగే కూర్చున్నారు . భక్తులు ఎంతమంది లాగినా కూడా రథం ముందుకు కదలక అలాగే నిలిచి పోయింది . అన్నంభట్టు గారు కుక్కే చేరుకొని రథం పగ్గాలపై చేయి వేసిన వెంటనే, రథం కదిలిందని ఇప్పటికీ ఇక్కడి స్థానికులు చెబుతారు .
స్వామి స్వయం వ్యక్తమైన విధానం :
అదే అన్నంభట్టుకి స్వామి స్వప్నంలో కనిపించి, “వృద్ధాప్యంలో ఇక్కడకు రాలేవని అందువల్ల నాగలమడకలోనే ఉంటూ సేవ చేయమని” చెప్పి నాగాభరణంను అనుగ్రహించారట . ఆ నాగాభరణంను తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం వల్లనే ఈ ప్రాంతానికి నాగలమడక అని పేరు వచ్చిందంటారు. పెన్నానది పరివాహకం వద్దనే ప్రతిష్ఠించమని స్వామి స్పష్టంగా ఉద్దేశ్యించడంతో ఆయన ఆ ప్రాంతంలో నాగశిలల కోసం వెతికారు . అదేసమయంలో ఒక రైతు పొలంలో నాగలితో దున్నుతుండగా, ఆ నాగలి చాలులో స్యయంగా వ్యక్తమయ్యారు సుబ్రహ్మణ్యుడు . ఆయననే, ఆలయంలో ప్రతిష్ఠించినట్లు స్థల ఐతిహ్యం .
ఆలయ నిర్మాణం :
అయితే, ఇక్కడ పెద్ద ఆలయ నిర్మాణం ఏదీ ఆర్భాటంగా ఉండేది కాదట . కేవలం నాలుగు స్తంభాలు నిలబెట్టి రాతిబండపరచి మంటపాన్ని నిర్మించారట . అయితే, రొద్దంకు చెందిన బాలసుబ్బయ్య అనే వ్యక్తి ఈ మంటపంలో వ్యాపారంకు సంబంధించిన సరుకులు పెట్టుకుని నిద్రిస్తుండగా, స్వామి కలలో కనిపించి ఆలయం నిర్మించాలని చెప్పడం తో ఆయన ఆలయ నిర్మాణానికి కృషి చేసి సఫలీకృతుడైనట్లు తెలుస్తోంది. ఇక అప్పటినుండీ , ఆ వంశానికి చెందిన వ్యక్తులు ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథోత్సవంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
నాగలమడక స్వామీ స్వరూపం :
నాగలమడకలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఉండే శిల్పం సుందరంగా మూడుచుట్లు చుట్టుకుని ఏడు శిరస్సు లు కల్గిన మూడు అడుగుల నాగప్పస్వామి శిల్పం చూసిన భక్తులకు తక్షణం భక్తి భావన కలుగుతుంది.
విచిత్రమైన నమ్మకం :
ప్రతి ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు తమ మొక్కుబడులు తీర్చడానికి ఈ ప్రాంతానికి వస్తువుంటారు. ఆ సమయంలో ఇక్కడి వారు ఒక విచిత్రమైన ఆచారాన్ని పాటిస్తారు . పులివిస్తర్లు (బ్రాహ్మణులు భోజనం చేసి వదిలిన ఆకులు) తలపై పెట్టుకుని పినాకిని నదిలో స్నానం చేస్తారు . ఇలా రథోత్సవం తరవాత ఎంగిలి ఆకులు తలమీద పెట్టుకొని స్నానం చేయడం మనకి వింతగా, కొంతరికి రోతగా అనిపించవచ్చు. కానీ, వీరు దీన్ని ఎంతో ఏంటో భక్తిగా ఆచరిస్తారు . ఆ తర్వాతే, తమ ఉపవాస దీక్షని విరమిస్తారు .
ఎద్దుల పరుష :
ఈ జాతరలో రైతులకు ఈ ఎద్దుల సంత ( పరుష ) ప్రత్యేక ఆకర్షణ. కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో అతి పెద్ద ఎద్దుల పరుష ఇక్కడ జరుగుతుంది. ఇక్కడకు తుముకూరు జిల్లా మరియు ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులు చేరుకుని దాదాపు 10 రోజులపాటు ఎద్దుల అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయి.
అంత్య సుబ్రహ్మణ్యం పేరుతో వెలసిన ఈ స్వామి ఆలయానికి విశిష్ట ఖ్యాతిని పొందింది . ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని భక్తుల పాలిట కొంగుబంగారమై విరాజిల్లుతోంది.