Online Puja Services

దృఢ సంకల్పం

18.224.21.26

దృఢ సంకల్పం ఉండాలి గానీ, దివిలో నక్షత్రంగా వెలగడం అసాధ్యమేమీ కాదు !
-లక్ష్మీ రమణ 

మన పురాణాలు, ఇతిహాసాలూ మనసు పెట్టి చదవాలేగానీ, వ్యక్తిత్వవికాస తరగతులకు ధీటైన శిక్షణని ఇస్తాయి. వాటిని అర్థం చేసుకోని అమలు చేయడం ఒక్కటే మనం చేయాల్సినది . మన సంకల్పం ఎంతగట్టిగా ఉంటె, అంతటి ఉన్నతస్థాయిని చేరుకోవడం కష్టమేమీ కాదని ధృవుడి వృత్తాంతం మనకి తెలియజేస్తుంది .  

ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు. వారి పేర్లు సునీతి, సురుచి. రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీతి  పేరుకే రాణి. దాసికన్నా హీనంగా ఉండేది ఆ అంతఃపురంలో ఆమె స్థానం. సురుచిదే పెత్తనం అంతా ! సునీత కొడుకు ధ్రువుడు.  తండ్రి ప్రేమను పొందాలని అనుకోని చిన్నారి ఎవరుంటారు. ధృవుడు కూడా అలాగే ఆశపడ్డాడు .  కాని తండ్రి, పిన తల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ద్రువునికి తండ్రి ప్రేమ మాట అటుంచితే, ఆయన దర్శనమే కరువయ్యేది .

ఒక రోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ఒడిలో కూర్చోబోతున్న ధృవుణ్ణి పినతల్లి రెక్కపట్టుకుని ఇవతలికి లాగేసింది. అంట కఠినంగా ప్రవర్తించడమేకాకుండా , "ధ్రువా! నీవు నా కడుపున పుడితే, మీ తండ్రిగారి తొడపై కూర్చొనే అదృష్టం కల్గేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్ధించు. అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది" అని పరుషంగా ఈసడించింది . పాపం, చిన్నారి ధృవునికి  దుఃఖం ఆగలేదు . 

పరిగెత్తుకుంటూ వెళ్లి , జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి "నాయనా ధ్రువా! నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ అందరికీ కావాల్సిందే ! నీవు ఈ జగత్తుకే తండ్రి అయినా ఆ శ్రీహరిని ఆశ్రయించు . ఉత్తమమైన స్థానాన్ని అర్థించు . శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి " అని ధర్మాన్ని ఉపదేశించింది . 

తల్లి సునీతి  మాటలకు ధ్రువుడు సంతోషపడి, తపస్సు చేసుకోవడానికి  బయలుదేరాడు. మన సంకల్పం బలంగా ఉండాలి గానీ, దారిచూపే గురువు లక్ష్యంవైపు నడిపించేందుకు స్వయంగా ఎదురై వస్తారు. అలా దారిలోనే  ద్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలిసుకొని, నవ్వుతూ "నాయనా ధ్రువా! పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు! చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో" అన్నాడు. అలా బోధించపోతే, ధృవుని  సంకల్పం ఎంత దృఢమైనదో ఆయనకీ తెలియదు కదా మరి ! 

నారదుని మాటలకు ధ్రువుడు "మహర్షీ! నా పినతల్లి మాటలు  నాలో రేపిన బాధ అంత,ఇంత కాదు. ఉత్తముని కన్న నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందడానికి నేను కఠోర తపస్సు చేస్తాను" అని చెప్పాడు. "పట్టుదల గట్టిదే. నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యి" అని ఆశీర్వదించి హరినామోపదేశం చేసి, నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి, దీక్షతో కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు.

అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలతో ఆయన్ని  స్తుతించాడు. అంతట విష్ణుమూర్తి "ధ్రువా! నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంత వరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ, సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై, ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని 'ధ్రువ నక్షత్రం' అని పిలుస్తారు" అని వరమిచ్చి అంతర్దానమైనాడు. 

నేటికీ కనబడే ఉత్తర ద్రువంపై ఉజ్వలంగా వెలుగుతూ దర్శనమిచ్చే నక్షత్రమే ధ్రువనక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి, అనుకున్నది సాధించాడు. అలాగే మనం కూడా పట్టుదల ధృడ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించ వచ్చు అని తెలుసుకోవాలి.

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha