స్వయంగా ఆ దేవీదేవి వండి వడ్డించిన భోజనం
స్వయంగా ఆ దేవీదేవి వండి వడ్డించిన భోజనం రుచి చూడాలంటే ,
లక్ష్మీ రమణ
కావ్య కంఠ గణపతి ముని - ఈ పేరుతో పరిచయం ఉన్నవారు ఇప్పటి తరంలో కాస్త తక్కువే! కానీ, మన తాతగారి కాలంవారు ఈ పేరు వినగానే వెంటనే లేచి నిలబడి భక్తితో నమస్కారం చేస్తారు. కపాల బీడీ జరిగినా గానీ జీవించి ఉన్న అపార గణపతి అవతారం శ్రీ కావ్యకంఠ గణపతి శాస్త్రి . అపార విజ్ఞాన సంపదతో సంస్కృత కావ్యాలు రచించి, మంత్రోపాసన, తపస్సాధన చేసిన ఆయన మన స్వాతంత్రోద్యమంలోనూ పాలుపంచుకోవడం విశేషం . స్వయంగా ఆ అమ్మవారి చేతి భోజనం చేసిన ఆయన అదృష్టాన్ని యేమని వర్ణించగలం ?
రమణమహర్షి శిష్యులుగా గణపతి మునిని చెబుతారు. మరో విశ్వాసం ఏమిటంటే, గణపతి ముని స్వయంగా గణపతి అంశేనని , శ్రీ రమణులు సుబ్రహ్మణ్యుని అవతార విశేషమనీ ఆయన అనునూయులు చెబుతారు . అసలు బ్రాహ్మణస్వామిగా , మౌన దీక్షలో ఉన్న రమణ మహర్షిని మాట్లాడించి , ఆయనకీ భగవాన్ రమణ మహర్షి అని నామకరణం చేసినదే గణపతి ముని. అందుకే రమణులు ఆయన్ని నాయన అని పిలిచేవారు . గణపతి ముని గొప్పదనం ఒక కథలో, ఒక సంఘటనతో చెప్పుకుంటే తీరేది కాదు. అక్షరాలూ కూడా యేమని చెప్పాలో తెలియని అయోమయానికి గురయ్యే అద్భుతం ఆయన .
ఒకసారి గణపతిముని అరుణాచలం వెళ్లారు. వారితోపాటు వారి తమ్ముడు కూడా వచ్చారు . పిల్లలకి ఆకలి కాస్త ఎక్కువగానే ఉంటుంది మరి . ఆ పిల్లాడు అన్నయ్యా ఆకలేస్తోంది అంటున్నాడు. ఆ రోజున ఏకాదశి తిధి. పూర్వం ఏకాదశి వ్రతాన్ని అత్యంత నియమంగా చేసేవారు . అందుకని ఆయన తన దగ్గర ఉన్న డబ్బులతో ఒక డజను అరటిపళ్ళు కొన్నారు. ఆ అబ్బాయి అవన్నీ తినేశాడు. ఒక గంట గడిచేసరికి మళ్ళీ అతడు, అన్నయ్యా ఆకలేస్తోంది అన్నాడు. అపుడు గణపతి ముని బ్రాహ్మణుల ఇంటి ముందుకు వెళ్లి 'భవతీ బిక్షామ్ దేహీ' అంటూ ఎవరైనా అన్నం పెడితే తమ్ముడికి పెడదామని యాచన చేస్తున్నారు. ఆ రోజు ఏకాదశి. ఎవ్వరూ అన్నం పెట్టలేదు. ఆ అబ్బాయి ఏడుపు కూడా అందుకున్నాడు . అపుడు ఆయన ఒక శ్లోకం చదివారు. బ్రాహ్మణ గృహంలో ఎవరైనా అకస్మాత్తుగా వస్తే పెట్టడాడనికి కొద్దిగా అన్నం ఉండేటట్లుగా వండాలి."ఆఖరికి కలియుగంలో వీళ్ళ అన్న పాత్రలలో అన్నం కూడా లేదన్నమాట! ఒక్కడు కూడా అన్నం పెట్టలేదు" అని ఆయన అనుకున్నారు.
అలా ,ఆయన ఒక ఇంటి ముందునుంచి వేడుతున్నారు. ఆ ఇంటి అరుగుమీద ఒక వృద్ధ బ్రాహ్మణుడు పడుకుని ఉన్నాడు. ఆయన గభాలున లేచి కావ్య కంఠ గణపతి మునిని పట్టుకుని అన్నాడు. 'నీవు బాగా దొరికావు. భిక్ష కోసం ఎదురుచూస్తున్నావ్ . నా భార్య కు ఒక నియమం ఉంది. అందరూ ఏకాదశి వ్రతం చేసి మరునాడు ఉదయం పారణ చేస్తే నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది. కానీ భోజనం చేసేముందు ఆవిడకు ఒక నియమం ఉంది. ఆవిడ ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది. ఇవ్వాళ తిరువణ్ణ మలైలో యాత్రికులు కూడా దొరకలేదు. ఎవ్వరూ దొరకలేదు. నువ్వు ఆకలని తిరుగుతున్నావు. మా ఇంట్లో కి రా! అని తీసుకు వెళ్ళాడు. ఆ ఇంట్లోని ఇల్లాలు ‘ మీరు స్నానం చేసి రండి, భోజనం వడ్డిస్తాను' అంది.
కావ్యకంఠ గణపతి ముని, ఆయన తమ్ముడు గబగబా వెళ్లి స్నానం చేసి తడిబట్టతో వచ్చారు. ఆవిడ మడి బట్టను ఇచ్చింది. అవి కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. ఆవిడ షడ్రషోపేతమైన భోజనం పెట్టింది.
భోజనం అయిన తరువాత ఆవిడ చందనం ఇచ్చింది. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే భోజనం అయ్యాక చందనం పెట్టాలి. వారు అది చేతులకి రాసుకుని లేవాలి. అది ఇంటి యజమానే తీస్తే దానివలన ఎంతో గొప్ప శ్రేయస్సు ను పొందుతాడు. వాళ్ళు చందనం రాసుకున్నాక ఆవిడ తాంబూలం ఇచ్చింది.
వీళ్ళు కడుపునిండా తినేసారేమో కళ్ళు పడి పోతున్నాయి. 'అమ్మా , ఇంక ఎక్కడికీ తిరగలేం. ఈ రాత్రికి మీ అరుగుమీద పడుకుంటామమ్మా!' అన్నారు. ఆవిడ సరేనని ఆవిడ తలుపు వేసేసింది. వీళ్ళిద్దరూ పడుకుని నిద్రపోయారు. గాఢ నిద్ర పట్టేసింది. వీరు నిద్రించిన ఇల్లు అరుణాచలం లో అయ్యంకుంట్ల వీధిలో ఉంది.
మరునాడు సూర్యోదయం అవుతుంటే వారికి మెలకువ వచ్చింది. ఇద్దరూ నిద్ర లేచారు. 'అమ్మయ్య రాత్రి ఈ తల్లి కదా మనకి అన్నం పెట్టింది' అనుకుని అరుగుమీద నుండి లేచి చూసారు. అది వినాయకుడి గుడి. అక్కడ ఇల్లు లేదు. వాళ్ళు తెల్లబోయి 'రాత్రి మనం షడ్రషోపేతమైన భోజనాలు తిన్నాము. ఇక్కడ రత్నకింకిణులు ఘల్లుఘల్లు మంటుంటే ఎవరో ఒక తల్లి మనకి అన్నం పెట్టింది. ఆ తల్లి ఇల్లు ఏది'అని చూసారు. కలకాని కన్నామా అనుకున్నారు. పక్కకి చూస్తే రాత్రి ఆవిడ ఇచ్చిన తాంబూలాలు ద్రవ్యంతో కూడా ఆ పక్కనే ఉన్నాయి.
అది కదా అద్భుతం. ఇప్పుడు వారిని భోజనానికి పిలిచి వెంట బెట్టుకొని వెళ్లిన ఆ వృద్ధుడు , వడ్డించిన ఆ మహాఇల్లాలు ఎవరు ? స్వయంగా ఆ భగవంతుడు కాదా ? ఆర్తితో, ప్రేమతో , భగవంతుని అర్చిస్తే, చాలు. మన అవసరాలు కనిపెట్టి ఆయనే మన వెంట తిరుగుతూ ఉంటాడు . కాబట్టి మనం చేయాల్సిందల్లా కేవలం స్వచ్ఛమైన భక్తితో భగవంతునికి అర్పితం కావడమే !