Online Puja Services

గొడగూచి

3.138.105.4

తనని లాలించిన చిన్నారితల్లిని తనలో లీనం చేసుకున్న శివయ్యకధ (గొడగూచి)
-లక్ష్మీ రమణ 

లోకరక్షాదీక్షితుడైనవాడు శివుడు.  లోకాలను కాపాడడానికి హాలాహలాన్ని నేరేడు పండులా మింగి కంఠాన ఉంచుకొనడం మరెవరికి సాధ్యం? అటువంటి శివుడు భక్త వశంకరుడు కూడా! చిన్న స్తోత్రానికే పరవశమై వరాలిచ్చే ఉబ్బులింగడు ఆయన! ఒక్క చుక్క నీరు చాలు. ఒక్క మారేడు దళం చాలు , ఇవేవీ దొరకకపోతే, చిటికెడు బూడిద చాలు . అసలివేవీకాదు, నిర్మలమైన భక్తితో చేసే ఒక్క నమస్కారం చాలు . స్వయంగా దిగివస్తాడు. ఆదరంగా ఆశీర్వదిస్తాడు . అలా ఆ స్వామీ ఓ చిన్నారికోసం దిగివచ్చి , ఆపాప అమాయకంగా అర్పించిన పాలని స్వయంగా స్వీకరించిన కథ ఇది . 

పాలకురికి సోమనాథుడు రచించిన బసవ పురాణం, చక్కని తెలుగు ద్విపద కావ్యం. ఇందులోని కథే ఈ చిన్నారి గొడగూచి కథ. దక్షిణ దేశంలోని  ఒక ఊళ్ళో శివదేవుడనే భక్తుడికి ఒక కుమార్తె ఉంది. ఆయన ఈశ్వరార్చన తత్పరుడు . ఒక్కరోజైనా  విడువని శివపూజా ధురంధరత ఆయనది. శివపూజకి ఆటంకం వస్తుందని ఎక్కడికీ ప్రయాణం కూడా చెయ్యడు. అలాంటి వ్యక్తికి ఒకసారి తప్పించుకోలేని ఒక ప్రయాణం తలమీద వచ్చిపడింది. తనూ, భార్యా వెడుతూ, కుమార్తెను ఇంట్లో ఉంచి, ‘అమ్మాయీ, పతి రోజూ కుంచెడు పాలు తీసుకెళ్ళి మన గుడిలోని లింగమయ్యకి నివేదించు, ఎప్పుడూ అశ్రద్ధ చెయ్యకు’ అని చెప్పారు.

నివేదన చెయ్యడం అంటే, తాగడానికి శివయ్యకి పాలు ఇవ్వాలి. అంతేకదా అనుకుండా చిన్నారు.  మొదటిరోజు చక్కగా తన చిన్నారి చేతులతో  కుంచెడు పాలు కాచింది . వాటిని తీసుకొని శివాలయానికి వెళ్ళింది. శివయ్యకి నమస్కరించి,  పాలు తాగు శివయ్యా అని కోరింది. జవాబు లేదు. ఎంతసేపు వేచి ఉన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా లింగమయ్య ఉలుకూ పలుకూ లేకుండానే ఉన్నాడు. 

 ఆ పాపకి బాధేసింది . ఏడుపొచ్చేసింది . ఏమైనా లోపం చేశానా అని ఆలోచించుకుంది . శివయ్యని ప్రశ్నించింది . ‘  ఎందుకు తాగవు? పాలు సరిగా కాచలేదా నేను? మాడిపోయాయా ? పల్చగా ఉన్నాయా? పాలలో కలకండ కలపనా ? నెయ్యివేసి తేనా ?  ఎలా కావాలంటే, అలాగే పెదతాకదా ! మాట్లాడు శివయ్యా ! పాలు తాగు’  అని అమాయకంగా, ప్రేమగా , చిన్నారి బాలుణ్ణి అమ్మ బ్రతిమాలినట్టు బ్రతిమిలాడింది . కోపగించింది. ఆర్ద్రంగా అభ్యర్ధించింది . చివరికి నువ్వు తాగకపోతే మా నాన్న వచ్చేక నన్ను చంపేస్తాడు. నీకది సంతోషమా? అంటూ భోరున విలపించింది . ఇక ఆగడం ఆ భక్తవశంకరుని వశంకాలేదు . శివుడు లింగంలోంచి బయటికి వచ్చి పాలు ఆరగించాడు .

ఇలా కొన్ని రోజులు గడిచింది. రోజూ ఆ చిట్టితల్లి పాలు తేవడం, శివుడు వచ్చి , ఆరగించడం నిరాటంకంగా జరుగుతూ ఉంది . ఒకరోజు అదేవిధంగా పాప స్వామికి పాలు ఆరగింపు చేసి , ఖాళీ కుంచంతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తోంది .  అప్పుడే తల్లిదండ్రులు తిరిగి వచ్చారు. సంతోషంతో ఆ పాప నాన్నని చుట్టేసి ‘చూడునాన్నా ! శివయ్యకి నువ్వు చెప్పినట్టే, పాలు తాగించి వస్తున్నానని చెప్పింది .’ ఖాళీకుంచం చూసి పాలు ఏమయ్యాయని గర్దించాడా తండ్రి . నువ్వే తాగేసి, శివయ్య పేరు చెబుతున్నావా అని నిలదీశాడు .  పాప కాదండి . శివయ్య తాగినమాట నిజమేనంది. 

శివదేవయ్య ఐతే గుడిలోనే నీ సంగతి తేలుస్తా పద అంటూ బాలికని గుడికి లాక్కెళ్ళాడు. అక్కడ పాప శివుడిని సాక్ష్యం చెప్పమంటే ఆయన ఉలకడు ,పలకడు. అప్పుడే పాలుతాగిన శివయ్య , సాక్ష్యంరాదేమని ఆ చిన్నారి మనసు క్షోభ పడింది .  కన్నీటి పర్యంతమై శివుడిని పరిపరి విధాల వేడుకుంది. ఐనా ఆయన స్పందించలేదు. ఇంకోవైపు నీదంతా అబద్ధం, చూడు నిన్నేం చేస్తానో అంటూ రుద్రుడిలా కూతురి మీదకి వస్తున్నాడు తండ్రి.

"శివయ్యా, మా నాన్న చేతిలో నాకు చావు తప్పేట్టు లేదు. నీ లింగానికే తల బాదుకొని ప్రాణాలు విడిచి నీ సన్నిధికి వస్తాను" అంటూ లింగానికి తలను బాదుకుందా పాప .  

అంతే! అప్పటివరకూ బండరాయిలా ఉన్న శివలింగం ఫెటిల్లున చీలింది.  పాపను తనలోపలికి లాగేసుకుంది! తనని లాలించి పాలు తాగించిన చిన్నారితల్లిని తన దగ్గరకి రప్పించేసుకున్నాడా శివుడు . పాపను పట్టుకోడానికి ఆమె జుట్టు పట్టుకున్నాడు తండ్రి. ఒక పాయ కాస్త ఊడి ఆయన చేతికి వచ్చింది. పాప అదృశ్యమైపోయింది! ఏమి శివలీల అంటూ అక్కడ మూగినవారు అబ్బురపడ్డారు. తండ్రి ఖిన్నుడైపోయాడు.

"శివదేవయ్యా, నీ కూతురు నా పరమభక్తురాలు. ఆమె అమాయకత్వం, నిర్మల హృదయం నన్ను వశపరచుకున్నాయి. అందుకే నా సన్నిధికి చేరుకుంది. నేటి నుంచీ ఆమె గొడగూచి అన్న పేరిట భక్తలోకంలో గణ్యత పొందుతుంది" అన్న ఈశ్వరవాణి వినిపించింది.

ఓం శాంతి !! 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore