తారకాశురుడు పాలించిన ప్రాంతం
తారకాశురుడు పాలించిన ప్రాంతం ఎక్కడుందో తెలుసా !
లక్ష్మీ రమణ
తారకాసురుణ్ణి వధించడానికి మన్మధుడు ఆ ముక్కంటి అగ్నికి బలయ్యాడు . ఆతర్వాత, తాపసి అయిన శివుడు పార్వతీదేవిని చేపట్టి , సంసారిగా మారారు . అగ్ని, వాయువు కలిసి కృత్తికల గర్భంలో శివుని తేజస్సుని ప్రవేశపెడితే, అప్పుడు అవతరించాడు, ఆ రాక్షసుణ్ణి మట్టుబెట్టగలిగిన శక్తి కుమారస్వామి . అసలు ఇది నిజమేనా ? అంటే నిజమే, ఆ తారకాశురుడు చనిపోయినప్పుడు ఇక్కడే అతనికి తర్పణాలు వదిలారని స్థలాన్ని చూపుతుంది తణుకు ! ఆ వివరాలు తెలుసుకుందాం పదండి .
పూర్వం వజ్రాంగుడనే రాక్షసుడు ఉండేవాడు ఆయనకి పుట్టిన కుమారుడే తారకాసురుడు. ఆ తారకాసురుడు సృష్టిలో తనకు సమానమైన బలం కలిగిన వీరుడు లేకుండా ఉండే వరం పొందాలని బ్రహ్మని గురించి తీవ్రమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి మెచ్చి బ్రహ్మ, తారకాసురునికి వరం ప్రసాదిస్తాడు. ఆ వరమే పరమేశ్వరుని తేజస్సుతో తప్ప , మరెవరిచేతిలోనూ మరణం తారకాసురుడుకి సంభవించిందని.
బ్రహ్మ వరం ఇచ్చిన తర్వాత, ఆ రాక్షసుడు విజ్రుంభించి అన్ని లోకాల వారినీ బాధించడం మొదలుపెడతాడు . ఆ సమయంలో ఇప్పుడు తణుకు గా పిలుస్తున్న తారకాపురిని తన రాజ్యపు రాజధానిగా చేసుకొని తన రాజ్యాన్ని నడిపేవాడని చెబుతారు.
ఆ తారకాసురుని సంహరించడానికి వీరభధ్రుడు దేవగణానికి సైన్యాధ్యక్షుడై వచ్చాడని ప్రతీతి.. వీరిరువురి మధ్యన జరిగిన భీకర యుద్ధంలో కుమారస్వామి తారకాసురుని వధించిన తరువాత కుమారుడు ఇంద్రునికి అల్లుడైనాడు. ఈ యుద్ధం నుండే చాలా గ్రామాలకు పేరు స్థిర పడినట్లుగా చెబుతారు. కుమారస్వామి భూమిపై అడుగిడిన ప్రాంతాన్ని కుమరవరం గా, తణుకు సరిహద్దు గ్రామమైన వీరభధ్ర పురం వీరభధ్రుడికి విడిది అని, అలాగే దేవతలు విడిదియై ఉన్న గ్రామమం వేల్పూరు (వేల్పుల ఊరు, వేల్పులు = దేవతలు) గా పేరొందడాన్ని మనం గమనించవచ్చు . ఇక ఈ కథను బలపరిచే విధంగానే వేల్పూరు గ్రామంలో ఎన్నోఆలయాలు ఉంటాయి . ఈ ఆలయాల సంఖ్య దాదాపు 101కి పైనే ఉంది.అలాగే ఇంద్రుడు విడిది చేసిన ప్రాంతాన్ని ఇల్లింద్రపర్రు గానూ, అలాగే కావలిపురం, మహాలక్ష్మి చెఱువు మొదలైనగ్రామాలు ఈ కథకి అనుసంథానంగానే కనిపిస్తాయి .
శివపార్వతులకు జన్మించిన కుమారస్వామి తారకాసురుడితో యుద్ధం చేసి, ఆ యుద్ధంలో అతడిని సంహరిస్తాడు. .వీరిరువురి మధ్యన జరిగిన భీకర యుద్ధంలో కుమారస్వామి తారకాసురుడుని వధిస్తాడు. ఆ తారకాసురుడు రాజధానిగా చేసుకున్నందున ఈ ప్రాంతానికి తారకాసురపురం/తారకాపురం తదుపరి తారకపురి కాలక్రమేణా తణుకు గా వచ్చిందని చరిత్ర చెబుతోంది మనకి.
తణుకులో ఇప్పుడున్న పాతూరు లో యన్టీఆర్ పార్క్ లో ఒకప్పుడు చెరువు ఉండేది ఆ చెరువుగట్టునే చనిపోయిన తారకాసురుడికి పిండప్రదానాలు చేశారనికూడా విశ్వసం .