Online Puja Services

నవనారసింహ క్షేత్రాలని దర్శించిన వారికి

18.116.36.23

నవనారసింహ క్షేత్రాలని దర్శించిన వారికి నవగ్రహ దోషాల నుండీ విముక్తి లభిస్తుంది. 
- లక్ష్మి రమణ 

నరసింహుని రూపమే విలక్షణం. ఆయన అనుగ్రహము కూడా అటువంటిదే ! భక్త సులభుడు, దుష్ట శిక్షకుడూ అయిన ఈయన తన భక్తుల జోలికి వచ్చిన వారిని సింహమై శిక్షిస్తారు. భక్తులకి రక్షకుడై సకల సమస్యల నుండీ గట్టెక్కిస్తారు. నవగ్రహాల ప్రభావం నుండీ కూడా రక్షించగలిగిన గొప్ప ఈశ్వరశక్తి నారసింహ స్వరూపం . పరమాత్మ భక్తుని కోసం ధరించిన రూపం కదా ! అందుకే నెమో పరమ దయాళువై అనుగ్రహిస్తారు నరసింహ మూర్తి . ఆ స్వామి నవరూపాలలో నవగ్రహాల అనుగ్రహాన్ని అందించే గొప్ప వరం దాగుంది.  ఆ విశేషాలని ఇక్కడ చెప్పుకుందాం . 

హిరణ్యకశిపుడిని సంహరించాక, నరసింహుని కోపం చల్లారలేదు.  ఆయన  వికటాట్టహాసాలు చేస్తూ, అహోబిల కొండల్లో తిరుగుతూ, తొమ్మిది ప్రదేశాల్లో తొమ్మిది రూపాల్లో వెలసారని ప్రతీతి. వారే నవ నారసింహులుగా పేరొందిన  స్వరూపాలు . ఈ  నవనారసింహులు వెలిసిన వేరు వేరు క్షేత్రాలు కూడా ఉన్నాయి . వీరిలో ఏ స్వామిని అర్చిస్తే, ఏ గ్రహ దోషము నివృత్తి అవుతుందో చెప్పుకునే ముందర, ఆ నవనారసింహ స్వరూపాల వివరాలు చూద్దాం . 

1. జ్వాల నరసింహ స్వామి
2. అహోబిల నరసింహ స్వామి
3. మాలోల నరసింహ స్వామి
4. వరాహ నరసింహస్వామి (క్రోడా)
5. కారంజ నరసింహస్వామి
6. భార్గవ నరసింహస్వామి
7. యోగానంద నరసింహస్వామి
8. చత్రవట నారసింహస్వామి
9. పావన నరసింహ స్వామి

1. జ్వాలా నరసింహ క్షేత్రము.

కుజగ్రహా అనుగ్రహానికి, కుజ సంబంధమైన దోషాలు పోవడానికి జ్వాలా నరసింహుని అనుగ్రహం పొందమని పండితులు సూచిస్తుంటారు . 

నవ నరసింహ క్షేత్రాల్లో ఒక్కటైనా యాదగిరి గుట్ట. హైదరాబాద్ నుండి 65 కి మీ దూరంలో ఉంది. ఇక్కడ కొండపైన వెలసిన నరసింహస్వామికి
ఘనమైన చరిత్ర ఉంది .పూర్వం యాదవ మహర్షి ఈ కొండ పైన తపస్సు చేసాడట. అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవ్వగా తనకు నరసింహమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరాడట. అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు, జ్వాల నరసింహుడు,యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించాడట. ఎప్పటికి స్వామి తన కళ్ళముందే ఉండవలసిందిగా యాదవ మహర్షి కోరటం వలన స్వామి అలాగే కొండపైన వెలసాడట. స్వామి వెలసిన స్థలం కొండ పైన గుహలో ఉంటుంది . 

ప్రహ్లదుని కొరకు స్ధంభమునందు వెలసి, అతి భయంకర రూపంతో హిరణ్యకశిపుని వక్షాన్ని చీల్చి సంహారం చేసిన ఉగ్రనారసింహుడు ఈ “జ్వాలా నరసింహుడు”. ఈయన్ని ఆరాధించడం, ఈయన ఉన్న క్షేత్రాన్ని దర్శించడం వలన కుజగ్రహ దోషాలు తొలుగుతాయి.

2. అహోబిల నరసింహ స్వామి:

గురుగ్రహ అనుగ్రహానికి, గురుగ్రహ దోషాలు పోవడానికి అహోబిల నరసింహ స్వామి ఆరాధన ఉపయుక్తంగా ఉంటుంది. నిజానికి నారాయణుడు ఉగ్రనారసింహ అవతారం దాల్చి హిరణ్యకశపుని చీల్చి చెండాడిన స్థలం ఈ క్షేత్రమే అని స్థల పురాణం చెబుతుంది.
హిరణ్యకశపుని చీల్చి చెండాడిన నరసింహ స్వామి శక్తి సామర్ధ్యాలని చూసి,  దేవతలు అహో .. బలం, అహో బలం అని ఆశ్చర్యంతో పొగడేరట. అందుకే ఈ క్షేత్రానికి అహోబిల నరసింహ స్వామి దేవాలయంగా పేరు వచ్చింది అని చెబుతారు.

ముక్కోటి దేవతలు స్తోత్రము చేసినా కోపము తగ్గని నృసింహ స్వామిని ప్రహ్లాదుడు తపస్సు చేయగా, స్వయంభువై తనకు తానే సాలగ్రామముగా,
ఈ బిలములో వెలసారు. హరే తన గురువని భావించిన ప్రహ్లాదుని ప్రార్ధనని మన్నించి ,  గరుడాద్రి పర్వతం క్రింద భవనాశిని తీరములో  గుహలోపల స్వయంభువుగా వెలసి ప్రహ్లాదునికి స్వామి శాంతుడై దర్శనమిచ్చిన క్షేత్రం అహోబిలం.

3. మాలోల నరసింహ స్వామి: 

దేవ గురువు బృహస్పతి గురుగ్రహమైతే , అంతే శక్తివంతమైన రాక్షస గురువు శుక్రగ్రహమైన శుక్రాచార్యులు. ఆ గ్రహాదిదేవత అమ్మ లక్ష్మీదేవి.  శుక్ర గ్రహ దోషాలు పోవడానికి వేదాద్రి పర్వతం మీద లక్ష్మీ సమేతుడై కొలువు దీరారు నృసింహ స్వామి. ఆయనే మాలోల నరసింహస్వామి. 

“మా” అంటే అమ్మ లక్ష్మి దేవి. లోల అంటే ఆమె “ప్రియుడు” హరి  అని అర్ధం. ఈ  దేవాలయం ఎగువ అహోబిలానికి 1 కి.మీ దూరం లో ఉంది. 
ఈ ఆలయంలోని స్వామి వారు ప్రసన్నాకృతిలో దర్శనమిస్తారు. వేదాద్రి శిఖరంపైన వామపాదాన్ని మడిచి , దక్షిణపాదాన్నికిందకు వదలి సుఖాసీనుడై స్వామి లక్ష్మీదేవిని తన వామాంకముపై కలిగి ఉంటారు . భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఈ నరసింహా స్వామిని పూజించినవారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది.

4. వరాహ నరసింహస్వామి (క్రోడా).

రాహుగ్రహ అనుగ్రహానికి, ఆ గ్రహ సంబంధమైన  దోషాలు పోవడానికి ఈ క్రోడా నారసింహుని రూపము పూజించవచ్చు . వేదములను, భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోయాడు. అప్పుడు వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి, భూలోకం కిందకు వెళ్ళి సోమకాసురుని సంహరించి భూదేవి సహితంగా పైకితెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రమని పేరు. భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి. ఈ నరసింహా మూర్తిని దర్శించినట్లైతే  రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి.

5. కారంజ నరసింహస్వామి:

చంద్రగ్రహ అనుగ్రహానికి, తత్సంబంధమైన దోషాలు పోవడానికి కారంజ నరసింహుని అనుగ్రహాన్ని పొందాలి . కారంజ వృక్ష స్వరూపిమైన శ్రీ కారంజ నరసింహ మూర్తికి, అదే కరంజ వృక్షము క్రింద పద్మాసనంతో వేంచేసియున్న స్వామికి కారంజ నరసింహస్వామి అని పేరు.

ఆయన పగడలువిప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యాననిమగ్నుడై ఉంటారు . గోబిలుడనే మహర్షి తపస్సు చేసినందుకు ఈ స్వరూపంలో స్వామి  ప్రత్యక్షమైనారని స్థల పురాణం .  అంటే కాకుండా  శ్రీ ఆంజనేయస్వామి ఇక్కడ తపస్సు చేయగా, నృసింహస్వామి దర్శనమిచ్చారు . రామ రూపమే నిత్యమూ ఆజనేయుని మనసు రంజిల్లజేసేది. ఆ రూపంలో నృసింహస్వామి సాంగ (ధనస్సు) హస్తములతో దర్శనమిచ్చారు.  స్వామి రూపంలో రామునితో పాటుగా ఫాలనేత్రము (త్రినేత్రము) కూడా కలిగి ఉండడం విశేషం . ఆ విధంగా హరిహర స్వరూపమై విలసిల్లుతున్నారు . అందుకే అన్నమయ్య “పాలనేత్రానల ప్రబల విద్ద్యులత కేళి విహార లక్ష్మీనరసింహ” అని పాడారెమో !!

6. భార్గవ నరసింహస్వామి.

సూర్యగ్రహ అనుగ్రహానికి, రవి గ్రహ దోషాలు పోవడానికి భార్గవ నారసింహుని ఆరాధన శ్రేష్టమైనది . పరశురాముడు ఈ అక్షయ తీర్ధ తీరమందు తపస్సు చేయగా శ్రీ నృసింహాస్వామి హిరణ్యకశిపుని సంహరం చేసే స్వరూపంగా దర్శనమిచ్చాడు. అందువల్ల ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రమని పేరు.

ఈ స్వామిని “భార్గోటి” అని ప్రాంతీయ వాసులు పిలుస్తారు. పరశురాముని పూజలందుకున్న దివ్యధామము. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కి.మీ. దూరం లో ఉత్తర దిశలో  (ఈశాన్యము) ఉంటుంది. 

7. యోగానంద నరసింహస్వామి:

శనిగ్రహ అనుగ్రహానికి, శని దోషాలు పోవడానికి కొలుచుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈయన యోగపట్టముని కలిగి, యోగము ద్వారా ధ్యానించినవారిని అనుగ్రహించే దయాళువు . ప్రహ్లాదుడు  ఈ యోగ నృసింహుని అనుగ్రహంతో యోగాభ్యాసం చేశారట. 

అదేవిధంగా మనశ్చాంచల్యము కలిగిన బ్రహ్మ, నరసింహుని గురించి తపస్సు చేసి ఇక్కడ మన:స్ధిరత్వమును సాధించారు. ఈ ప్రదేశము యోగులకు, దేవతలకు నిలయం. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. 

8. చత్రవట నారసింహస్వామి:

కేతుగ్రహ అనుగ్రహానికి, ఆ గ్రహ దోషాలు పోవడానికి ఛత్రవట నారసింహుని ఆరాధన శుభప్రదం . పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈమూర్తి చాలా అందమైన ఆకర్షణీయమైన మూర్తి. “హా హా” “హుహ్వా” అనే  ఇద్దరు గంధర్వులు అతి వేగముతో గానం చేసి నృత్యం చేయగా, నృసింహస్వామిసంతోషించి వారికి శాప విమోచనం ప్రసాదించారు . కిన్నెర, కింపుర, నారదాదులు కూడా  ఈ క్షేత్రంలో  గానం చేశారట. సంగీతాన్ని అనుభవిస్తూన్నట్టు ఉండే ఈ స్వామిని
చత్రవట స్వామి అని పిలుస్తారు.

9. పావన నరసింహ స్వామి:

బుధగ్రహ అనుగ్రహానికి, ఆ గ్రహ దోషాలు పోవడానికి పావన నారసింహ స్వామిని అర్చించాలి . పరమపావన ప్రదేశం లో ఏడుపడగల ఆదిశేషుని క్రింద కొలువుదీరిన మూర్తి. ఈ స్వామివారి పేరులోనే సమస్త పాపములను,
సంసారం లో జరిగే సుఖ:దుఖా:లను తొలగించగలిగేవాడని అర్థం చేసుకోవచ్చు.

ఈ ప్రదేశంలో భరద్వాజఋషి తపస్సు చేశారు.  స్వామి వారు మహాలక్ష్మీ సహితంగా ఇక్కడ వారికి దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఈ క్షేత్రాన్ని పాములేటి నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎగువ అహోబిలానికి 6 కి.మీ. దూరములో
దక్షిణ దిశలో యున్నది. పాపకార్యములు చేసినవారు ఈ స్వామిని దర్శించనంతనే పావనులవుతారు. బ్రహ్మోత్సవముల దగ్గరనుండి ప్రతి “శనివారం” నృసింహ జయంతి వరకు అద్భుతంగా వేడుకలు జరుగుతాయి.

ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వారి వారి కష్టములను, పాపములను భగవంతుని ప్రార్ధనా రూపముగా సేవించి దర్శించుకుంటారు. ఈ నరసింహా మూర్తిని పూజించిన వారికి బుధగ్రహ అనుగ్రహం లభిస్తుంది అని ప్రతీతి .

ఈ విధంగా నవ నారసింహ క్షేత్రాలనూ దర్శించినవారికి నవగ్రహ దోషాల నుండీ విముక్తి లభిస్తుంది . శుభం !

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba