విత్తుముందా / చెట్టుముందా ?
విత్తుముందా / చెట్టుముందా ? ఈ ఆలోచనకి ఈ చేప కథే సమాధానం .
లక్ష్మీ రమణ
ఇంతింతై వటుడింతై అని ఎదిగిపోవడం ఒక్క వామనుడికి చెల్లిందనుకుంటున్నారా ? ఆ విష్ణుమూర్తికి ఇదో సరదా అనుకుంటా మరి ! అప్పుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేయడానికి, ఆ తర్వాత అర్జనుడికి కర్తవ్యబోధ చెయ్యడానికి , వీటన్నింటికంటే ముందర వేదాలని ఉద్ధరించేందుకు మత్స్యఅవతారమై ఎక్కడా తగ్గింది లేదు , అంత కంతకూ ఎదిగిపోవడమే తప్ప . ఈయనకీ , చెట్టుకీ , విత్తుకీ సంబంధం ఏమిటా అనుకుంటున్నారా ? పూర్తి కథని చదవండి మరీ !
ద్రావిడదేశాన్ని సత్యవ్రతుడనే రాజు పరిపాలించేవాడు . ఆ రాజు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి, చక్కగా విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసుకుంటున్నాడు. ఒకనాడు స్వామికి జల తర్పణం సమర్పిస్తుండగా ఆయన చేతిలోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చి, సముద్రంలోని జలచరాలనుండీ రక్షించమంది. రాజు దాన్ని తన కమండలంలో వేసుకున్నాడు. ఇంతింతై అన్నట్టుగా , ఆ చేప దాని ఆకారాన్ని పెంచేస్తుంటే, ఆయన దానిని తర్వాత , కడవలో , మడుగులో, ఆ తర్వాత ఒక పెద్ద జలాశయంలో వదిలాడు. ఆ చేప వాటిలో పట్టనంతగా ఎదిగి మరో చోట తనని వందలమంది. అప్పుడు ఆ సత్యవ్రతుడు ఆ చేప సామాన్యమైనది కాదని గుర్తిస్తాడు . శ్రీమహావిష్ణువేనని తెలుసుకొని శరణువేడతాడు.
అప్పుడు విష్ణుమూర్తి నేటికి ఏడురోజుల వ్యవధిలో బ్రహ్మదేవునికి పగలు ముగిసి పోతుందని, జలప్రళయంలో సృష్టి మునిగిపోతుంది అని తెలియజేస్తాడు . ఆ ప్రళయకాలంలో సప్తఋషులనీ , ఔషధ విత్తనాలనీ, బీజరాసులనీ తీసుకొని ఒక పడవలో సిద్ధంగా ఉండమని, కనిపించిన పాముతో ఆ నావని తన కొమ్ముకి ప్రళయకాలంలో మునిగిపోకుండా గట్టిగా కట్టమని ఆనతినిచ్చి ఆ మత్స్యం మాయమవుతుంది .
ఆ ప్రకారంగానే సత్యవ్రతుడు చేయడం వలన , బ్రహ్మ నిదురించిన ప్రళయకాలంలో ఆ పడవ ఋషులు , సత్యవ్రతుడు, ఔషధులు, బీజరాసులు రక్షించించబడతాయి . ఆ పడవ వెంటే తిరుగుతూ , మహావిష్ణువు వారిని కాపాడతాడు . ఆ సత్యవ్రతుడే, వివస్వతుడు అనే పేరా సూర్యునికి పుత్రుడై విశ్వావసు మనువుగా ఈ మన్వంతరానికి మనువయ్యాడు .
కానీ బ్రహ్మదేవుడు నిద్రించిన సమయం చూసుకుని, ఆయన నుండీ బయటికి వచ్చిన వేదాలని హయగ్రీవుడనే రాక్షసుడు అపహరించాడు. వాడు సముద్రంలో వేదాలతో సహా దాక్కోవడంతో శ్రీమహావిష్ణువు మత్స్యావతారము దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చాడు .
అలా బ్రహ్మదేవునికి మహావిష్ణువు చేపరూపంలో వేదాలని తీసుకొచ్చి ఇచ్చిన ప్రదేశమే , వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరు గాంచింది. ఇదే, శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయం. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు చెందిన నాగలాపురంలో ఉంది.
శ్రీకృష్ణ దేవరాయలు తన దక్షిణ దేశ పర్యటనలో హరికంఠ పురములో పల్లవులచే నిర్మించబడిన శ్రీ కరియ మాణిక్య పెరుమాళ్ అనే ఈ చిన్న ఆలయాన్ని సందర్శించి, శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంగా మార్చి, పంచ ప్రాకారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చి దిద్ది, పునర్నిర్మించారు. అనేక దానములు చేసి, తన తల్లి పేరున ఈ ప్రదేశానికి నాగలాపురము అని నామకరణము చేశారని ఈ ఆలయ ఉత్తర కుడ్యమునందు గల శాసనము ద్వారా తెలుస్తోంది .
ప్రతియేడు మార్చి నెల 25, 26, 27/26,27,28 వ తేదీలలో సాయంకాలం మూల విరాట్టుకు 630 అడుగుల దూరంలో ఉన్న రాజగోపురం నుండి సూర్య కిరణాలు నేరుగా వచ్చి, మొదటి రోజున స్వామి వారి పాదభాగాన, రెండో రోజున స్వామివారి నాభి భాగాన, మూడో రోజున స్వామివారి ముఖ భాగాన ప్రసరించడం ఈ ఆలయ విశిష్టత. ఈ కారణంగానే ఆ మూడు రోజులు స్వామివారికి సూర్య పూజోత్సవాలు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.