సకల శుభాలు ప్రసాదించే కృష్ణుని కాలం నాటి రాముడు
సకల శుభాలు ప్రసాదించే కృష్ణుని కాలం నాటి రాముడు .
- లక్ష్మీరమణ
రామనామానికి రామబాణానికి ఉన్నంత పదును, ప్రభావం ఉన్నాయి . ఆ నామం ఎవరి నోట ఎల్లప్పుడూ పలుకుతుంటుందో వారి వెంట రక్షకుడై ఆ హనుమ తిరుగుతూ ఉంటారు. ఆ నామ పారాయణం అమృతరసపానం. యుగాలు గడిచినా ఆ చరితం రసరమ్యం . రాములోరు కొలువైన దివ్యాలయాలు ఎన్నో మన నేలమీద కనిపిస్తాయి. అయితే ఆయన సీతా లక్ష్మణ సమేతుడై దర్శనమిస్తారు. నిజానికి పూర్ణావతారమైన రాములోరు భారత శత్రుఘ్నులతో కూడా కలిసి కనిపించే ఆలయాలు మాత్రం బహు అరుదు అనే చెప్పాలి . అలా నలుగురు అన్నదమ్ములూ, భరతుని సమానమైన భక్తుడు ఆంజనేయునితో కూడా ఉన్న ఒక దివ్యాలయాన్ని ఇవాళ దర్శిద్దాం .
అన్నదమ్ములంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులే . సోదరుడైన లక్ష్మణుడు అన్న ఉన్నచోటే తనకి రాజభోగాలనుకున్నారు . అరణ్యవాసంలో ఆయనకి తోడు నీడై సంచరించారు. భరతుడు అన్న పాదుకలకి పట్టంకట్టి , సింహాసనం పైన ఉంచి ఆ సమయంలో రాజ్యం చేశాడు. ఇక కనిష్ట సోదరుడైన శత్రుఘ్నుడు అతనికి సాయంగా అన్నానే నిరతము ధ్యానిస్తూ గడిపారు . ఆ తమ్ములకి అన్నంటే అంత భక్తి . అన్నగారికి కూడా ఆ తమ్ములంటే అలవిమాలిన పుత్రవాత్సల్యం . ఆయనకీ తగిన ఇల్లాలు సీతమ్మ . మాతృవాత్సల్యంతో మరుదులని బిడ్డల్లా చూసుకున్న మహాసాధ్వి.
అయితే దేశంలోని ఏ రామ మందిరంలోనూ భరత శత్రుఘ్నుల విగ్రహాలు పెద్దగా కనిపించవు. కేరళలో మాత్రం ఈ నలుగురు అన్నదమ్ముల ఆలయాలను మనం చూడొచ్చు. ఎర్నాకులం జిల్లాలో ఉన్న ఈ ఆలయాలను ఒకే రోజు దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడి ప్రజలు. దాన్నే నాలాంబళం యాత్రగా పిలుస్తూ ఉంటారు . మలయాళంలో నాల్ అంటే నాలుగు అని అర్థం కాగా, అంబళము అంటే దేవాలయం అని అర్థం . ఇలా శ్రీరాముని తో పాటు భరత, లక్ష్మణ, శత్రుఘ్న ఆలయాలను ఒకే రోజులో దర్శించుకోవడానికి నాలాంబళ యాత్ర అని పిలుస్తారు. సాధారణంగా మలయాళ క్యాలెండర్ ప్రకారం కర్కాటకం నెలలో అంటే జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఈ యాత్ర చేస్తూ ఉంటారు . ఇలా ఒకే రోజులో యాత్రను పూర్తి చేస్తే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పురాణ గ్రంథాలు కూడా చెబుతున్నాయి.
కృష్ణుడి కాలం నాటి రాములోరు:
త్రేతాయుగంలోని తన అవతారాన్ని, ద్వాపరయుగంలో కృష్ణుడిగా తానె అర్చించిన చరిత్రని సొంతంచేసుకున్న ఆరడుగుల ఆజానుబాహుడైన స్వామి ఇక్కడి శ్రీరామచంద్రుడు . ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ నాలుగు విగ్రహాలను పూజించారని స్థల పురాణం చెబుతోంది. ద్వాపర యుగం చివరలో ద్వారకానగరం సముద్రంలో కలిసిపోయింది. ఆ సమయంలో కృష్ణుడు పూజించిన ఈ విగ్రహాలు సముద్రంలో కొట్టుకొచ్చి, కేరళ తీరంలోని చీటుగా ప్రాంతంలో తేలాయట . ఒక భక్తునికి స్వప్నసాక్షాత్కారం ఇచ్చి , తమని ప్రతిష్టించమని రాములోరు ఆదేశించారట . కలలో కనిపించిన గుర్తులతో సముద్రతీరానికి వెళ్లగా ఆయనకు స్థానిక మత్స్యకారులు ఈ విగ్రహాలను అందజేశారట. అలా ఆ భక్తుడు వీరిని ఆయా ప్రదేశాలలో ప్రతిష్టించారు.
దర్శనా క్రమం:
మొదటిగా త్రిసూర్ జిల్లాలోని త్రిప్రయర్ ఆలయంలోని శ్రీరాముని దర్శనంతో యాత్ర ప్రారంభమవుతుంది. ఈ ఆలయంలో స్వామి ఆరడుగుల నిండైన విగ్రహంతో దర్శనమిస్తారు. శంఖము, సుదర్శన చక్రము, పూలమాలను ధరించిన స్వామిని దర్శించుకోవడంతో యాత్ర ఆరంభం అవుతుంది. తిరువోనం రోజున ఆలయంలో సేతుబంధన మహోత్సవాన్ని నిర్వహిస్తారు.
రాముని దర్శించుకున్న అనంతరం ఇరింజల్కూడా లోని కూడల్ మాణిక్యం ఆలయానికి చేరుకోవాలి. ఇక్కడే భరతుడి ఆలయం ఉంది. ఇక యాత్రలో మూడవ ఆలయమైన లక్ష్మణ స్వామిని దర్శించుకునేందుకు ఎర్నాకులం జిల్లాలోని అంగమాలి ప్రాంతం చేరుకోవాలి. పూర్ణా నది సమీపంలో ఈ లక్ష్మణ పెరుమాళ్ ఆలయం ఉంది . ఇక్కడే హరిత మహర్షి తపస్సు చేశారని పురాతన గ్రంథాలు పేర్కొంటున్నాయి. రాముని సోదరులలో చిన్నవాడైన శత్రుఘ్న స్వామి ఆలయ సందర్శనంతో నాలాంబళ యాత్ర ముగుస్తుంది. అక్కడికి దగ్గరలోనే ఉన్న హనుమంతుని దర్శనంతో యాత్రకు పరిపూర్ణత లభిస్తుంది.
ఇలా చేరుకోవాలి:
రైళ్లలో వెళ్లేవారు త్రిసూర్లో దిగి టాక్సీలు మాట్లాడుకోవచ్చు . సమీప విమానాశ్రయం కొచ్చిలో ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు ప్రయాణ సౌకర్యం ఉంది.
#rama #nalambalayatra
Tags: trichoor, kerala, tripriar, rama, lakshmana, bharatha, satrughna, anjaneya, temple, nalambala yatra