Online Puja Services

పరమాత్మే ఇల్లరికం వస్తే!!

3.12.148.180

పరమాత్మే ఇల్లరికం వస్తే!!
-లక్ష్మీ రమణ 

ఇల్లరికం అల్లుడిని గౌరవం లేకుండా చూస్తారని లోకంలో ఒక నానుడి ఉంది. అందుకే, పెళ్లిచేసుకొని పిల్లే పిల్లాడి ఇంటికి కోడలుగా వెళ్తుంది కానీ, పిల్లవాడు పిల్ల ఇంటికి అల్లుడిగా స్థిరనివాసం ఉండేందుకు వెళ్ళడు. కానీ పరమాత్మ తన దేవేరి కోసం ఇల్లరికమే వచ్చేశాడు . చిన్నచూపు చూసినా ఫర్వాలేదని ఆమె చెంతనే కొలువై పూజలు అందుకుంటూ అనుగ్రహిస్తున్నాడు. తిరుపతి వెంకటేశునితో సంబంధమున్న ఈ తమిళేశ్వరుని దర్శనానికి పోదాం పదండి . 

‘పద్మావతిని ప్రేమించి , మోహించి, వలచి, వలపించి వివాహం చేసుకున్నారు వేంకటేశుడు. సరే, బాగుంది. కానీ నన్ను ఏమి చేశారు నారదా ? అలక్ష్యమే చేశారుగా! నా కోసం తపించి, ఆ పద్మావతిని కట్టుకోవడం సబబేనా ?’ అని లక్ష్మీ దేవి నారదునితో స్త్రీ సహజమైన అసూయని, కోపాన్ని వెళ్లబోసుకుంది. అక్కడితో అమ్మ ఆగితే, ఆవిడ శక్తి స్వరూపిణి ఎలా అవుతుంది? ఆ స్వామీ ఆడేది జగన్నాటకం ఎలా అవుతుంది. 

కాలితో స్వామి హృదయాన్ని,తానున్న స్థానాన్ని తన్ని, ఆనక పాస్చాత్తాపంతో ఆ దేవదేవుని టక కూతురుగా అవతరించి అనుగ్రహించమని వేడుకున్న బృగువుని గుర్తుచేసుకుంది . వేయికమలాల నడుమ హేమమహర్షిగా ఉన్న భృగుమహర్షికి పసిపిల్లై కంటపడింది . ఈ ప్రాంతం తమిళనాడులోని కుంభకోణంలో ఉంది. మహర్షి ఆమెకు కోమలవల్లి అనే పేరు పెట్టి, పెంచి పెద్ద చేశారు .

ఇదిలా ఉండగా, లక్ష్మీదేవిని వెదుక్కొంటూ శ్రీనివాసుడు ఇక్కడికి వస్తారు .  ప్రస్తుతం సారంగపాణి దేవాలయం ఉన్న చోట ఆయనకీ కోమలాంబాళ్ కనిపిస్తుంది. ఆమె లక్ష్మీదేవిగా గుర్తించిన శ్రీనివాసుడు ఆమెను ఉడికించాలనే ఉద్దేశంతో భూపొరల్లో కొద్దిసేపు దాక్కొంటాడు. అలా దాక్కొన్న శ్రీనివాసుడిని ప్రస్తుతం పాతాళ శ్రీనివాసుడు పేరుతో కొలుస్తున్నారు. ఆ పైన ఉన్నదే సారంగపాణి ఆలయం. 

ఇక అమ్మవారు ఇక్కడ తటాకంలో పుట్టింది కాబట్టి లక్ష్మిదేవి పుట్టినిల్లు ఇదే. ఈయన్ను భక్తులు ఆలయం నుంచి కొంచెం కిందికి అంటే భూగర్భంలోకి వెళ్లి చూడాల్సి ఉంటుంది.

ఇక్కడ , మహర్షి కోరిక ప్రకారం కోమలవల్లిని విష్ణుమూర్తి పెండ్లాడి, ఇల్లరికపు అల్లుడిగా ఉండిపోయారు. అందుకే ఈ స్వామిని తమిళులు ‘వీట్టోడు మాప్పిళ్ళై’ అని పిలుస్తారు. అంటే ‘ఇల్లరికం అల్లుడు’ అని అర్థం. ఇక్కడ మహా విష్ణువు విల్లు పేరు సారంగం. ఆ సారంగాన్ని చేతపూని వచ్చారు కాబట్టి ఆయన్ని సారంగా పాణి అని పిలుస్తారు . 

అలా అమ్మ తన పంతం నెగ్గించుకొని, కోమలవల్లిగా ఆ సారంగపాణిని కొంగున ముడేసుకుందన్నమాట ! ఆమెని వివాహం చేసుకోవడానికి స్వామీ వైకుఠంనుండీ ఒక దివ్యమైన రథంలో విల్లుని ధరించి దిగివచ్చి , ఇక్కడే ఉండిపోయారు . ఈ స్వామిని ‘సారంగపాణి పెరుమాళ్‌’ అని తమిళులు పిలుస్తారు. అయ్యవారు రథంపైన వచ్చినదానికి గుర్తుగా , ఇక్కడ రెండు పెద్ద పెద్ద రథాలు ఉంటాయి .  

అలాగే సూర్య భగవానుడి కోరిక మేరకు ఇక్కడ స్వామివారు ఆవిర్భవించినట్టు కూడా మరో స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రానికి 'భాస్కర క్షేత్రం' అనే పేరు కూడా వుంది. పూర్వం 'సుదర్శన చక్రం'తో పోటీపడిన సూర్యుడు తన తేజస్సును కోల్పోతాడు. ఆ తరువాత ఈ ప్రదేశంలో స్వామివారి అనుగ్రహంతో తన తేజస్సును తిరిగి పొందినట్టుగా స్థలపురాణం చెబుతోంది.

ఇక్కడ తొలి పూజ అమ్మకే!

లక్ష్మీదేవి కోమలవల్లిగా అవతరించిన చోటు ఇది. పుట్టిల్లు కాబట్టి స్థానబలం ఆమెదే! అందుకే ఈ ఆలయంలో మొదట అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేసిన తరువాతే. ఇల్లరికం అల్లుడైన స్వామివారిని దర్శిస్తారు. 108 వైష్ణవ దివ్య క్షేతాల్లో ఒకటైన ఈ ఆలయంలో, వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం నిర్వహించే సంప్రదాయం లేకపోవడం మరో విశేషం. 

దాదాపు రెండువేల ఏళ్ళ నాటిదిగా పరిగణిస్తున్న ఈ ఆలయం శిల్పకళాపరంగానూ ఆకర్షిస్తుంది. ఇక్కడ అనేక కట్టడాలు ఏడో శతాబ్దం నాటివని చరిత్రకారుల అంచనా.సుమారు 150 అడుగుల ఎత్తు, 11 అంతస్తులతో సమున్నతంగా కనిపించే ఈ ఆలయ రాజగోపురం. తమిళనాడులోని మూడో అతిపెద్ద రాజగోపురం. చైత్రమాసంలో ఇక్కడ నిర్వహించే రథోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు భక్తులు.

ఎలా చేరుకోవాలి? 

తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాల నుండీ కుంభకోణానికి బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి . 
       

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi