Online Puja Services

ఆ అమ్మవారి స్తన్యాన్ని స్వీకరించిన భక్తుని కథ !

52.15.237.212

స్వయంగా ఆ అమ్మవారి స్తన్యాన్ని స్వీకరించిన  భక్తుని కథ ! (జ్ఞాన సంబందార్ )
-లక్ష్మీ రమణ 

అమ్మవారు నిజంగా అమ్మవారే! తన పిల్లవాడు ఆకలితో అలమటిస్తుంటే, గుక్కపట్టి ఏడుస్తుంటే, ఎలా పరుగుపరుగున పరిగెత్తుకుని వచ్చి వాడి ఆకలి తీర్చడానికి తన స్తన్యాన్ని తల్లి ఇస్తుందో, అలా ఆ అమ్మ కూడా కదిలివస్తుంది . ఈ విషయం నిరూపితం చేసినవారి కథలకి ఈ దేశంలో లోటేమీ లేదు . అటువంటి మహాపురుషులైన భక్తులని కన్న భూమి ఇది. అటువంటి జాబితాలో ఉన్న మహానుభావులలో ఒకరు జ్ఞాన సంబందార్ .  

తిరుజ్ఞానసంబందార్ ఏడవ శతాబ్దంలో నివసించిన జ్ఞాన పురుషుడు . మహా శివ భక్తులైన  63 నాయన్మార్లలో ఒకరు. శివుని గురించి ఆయన రాసిన రచనల సంకలనాన్ని “తిరుక్కడైకప్పు” అంటారు. ఆయన స్వయంగా ఆ సుబ్రహ్మణ్యుని అవతారమే నని విశ్వశిస్తారు.  ఈ విశ్వాసానికి భూమికగా ఆయనకి మూడేళ్లున్నప్పుడు జరిగిన ఒక దైవిక సంఘటనని చెబుతారు .  

సిర్కాజిలోని బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శివపాద హృదియార్, ఆయన భార్య భగవతియార్ అనే పుణ్య దంపతులకు  సంబందార్ జన్మించారు . సంబందార్ కి  దాదాపు మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని తండ్రి అతన్ని సమీపంలోని శివాలయానికి తీసుకెళ్లారు. అక్కడ సంబందార్ ని మండపంలో వదిలి, అతని తండ్రి గుడిలోని కోనేటిలో స్నానం చేయడానికి వెళ్లారు . అప్పుడు ఆ చిన్నారి సంబందార్ కి విపారీతంగా ఆకలివేసింది. అంతరాలయంలో పీఠం పైనున్న పార్వతీ పరమేశ్వరులు , తల్లిదండ్రులుగా కనిపించారు . వారిని చూస్తూ ఏడవటం మొదలు పెట్టారు . ఆదిదంపతుల కారుణ్యాన్ని చూడండి. వారిరువురూ ఆ ఆపసిమనసులోని పిలుపును విని స్వయంగా దిగివచ్చారు .

 ఆమ్మ ఆ క్షణం మాతృప్రేమతో పరవశించిపోతూ సంబందార్ కి తన పాలని పట్టింది . జగజ్జనని స్తన్యాన్ని స్వీకరించినవాడు , ఇక ఆ శివునితో సమానమైన జ్ఞానాన్ని పొందుతాడు . ఇక అందులో ఎంటువంటి సందేహంమూ లేదు . కోనేటిలో స్నానం చేసివచ్చిన తండ్రి , కొడుకు నోటిలో ఉన్న పాల చుక్కలన్నీ చూసి, కొడుకుని అడుగుతారు , ఎవరో  ఇచ్చిన స్తన్యాన్ని ఎలాగురా త్రాగేశావు అని ! అప్పుడా పసివాడిదైనా సంబందార్ అనంతమైన జ్ఞానంతోటి  “తోడుదయ సేవయన్” అనే పత్తికాన్ని చెబుతారు ఆశువుగా ! పత్తికం అంటే మనం చేసే దండకం లాంటిది .  అదివిని ఆయన తండ్రితో పాటు, ఆ గుడిలో ఉన్న భక్తులందరూకూడా ఆశ్చర్యపోయారట ! ఆతర్వాత ఆయనకి వేలాదిగా అనుచరులు , అనునూయులు తయారయ్యాయారు . ఇలాంటి ఉదంతాలు సంబందార్ చరిత్రలో మనకి ఎన్నో కనిపిస్తాయి . ఏడు సంవత్సరాల వయస్సులో, సంబందార్ కి ఉపనయనం చేస్తారు ఆయన తల్లిదండ్రులు . ఆ తర్వాత ఆయన వేదాలను గొప్ప స్పష్టతతో, నియతితో  వివరించాడని చెబుతారు.

సిర్కాజి సమీపంలోని తిరుకోలక్క సంబందార్ పత్తిగం చేసిన రెండవ శివాలయం అని చెబుతారు. ఇక్కడకూడా శివయ్య తన పితృవాత్సల్యాన్ని సంబందార్ పైన కురిపించారు . సంబందార్ తన పత్తిగంని హృద్యంగా ఆలపిస్తూ , అనంతమైన ఆధ్యాత్మికమైన తాదాత్మ్యతలో రమించిపోతూ రెండు  చేతులతో చప్పట్లు కొడుతున్నారట . అలా చప్పట్లు కొడుతూ ఉంటె, ఆ పసివాడి చేతులు ఎర్రగా కమిలిపోతున్నాయట . దానిని గమనించిన శివయ్య అతనికి నొప్పి నుండి ఉపశమనం కలిగించడానికి, శివుడు అతనికి రెండు బంగారు తావళాలని ఆనుగ్రహించారట .  ఇక అమ్మమాత్రం తక్కువా! బంగారు తావళాలవల్ల చాక్కని శబ్దం ధ్వనించడం లేదని , అందులో తన  శక్తిని ప్రవేశపెట్టి వాటిలో సంగీత స్వరాలు పలికేలా చేసిందట ! 

తిరుయిడైచురం అనే ప్రదేశంలో, సంబందార్ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, శివుడు గొర్రెల కాపరి అవతారం ధరించి, అతని వద్దకు వచ్చి, దాహం తీర్చుకోవడానికి కొంచెం మజ్జిగ అందించి, ఆలయానికి దారి చూపించాడని చెబుతారు.

మరొక సంఘటనలో, తిరువావడుతురై అనే ప్రదేశంలో, సంబందార్ తన తండ్రి సిర్కాజిలో చేయాలనుకున్న యజ్ఞం నిర్వహించడానికి బంగారం,ఇంకా  ఇతర సామగ్రి కోసం శివుడిని ప్రార్థిస్తూ ఒక పత్తిగాన్ని చెబుతారు . అప్పుడు శివుడు ఆయనకీ బంగారాంతో నిండిన సంచీని అందించారట. 

తిరుత్తురై అనే ప్రదేశంలో, సంబందార్  తీర్థయాత్ర చేస్తున్నప్పుడు, ఆ పిల్లవాడు బాధపడకూడదని భావించి ముత్యాల పల్లకీ , ముత్యాల గొడుగును  బహుమతిగా ఇచ్చారట .

కొన్ని శివ స్థలాలలో, సంబంధర్ తన స్తోత్రాలతో అద్భుతాలు చేశాడని నమ్ముతారు. అలాంటి రెండు సంఘటనలు చెప్పుకుందాం . 

మైలాపూర్‌లోని శ్రీ కబాలీశ్వర ఆలయంలో, పాము కాటు కారణంగా మరణించిన ఒక వ్యాపారవేత్త కుమార్తెను సంబందార్ తిరిగి బ్రతికించాడని నమ్ముతారు. తిరుమరుగల్ అనే గ్రామంలో మరొక అద్భుతం జరిగింది, అక్కడ సంబంధర్ తన పత్తిగములని పాడడం చేత  పాము కాటుకు గురైన మరో వ్యాపారిని తిరిగి బ్రతికించారు .

సంబంతర్ భారతదేశంలోని దక్షిణ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. దాదాపుగా  220 శివాలయాలను సందర్శించారు. ఆయన16000 పతిగమ్‌లను (స్తోత్రాలు) అందించారని చెబుతారు. వీటిలో  ప్రతి పత్తిగం కూడా 10 నుండి 11 శ్లోకాలు కలిగి ఉంటుంది. అయితే వీటిలో ప్రస్తుతం మనకి కేవలం  4000 శ్లోకాల వరకు ఉన్న 383 పతిగమ్‌లు మాత్రమే లభిస్తూ ఉన్నాయి . 

 నల్లూరు పెరుమానం (అచలాపురం ) లో జరిగిన తన వివాహ వేడుకలో సంబందార్  తన పదహారేళ్ల వయసులో తమిళ మాసమైన  "వైకాశి"లో "విశాఖ నక్షత్రం" రోజున మోక్షాన్ని (ముక్తి) పొందారు. ఆ  వివాహ వేడుకకి హాజరైన దాదాపు 3000 మంది కూడా మోక్షాన్ని పొందారని  అటువంటి అద్భుతంమైన వేడుక అది అని ఇప్పటికీ యోగులైనవారు చెబుతుంటారు . అటువంటి మహానుభావుని గురించి తలచ్చుకున్నా జన్మధన్యమేకదా ! 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba