కబీరు రామనామోపదేశం పొందేందుకు వేసిన ఎత్తు
కబీరు రామనామోపదేశం పొందేందుకు వేసిన ఎత్తు !
సేకరణ: లక్ష్మి రమణ
గురువు అనుగ్రహం శిష్యుని మీద ఎప్పుడు ఎలా ప్రకాశిస్తుందో చెప్పలేం . ఆయన ఆచార్యుడు కావొచ్చు, లేదా నిరంతరం ఆత్మానందంలో మునిగివుండే మహాయోగి కావొచ్చు. శిష్యుని మీద వాత్సల్యం అనేది ఉదయించాలేగానీ , సప్తసముద్రాలనైనా ఒక్క క్రీగంటి చూపుతో దాటించగల సమర్థుడాయన . అందుకేగదా, గురు అనే పదంలోని ‘గు’ అనే అనే శబ్దానికి అంధకారం అనే అర్థమైతే , దాన్ని పోగొట్టి జ్ఞానదీపాన్ని వెలిగించడం అనే అర్థం లో ఆ అక్షరానికి ‘ రు’ అనే శబ్దాన్ని జతచేశారు. అటువంటి గురువు ఉద్దేశ్యపూర్వగా మంత్రోపదేశమే చేయాల్సిన అవసరంలేదు . దాన్ని బలపరిచే, ఉటంకించగలిగిన ఏ సాధారణ సందర్భమైనా, అది ఉపదేశమే. కబీరు కథ ఇదే కదా మనకి బోధిస్తుంది .
ఒక గురువు శాస్త్రోపన్యాసాలు చేయకపోవచ్చు. స్నాన,జపాదులు, యజ్ఞయాగాదులు నిర్వహించి సంప్రదాయ బద్ధమైన ఆచార వ్యవహారాలతో కనిపించకపోవచ్చు. బాహ్యానికి కనిపించని ఆత్మాగ్నిలో నిత్యం లయించి తరించిపోతూ , బ్రహ్మానికి , తనకీ అభేదమైన స్థితిలో తనువుమీది స్పృహనిమరచి ఉండొచ్చు. కానీ ఆయన్ని గురువు అని ఒక జీవుడు అనుకున్నంత మాత్రం చేత ఆ గురువుతో , శిష్యునికి తెలీని సంబంధం ఏదో ఏర్పడుతుంది. దానికి ఆ గురువు అయిష్టతని వ్యక్తం చేయొచ్చు. కానీ ఆయన పాడాలని శరణు వేడి , స్థిరమైన చిత్తంతో ఆ పాడాలని ఆశ్రయిస్తే, ఆయన కరుణ తప్పక కలుగుతుంది . నిజానికి అటువంటి ఒక బంధం ఏర్పడడానికి కారణం కూడా ఆ గురువు యొక్క అనుగ్రహమే కానీ వేరు కాదు .
ఏకలవ్యుడు ద్రోణాచార్యునికి శిష్యుడు ఎలా అయ్యాడు? ఆయన అప్రత్యేకించి ద్రోణునిదగ్గర విద్యని నేర్చుకోలేదు . ద్రోణుడు పాఠం చెప్పనూలేదు. అయినా, ఆ అనుబంధం వారి మధ్య ఏర్పడింది . అలాగే, షిరిడీసాయి ఒకానొక సందర్భంలో తన సన్నిధిలో మంత్రోపదేశాన్ని కోరి ఉపవశించి ఉన్న మహిళని ఆశీర్వదించి, ఉపవాసం చేయొద్దని చెప్పి పంపించారు. మరోసారి ఇంకొకావిడకి ‘ రాజారాం’ అనే మంత్రాన్ని ఉపదేశించారు . ఇటువంటి లీలలు సాయి కథలో కోకొల్లలు.
ఆ విధంగా సద్గురువు యొక్క అనుగ్రహం కలిగేదాకానే జీవుడు ప్రాపంచిక బాధలు అనుభవిస్తాడు . ఆ ఒక మహాత్ముని ముందు, ఎంతోకాలం ఒకడు పడిగాపులు కాస్తూ వుంటాడు. ఆ గురుదేవునికి అనుగ్రహం హఠాత్తుగా కలిగి , ఆ మహాత్ముడు మంత్రోపదేశం చేస్తాడు. అంతే , ఇక ఆ క్షణం నుంచీ అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. జన్మ తరించి, ముక్తికాంత వారి పాదదాసమై పోతుంది . అటువంటి గురువు అనుగ్రహం కోసం తపించినవారిలో కబీరుకూడా ఒకరు. ఇక్కడ మతమనేది ఒక మోహపు తేరా మాత్రమే అని, పవితమైన ఆత్మకి అది అడ్డురాదని విషయాన్ని పాఠకులు గమనించాలి .
కబీరు పుట్టుక చేత మహ్మదీయుడు . కానీ మహా జ్ఞాని. ఈశ్వరుడు , అల్లా అనేవి నీకున్న వేరువేరు పేర్లేకదా రామయ్య ! అని పాడుకున్న వాడు . రామానందులనే మహాత్ముని వద్ద కబీరు రామ మన్త్రోపదేశం పొందాలని తపించారు . కానీ అతడు ముస్లిము. అతడు హిందువే అనీ, ముస్లిములచేత పెంచబడ్డాడనీ కొందరు అంటారు. ఏదేమైనా , రామానందులు తనకు మంత్రోపదేశం యివ్వరేమో అని కబీరుకి ఒక సందేహం తోచింది. ఎట్లాగైనా మంత్రాన్ని ఆయన వద్ద పొందాలని ఒక ఎత్తువేశారు.
ఒకరోజు బ్రాహ్మీ ముహుర్తంలో రామానందులు గంగకు స్నానానికి వచ్చారు. కబీరు గంగానదీ స్నానఘట్టంలో మెట్లమీద పడుకొని వున్నారు. చీకటిగా వున్నందున రామానందులు పడుకొని వున్న కబీరు మీద పాదాలు మోపారు. కబీరు దానినే పాదదీక్షగా గ్రహించాడు. ఎవరినో త్రొక్కినట్లు తోచగానే రామానందులు 'రామరామ' అని పాదాఘాతానికి ప్రాయశ్చిత్తంగా గట్టిగా ఉచ్ఛరించారు. కబీరుకు అదే ఉపదేశమైంది. తారకమంత్రాన్ని ఏ విధంగానైనా రామానందులనుండి పొందాలనే కబీరు ఈ పన్నాగం పన్నినారు.
రామానందుల వారు ఉద్దేశపూర్వకంగా కబీరుకు మంత్రోపదేశం చేయకపోవచ్చు . కానీ ఆయన రామరామ అనగానే, శిష్యుని సంకల్పంవలన, వారి అనుద్దేశపూర్వకమైన ఉచ్ఛారణ వలనా, గురుశిష్య సంబంధం ఏర్పడినదని చెప్పేందుకే ఈ ఉదాహరణ.
మంత్రోపదేశాన్ని చేసినవానిని గురువంటారు. ఈ మంత్రోపదేశం చేత గురుశిష్యులమద్య ఒక లంకె ఏర్పడుతుంది. ఆ మంత్రాన్ని వివరించవలసిన అవసరమూలేదు. అది ఆచార్యుని పని. అకస్మాత్తుగా, అనుద్దేశపూర్వకంగా ఒక మంత్రం ఉచ్ఛరించినా, గుర్వనుగ్రహం మంత్రం ద్వారా శిష్యుణ్ణి సంక్రమిస్తుంది. లేదా ఆ మంత్రశక్తి గురువు అనుగ్రహానికి మూలమని కూడా చెప్పవచ్చు.
గురువు ఒక సిద్ధ గురువైతే, శిష్యుడు పరిపక్వమున్నవాడైతే, అసలు వాగ్రూపక మంత్రోపదేశమే అక్కరలేదు. కానీ గురుశిష్యులమధ్య ఒక సంబంధం మాత్రం ఏర్పడాలి. అదెట్లా సాధ్యం? గురువు శిష్యుని వంక ఒక మారు చూస్తే చాలు. అదే కటాక్షదీక్ష ఔతుంది. వలసిన సంబంధం ఆ కటాక్షమే కల్గిస్తుంది. కటాక్షమాత్రాన శిష్యునికి జ్ఞానోపలబ్ధి ఏర్పడుతున్నది. గురువు శిష్యుని శిరస్సును స్పృశించుటం కూడా దీక్షయే. దీనిని హస్తమస్తకదీక్ష అని అంటారు. కొన్ని సమయాలలో ఇవి ఏవీ అక్కరలేదు. ఇవన్నీ స్థూలక్రియలు. గురువు సంకల్పమాత్రాన - 'ఈ బిడ్డకు ఆరోగ్యం కలగాలి' అని అనుకొన్న మాత్రంలో, అది ఉపదేశతుల్యమై గురుశిష్యసంబంధాన్ని వెంటనే సృష్టిస్తుంది.
కాబట్టి కావలసిందల్లా గురువు పైన అచంచలమైన విశ్వాసం , భక్తి మాత్రమే. అవి ఉంటె చాలు ఆ గురు అనుగ్రహం సంపూర్తిగా మనకి లభించినట్లే.