కాశీలో మరణం తర్వాత ఏం జరుగుతుంది ?
కాశీలో మరణం తర్వాత ఏం జరుగుతుంది ?
లక్ష్మీ రమణ .
కాశీ (వారణాశి) క్షేత్రం గురించి తెలియనివారు ఎవరుంటారు. కాశీలోని విశ్వేశ్వరుడే ఈ జగతికి తండ్రి, ఆ విశాలాక్షే తల్లి . వారి సమక్షంలో మరణం సంభవించడం చాలా పవిత్రమని భావిస్తారు. ‘ కాశ్యాన్మరణాన్ముక్తిః’ అని కదా ఆర్యోక్తి . హిందువులందరికీ ఈ నమ్మకం చాలా బలంగా ఉంటుంది. ఎవరైనా చనిపోయినా వారి ఆస్తికలని, కాశీలోని గంగలో కలిపితే, వారికి ముక్తి లభిస్తుందని విశ్వశిస్తారు . అయితే, ఇది నిజమేనా ? మనకి సాక్ష్యం ఉంది. సాక్షి కూడా ఉన్నారు.
రామకృష్ణ పరమహంస కాళీమాత యొక్క మాతృప్రేమని సంపూర్ణంగా ఆస్వాదించిన మన కాలం నాటి మహర్షి. ఆయన కులాలు, మతాలూ, తెగలకు అతీతమైన విశ్వేశ్వరి తత్వాన్ని అర్థం చేసుకున్న మహానుభావుడు. రోజులకి తరబడి తానునున్న పరిస్థితికి అతీతంగా సమాధిని పొందుతూ ఉండేవారు. ఆయన సమాది స్థితికి వికశించిన ఒకపూవో , వర్షించిన ఒక మేఘమో , ఎగురుతున్న చక్కని పక్షుల గుంపో కూడా కారణం గా ఉండేది .
కాశీలో మరణం పొందిన జీవి యొక్క అదృష్టాన్ని గురించి ఆ రామకృష్ణులు స్వయంగా దర్శించి చెప్పిన విశేషాలు మనకి రామకృష్ణుని జీవిత సంగ్రహంలో మనకి లభిస్తాయి . ఓకసమయములో రాణిరాసమణి తనపరివారము, అల్లుడు మథుర్, కొంతమంది పండితులు, రామకృష్ణుల వారితో కలసి కాశీ నగర సందర్శనకు నౌకల్లొ బయలుదేరారు. అలా కాశీలో వున్న రోజులలొ ఓకనాడు మధుర్, ఇంకొంతమంది పండాలతో కలసి గంగానదిపై విహారము చేస్తున్నారు.
ఆ పడవ మణికర్ణికా ఘాట్ సమిపించగా, అక్కడి స్మశానములో జరుగుతున్న శవదహనాన్ని చూసి, అకస్మాత్తుగా ఆనందపరవశులై వడిగా పడవ అంచుకు వెళ్ళి సమాధిమగ్నులై నిలబడిపొయారు. ఆ పరిస్థితులలొ సాధారణముగా దేహస్మృతి వుండదు. అందువలన ఆయిన ఎక్కడ నదిలో పడిపొతారోఅని కొందరు రివ్వున ముందుకు వెళ్ళారు. కాని ఆయిన దివ్యదరహాసాలతో నిశ్చలముగా అక్కడ నిలబడి ఉన్నారు. ఏదో దివ్యలోకాలలో అనిర్వచనీయమైన దృశ్యాలని వీక్షిస్తున్న భావం మాత్రం ఆయన మోములో కదలాడ సాగింది. ఎవ్వరు కాపాడవలసిన అవసరము రాలేదు .
ఆ తర్వాత కొంత సేపటికి తెప్పరిల్లిన రామకృష్ణులు సమాధిలోని వారి నుభూతిగూర్చి ఇలా వివరించారు. "పొడుగుగా ఉండి, పింగళవర్ణ జటలు కలిగిన శ్వేతవర్ణ పురుషుడు మెల్లగా ఆడుగులు వేస్తూ ప్రతి చితి వద్దకు వెళ్ళి, నెమ్మదిగా అందలి జీవుని పైకెత్తి, చెవిలో తారకబ్రహ్మ మంత్రము ఉపదేశించడము చూశాను! సర్వశక్తిమయి అయిన జగదాంబ - ఆ కాష్ఠానికి ఆవలి వైపు కూర్చుని, ఆ జీవుడి స్థూల, సూక్ష్మ, కారాణాది బంధాల నన్నిటిని విడదిసి, స్వయముగా మోక్షద్వారము తెరచి, కైవల్య ధామానికి పంపుతున్నది.
ఎన్నో యుగాల తపొనిష్ఠచేత మాత్రమే పొందగ్గ అద్వైతానుభవాన్ని, మోక్షప్రాప్తిని శ్రీ విశ్వనాధుడు క్షణములో ఆ జీవులకు యీ రీతిగా ప్రపాదించి వారిని కృతార్థులను చేస్తున్నాడు”. అని . రామకృష్ణ పరమహంసవారి జీవిత చరితలో ఇటువంటి ఉదంతాలు, ఆయన చెప్పిన చిన్న చిన్న కథలు దాని ద్వారా బోధించిన పరమాత్మ స్వరూపదర్శన సత్యాలూ చాలా అద్భుతంగా ఉంటాయి. సత్యాన్ని నిరూపించే సాక్ష్యాలుగా మన కనుల ముందు సాక్షాత్కరిస్తాయి .