రామయ్య సేవలో త్యాగయ్య...
రామయ్య సేవలో త్యాగయ్య... త్యాగయ్య భక్తికి రాముడే వారింటికి వచ్చిన దివ్య వైనం..
భక్తియోగం
కేశవుడు అప్రమేయుడు. భక్తుడి కోసం సేవకుడిగా మారడానికి సైతం ఆయన సిద్ధంగా ఉంటాడు. తనను స్మరిస్తూ గానం చేసేవారంటే ఆ నాద ప్రియుడికి అమితమైన ఇష్టం.
భక్తుడు విహ్వలత్వంతో ఆయన్ని గానం చేస్తూ ఉంటే భగవంతుడు తనకు తానుగా రావాల్సిందేనని నారద భక్తి సూత్రాలు చెబుతున్నాయి. దేవుడిపై విశ్వాసంతో చేసే యజ్ఞాలు, దానాలు, తపస్సు స్మరణం కీర్తనం సేవలు జపతపాలు... అన్నీ పరమాత్ముణ్ని పొందేందుకు అనువైన సాధనాలు.
వాగ్గేయకారుడు త్యాగయ్య శ్రీరామ భక్తుడు.
సంగీతాన్నే భగవంతుణ్ని దరి చేర్చే మార్గంగా భావించాడు. వివాహానంతరం ఊంఛ(భిక్షాటన) వృత్తిని అవలంబించి జీవించడం అలవరచుకున్నాడు. త్యాగయ్యకు లభించిన ఆహార దినుసులను భార్య కమలాంబ వండి రాముణ్ని ఆరాధించి నైవేద్యం సమర్పించిన తరవాతనే ఆ దంపతులు భోజనం చేసేవారు
ఒకసారి తిరువారూర్ వీధుల్లో శ్రీరామ సంకీర్తన చేస్తూ జోలె వేసుకుని నడుస్తుండగా ఆయన పాదంలోకి ఒక ముల్లు లోతుగా దిగింది. ఆ బాధ తీవ్ర వ్రణంగా మారింది. ఊంఛవృత్తి కొనసాగించలేని రెండు రోజులు ఆ దంపతులు భోజనం లేక పస్తులున్నారు. త్యాగయ్య తన రాముడికి నైవేద్యం సమర్పించలేక దైవాన్ని సైతం పస్తులు ఉంచాననే బాధలో- ‘యోచనా కమల లోచనా ననుబ్రోవ సూచన తెలియకనొరుల యాచనజేతు ననుచు, నీకు తోచెనా (దర్బారు) అంటూ ఆర్ద్రంగా గానం చేశాడు.
మూడో రోజు పగటి వేళ ఒక స్త్రీ, నలుగురు పురుషులు త్యాగయ్య ఇంటి ముందు నిలుచుని- ‘అయ్యా! మేం ప్రదోష వేళ గుడిలో పురాణ కాలక్షేపం చేసి భక్తులు సమర్పించే తృణమో పణమో స్వీకరించేవాళ్లం. మధ్యాహ్నం భోజనం వండుకోవడానికి స్థలం లభించక మీ ఇంటికి వచ్చాం. మావద్ద దినుసులు ఉన్నాయి. మీ ఇంట్లో వంట చేసుకోవడానికి అనుమతి ఇస్తారా?’ అని అడిగారు. త్యాగయ్య సంతోషంతో వాళ్ల వంట కోసం భార్యను పురమాయించాడు. వాళ్ళు లోపలికి రావడం, ఒకరికొకరు సహాయం చేసుకొంటూ వంట చేసుకోవడం ప్రారంభించారు.
కొద్ది సేపట్లో వంట సిద్ధం అయినట్లు ఘుమఘుమలు పరిమళించాయి. లోపలి నుంచి ఒకరు వచ్చి ‘అయ్యా, వంట సిద్ధం. మీరు మళ్ళీ వండుకోనక్కరలేదు. అన్న ప్రసాదాన్ని పెరుమాళ్ళకు నివేదిస్తే మనం అందరం కలిసి భోజనాలు చేసేద్దాం’ అంటూ ఆహ్వానించాడు. వంటకాల సువాసనలు కోవెలలో అర్చామూర్తికి సమర్పించే నైవేద్యంలా ఉన్నాయి. తన రాముడికి నైవేద్యం అందుతున్నదనేసరికి త్యాగయ్య ఆనందానికి అవధులే లేవు.
శ్రీరాముడికి హారతి సమర్పిస్తూ- ‘రామా నిను నమ్మినవారము గామా... సకల లోకాభిరామా’ (మోహన) అంటూ పారవశ్యంతో గానం చేశాడు. అనంతరం, వచ్చిన వారితో కలిసి అందరూ భోజనం చేశారు. వంటకాల రుచిని గమనించిన త్యాగరాజు- ‘దేవతలు తినే భోజనంలాగా ఉంది’ అన్నాడు. చిరునగవుతో వారైదుగురు వంటశాలలోకి వెళ్ళారు. ఎంతో సమయం గడిచినా తిరిగి రాలేదు. త్యాగయ్య, కమలాంబ వెళ్ళి చూస్తే- అక్కడ ఎవరూ లేరు. ఆ వంటగది నుంచి వెలుపలికి మరో దారి లేదు. వండిన వంటకాలు వేడి వేడిగా అలాగే పాత్రల్లో పొగలు కక్కుతున్నాయి. అప్పుడు తెలిసింది త్యాగయ్యకు- ఆ వచ్చింది శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని. భగవంతుణ్ని ఆరాధించడమే భక్తి అని పరాశరుడు తెలిపాడు. భక్తి మార్గాలన్నింటికన్నా ఆత్మనివేదన మోక్షానికి సులభమైన మార్గం. త్యాగయ్య సాధించిన భక్తి యోగం అదే.
లోక సమస్త సుఖినోభవంతు
మీ శ్రీహరి పంతులు సత్యవాడ