భక్తుడు చెప్పినట్టు విని అలాగే నడుచుకునే పెరుమాళ్ ఆలయం
భక్తుడు చెప్పినట్టు విని అలాగే నడుచుకునే పెరుమాళ్ ఆలయం !
-లక్ష్మీ రమణ
గురుభక్తి ఉన్నవారిని, గురువే కాదు; ఈశ్వరుడు కూడా అనుగ్రహిస్తాడు . ఈ విషయం మనకి ఎన్నో ఉదంతాలలో నిరూపణ అయ్యింది కూడా ! దీపకుడు తన గురువైన వేదధర్ముని సేవించి విష్ణుపదాన్ని పొందాడు . అదేవిధంగా గురు అనుగ్రహం ఉంటె చాలు, మారే దేవతలతోనూ పనిలేదు . భగవంతుడు తానై , మన వెనుక నిలుస్తాడు . అటువంటి ఒక ఆళ్వార్ కథని చదవండి మరి ! ఈ ఆలయంలోని పెరుమాళ్ళు ఇప్పటికీ భక్తులకి వరదాయకుడే . కొంగుబంగారమే. ఈ అక్షరాల తులసీమాలని ఆ పెరుమాళ్ళకి అలంకరిద్దాం. భావనతో దర్శిద్దాం పదండి .
ధనుర్మాసం - భక్తిసుమాలతో ఆ విష్ణుపాదాలను సేవించే మాసం . ఆళ్వార్లు ప్రబోధాలని పాశురాలుగా పాడుకుంటూ ,ఆ మహనీయుల బోధనలని తలుచుకొని, వారు చూపిన భక్తి మార్గాన్ని అనుసరించి , ఆ రంగనాథుని సేవించి తరించే మాసం. అటువంటి ఆళ్వారులల్ ఒకరు తిరుమళిసి ఆళ్వార్ .
ఈ ఆళ్వార్లు అందరూ పరమ భక్తులు. వారికి గౌరవార్ధం వారిని వారి అసలు పేర్లతో పిలవరు . వారు పుట్టిన చోటో, లేక వేరే ఏదైనా ఇతరమైన అభిజ్ఞను జోడించో ఆ భక్తులను పిలుచుకోవడం జరుగుతుంటుంది . ఉదాహరణకి - పెరియ ఆళ్వార్ - అంటే 'పెద్ద ఆయన' అని అర్ధం. నమ్మాళ్వార్ - అంటే 'మన ఆయన' అని అర్ధం. అదే విధంగా పూందమల్లి సమీపంలో తిరుమళిసి అనే గ్రామం వుంది. ఆ ప్రాంతంలో పుట్టినందువల్ల ఒక ఆళ్వారుకు ‘తిరుమళిసి ఆళ్వార్’ అన్న పేరు వచ్చింది. ఆ తర్వాతి కాలంలో ఆయన కంచికి వచ్చి స్థిరపడ్డారు . కంచిలో విష్ణ్వాలయంలో పాశురములు - విష్ణు సంబంధమైన గీతికలు - పాడుకొంటూ వుండే వారు. అనునిత్యం శిష్యులకు ఉపదేశమిస్తూనో, లేక యోగసమాధిలోనో మునిగిపోయో ఉండేవారాయన . ఈ మహానుభావుడు అనంతర కాలంలో ‘భక్తిసారుడు’ అనే పేరొందారు .
తిరుమళిసి ఆళ్వార్ వద్దకు ఇద్దరు భక్తులు వచ్చేవారు. వారిరువురూ భార్యాభర్తలు . వారికి పుత్రసంతానం లేదు. వారిరివురూ ప్రతిరోజూ ఆళ్వార్ వారికి పాలు తెచ్చియిచ్చేవారు. ఎల్లప్పుడూ యోగసమాధిలో వుండే ఆయన , కళ్ళు తెరిచినపుడు ఈ భక్తులు తెచ్చిన పాలను స్వీకరించి, కొంత మిగిల్చే వారు. ఆ భక్తులు దానిని ప్రసాదంగా భావించి తీసుకొనేవారు. కొంతకాలానికి వారికి ఒక పుత్రుడు పుట్టాడు. అతనికి కానికణ్ణర్ అని పేరు పెట్టారు.
కానికణ్ణర్ చిన్నతనంలోనే ఆళ్వారుకు శిష్యుడయ్యాడు. ఆ తర్వాత ప్రియశిష్యుడయ్యారు . గురుసేవని క్షణమైనా విడువని గురుభక్తుడు ఆ కానికణ్ణర్ . ఆ గురువు నిరతము పెరుమాళ్ సేవలో , లయించి ఉండే భక్తుడు .
ఒకరోజు కానికణ్ణర్ ఆ పెరుమాళ్ ఆలయానికి వెళ్లారు . ఈయనకి యథోక్తకారి అని పేరు .యథోక్తకారి అంటే, చెప్పినట్టు చేసేవాడని అర్థం . సరే, అక్కడ ఆలయంలో ఒక వృద్ధురాలు , పేడనీళ్ళు చల్లి, రంగవల్లులు తీర్చిదిద్దుతూ వుంది. వృద్దురాలై , అస్తిపంజరంలా మారిపోయినా , దేహంలో కొన ఊపిరి ఉండేంతవరకూ కూడా భగవత్కైంకర్యం చేయాలని ఆవిడ నిర్ణయించుకుంది . అందుకే అంతటి చేతకాని స్థితిలో కూడా పెరుమాళ్ కి సేవచేసేందుకు ఉద్యుక్తురాలయ్యింది . కానికణ్ణర్ ఆ విషయాన్ని తెలుసుకొన్నాడు. అతని హృదయం ఆ భక్తురాలిని చూచి ద్రవించి పోయింది . ఆమెకు తాను ఏ విధంగా సాయపడగలడు అని ఆలోచించారు .
ఆ క్షణంలో ఆయన హృదయం పూర్తిగా ప్రేమభరితమై పోయింది . చిత్తం అపార కృపాభావం తో నిండిపోయింది . దాంతో గురువు మొక్క అనుగ్రహ శక్తి అతనిని ఆవహించింది . ఆ పెరుమాళ్ కృప ఆ విధంగా అతని గురువు ద్వారా కానికణ్ణర్ లో ప్రవేశించింది . ఆయన తన్ను తాను మరచి, ప్రేమతో ఆ వృద్దురాలి వీపును స్పృశించాడు . అంతే , చివరి ఘడియలకోసం ఎదురుచూస్తున్న ఆ వృద్ధ వనిత ఒక్కసారిగా యవ్వనవతిగా మారిపోయింది .
శ్రీ కృష్ణ పరమాత్మ ‘మథుర’లో ఇదే విధంగా కుబ్జను స్పృశించి ఆమె వక్రతను పోగొట్టి సౌందర్యవతిని చేశాడు. అక్కడ భగవంతుడే స్వయంగా అనుగ్రహాన్ని చూపారు . ఇక్కడ కంచిలో ఆ స్వామి దాసునికి దాసుడైన కానికణ్ణర్ ద్వారా మధుర లీలని పునరావృతం చేశారు . ఆ వృద్ధురాలు కూడా యవ్వనవతినైనానని ఆ గర్వాన్ని పొంది విర్రవీగలేదు , కుబ్జ ఏవిధంగా సౌదర్యవతి అయినా కూడా ఆ పరమాత్మనే కోరుకుందో, అదే విధంగా ఆ పెరుమాళ్ సేవలో తరించిపోవాలనే కోరుకుంది . ఆమెలో ఆ నిశ్చయం ఈ చర్యతో మరింత గొప్పగా స్థిరపడింది .
క్రమంగా ఈ అద్భుతం కానికణ్ణర్ చేశారని , ఊరంతా పాకింది . ఆ తర్వాత ఆ ప్రాంత రాజుకి కూడా తెలిసింది . వార్ధక్యంలో ఉన్న రాజుకి విషయవాంఛలమీద మమకారం తీరకపోవడం చేత, వాటిని పొందడం కోసం తిరిగి తానూ యెవ్వనవంతుడు కావాలనుకున్నాడు. కానికణ్ణర్ ని సభకి పిలిపించాడు . తనకి కూడా యవ్వనం వచ్చేలా చేయమన్నాడు .
కానికణ్ణర్ పూర్తిగా గురువుకే అంకితమైన సేవకుడు . అతని దృష్టిలో సృష్టిమొత్తానికి రాజరాజు తన గురువే. మిగిలినవారెవరూ రాజులు కానేకారు . ధర్మపథమే అతని మార్గం . అందువల్ల ఆయనన్నారు ,''ఆ వృద్ధను యువతిగా చేసినది నేనని నీకు ఎవరు చెప్పారు? నాకా శక్తి ఎక్కడిది? నా గురువు ప్రభావం నన్ను అప్పుడు ఆవేశించి ఆకార్యం నాచేత చేయించింది . ఇందులో నా ప్రమేయం ఏమీలేదు'' అని . అయినా రాజుకి తత్త్వం బోధపడలేదు . ‘అలాగైతే , నీ గురువునే నా సమక్షానికి తీసుకుర’మ్మన్నాడు.
'నీకు నా గురువు విషయం తెలిసినట్లు లేదు. నిన్నెపుడైనా దేనికైనా అతడు ఆశ్రయించాడా? అతనికి భగవంతుడు తప్ప అన్యం ఏదీ అక్కరలేదు. ఇతరుల వద్ద అతనికి వాంఛనీయమేదీ లేదు. భగవద్భక్తుల పైన అతనికెప్పుడూ కరుణ వుంటుంది. వారి కష్టాలను ఆయన నివారిస్తాడు. అందుకోసం వారిని ప్రత్యేకంగా ప్రార్ధించవలసిన అవసరం కూడా లేదు. ఆయన అనుగ్రహిస్తే ఎవరినో ఒకరిని నిమిత్తమాత్రం గ్రహిస్తాడు. ఆ వృద్ధ స్త్రీ , తనకు యవ్వనం కావాలని యాచించలేదు. కానీ మా గురువుగారి అవ్యాజ కరుణ ఆమె విషయంలో , నా మూలంగా ఫలించింది. ఆమెకు భగవత్కైంకర్యం తప్ప వేరే ప్రపంచం ఏదీలేదు. అందుకే ఆ భక్తురాలిని నా గురువు స్వయంగా అనుగ్రహించాడు. ప్రకృతి నియమాలని ఉల్లంఘించి ఆమెను యువతిగా చేశాడు. నీకూ ఆమెకూ ఎక్కడ పోలిక? నీవు నీలోని కోరికలని జయించలేక , వాటిని పొందేందుకు యవ్వనాన్ని వాంఛిస్తున్నావు . ఆమె భగవత్కైంకర్యం చేయాలని కోరుకొంటున్నది.
నీ బోటి వానిని నా గురువు ఎన్నడూ అనుగ్రహించడు. జరా, మృత్యువులు ప్రకృతి సిద్ధములు. అవి అపరిహార్యము. నీవు ఈ లోకం విడిచిపోయావంటే, ఇంకొకరు నీ సింహాసన మెక్కి ఈరాజ్యాన్ని పాలిస్తాడు. ఈ విధంగా రాజులు వచ్చారు, రాజులు వెళ్ళారు. నా గురువు ఏదైనా ముఖ్య కారణం వుంటే కానీ నిన్ను యువకుణ్ణి చేయడు. నీ ఆశ వదులుకో'' అని కానికణ్ణర్ రాజుకు బదులిచ్చాడు.
రాజుకు కోపం వచ్చింది. ‘నా రాజరికాన్నే ధిక్కరిస్తావా ? నిన్ను నారాజ్యం నుంచి బహిష్కారం చేశాను. ఈ రాజ్యం వదలి వెళ్ళు' అని దండన విధించాడు.
''నీవు నన్ను బహిష్కరాం చేసే దేమిటి? నీబోటి రాజు యొక్క రాజ్యంలో ఉండటమే పాపం. నేనే నీ రాజ్యం నుంచి వెళ్ళిపోతాను''. అని కణ్ణర్ కంచి వదలి వెళ్ళిపోయేందుకు ఉద్యుక్తుడయ్యాడు . ముందుగా ,తను గురువును దర్శించి జరిగినది చెప్పాడు .
తిరిమళిసి ఆళ్వారు పరమభక్తుడు. పరమయోగి. అన్నిటిలోనూ ఆయనకు విరక్తే. ఒక్క రెండు విషయాలలో తప్ప. అతడు తన భుజంగశయన పెరుమాళ్ళును వదలి వుండలేరు . రెండవది ఈ శిష్యుడు, కానికణ్ణర్, ఇతనినీ వదులుకోలేరు .
శిష్యుడు వెళ్ళేసరికి గురువూ అతనిని అనుగమించాడు. శిష్యుడు గురువును తన వెంట రమ్మని ప్రార్ధించలేదు. గురువే శిష్యుని వెంట వెడుతున్నాడు. ఆయన వాత్సల్యం అలాంటిది. ఆళ్వారు, తాను ఎట్లా తన శిష్యుణ్ణి అనుగమిస్తున్నాడో, తన భగవంతుడైన, భుజగశయనుడూ తన్ను అనసరించి వస్తాడని అనుకొన్నాడు. కానీ భుజగ శయనుడు నిశ్చింతగా తన శేష పర్యంకంపై పడుకొని వున్నాడు. ఆళ్వారు అన్నాడు; ''చూడు నాబిడ్డ రాజ్యం వదలి పోతూ వుంటే, నీవేమో చీమ కుట్టినట్టు కూడ లేకుండ పడుకొనివున్నావు. వెంటనే నీ చాపచుట్టు. నేనేమో వాడిని వదలి వుండలేను. నీవు ఈ విధంగా పడుకొని వుంటే ఏమిటి అర్ధం? గబ గబ లేచిరా'' అని.
ఇక లాభం లేదని భుజగ శయనుడు, ఆళ్వారును అనుగమించాడు. ఆళ్వారు కానికణ్ణన్ ను అనుసరించాడు. వాళ్ళు ఈవిధంగా 5 మైళ్ళ దూరం నడిచారు. ఇంతలో చీకటి పడింది. - ''ఈ చీకట్లో నాకు దారి కనిపించటం లేదు. ఈ రాత్రికి ఇక్కడే విశ్రమిద్దాం. తెల్లవారగానే మనం మళ్ళీ ప్రయాణం చేద్దాం.'' అన్నారు ఆ పెరుమాళ్ . దాంతో గురు, శిష్యులు, భగవంతుడు ముగ్గురూ కలిసి పాలార్ తీరంలో చల్లగా గాలి వీస్తుంటే, ఆకాశ పందిరి కింద , సుఖంగా నిద్రించారు. ఆ ప్రదేశమే ''ఓరిదవిరుక్కై'' - ''ఒకనాడి రాత్రి ఉండుట'' అని అర్థం . కాలక్రమేణా ఆ పదమే ఇప్పటి ''ఒరిక్కై'' అయ్యింది .
పెరుమాళ్ లేనిచోట ఆండాళ్ ఉంటుందా ? కంచిలో పెరుమాళ్ళు వీపుత్రిప్పాడో లేదో, అలక్ష్మి నగరమంతా ఆక్రమించింది. విష్ణువు వక్షఃస్థలంలో లక్ష్మి మబ్బు వెనుక మెఱుపువలె వుంటుంది. విష్ణువు ఎప్పుడు కంచి వదలి వెళ్ళాడో, లక్ష్మి ఆయన వక్షస్థలనివాసి కనుక, ఆయన వెంట , ఆమె కూడా వెళ్ళిపోయింది . కంచిలో అలక్ష్మితాండవించింది. అంతా చీకటే. దీపమన్న మాటలేదు. ఆలయాలలో పూజలన్నీ నిలిచిపోయాయి. అంతా తమసావృతమైంది. సంతోషమన్నమాటలేదు. ఎవరి ముఖం చూచినా విషాదం పులుముకొని వున్నది. బహుశా ఆ పెరుమాళ్ళు చీకట్లో దారి కనిపించడం లేదని చెప్పిన మాటకి అంతరార్థం ఈ పరిస్థితి కావొచ్చు!
ప్రజలందరూ రాజు వద్దకు వెళ్ళి మొఱపెట్టుకొన్నారు. అతనికీ ఆశ్చర్యమే. ఆదుర్దానే. విష్ణువు ఊరు విడచి వెళ్శినందున ఈ ముప్పు వచ్చిందని గ్రహించాడు. భగవంతుని పాదాలమీద పడి తన తప్పు క్షమించి రక్షించవలసినదని ప్రార్ధించడానికి అతడూ నగరం వదలి బయలుదేరాడు. ఉదయమయ్యేసరికి వారు మువ్వురూ ఉన్న చోటికి చేరుకొన్నారు. అతని ప్రార్ధన విన్న భగవంతుడు ఇలా అన్నాడు; ''చూడూ! నేను నా అంతట నగరం వదలి రాలేదు. ఈ ఆళ్వారు నన్ను రమ్మన్నారు. నేను ఆయన మాట త్రోసి వేయలేక వచ్చాను. ఆ ఆళ్వారు నాకు చెబితే కానీ నేను నగరంలో అడుగు పెట్టను. అందుచేత నీవు ఆ ఆళ్వారునే అడుగు''.
రాజు ఆళ్వారు వంకకు తిరిగాడు. ఆళ్వారు అన్నాడు, ''నేను నా అంతట నగరం వదలి రాలేదు. నా శిష్యుణ్ణివదలి నేను వుండలేను. నన్ను విడిచి వుండలేక పెరుమాళ్ళు నా వెంట వచ్చాడు. నేను వస్తే కానీ పెరుమాళ్ళు కంచి రాడు. నా శిష్యుడు వస్తే కానీ నేను కంచి రాలేను, నీవేమో నా శిష్యుణ్ణి బహిష్కరించావు. పోయి అతని పాదాలపై పడి వేడుకో - అతడు మళ్ళా కంచి వస్తే మేమూ అతని వెంట వస్తాం.''
రాజు కోరికను మన్నించి కానికణ్ణర్ కంచి తిరిగి వచ్చాడు. అతనితోబాటు, ఆళ్వారు, ఆళ్వారును అనుసరించి పెరుమాళ్ళూ, యధాప్రకారం కంచిలో అడుగుపెట్టారు . కంచికి వచ్చిన పెరుమాళ్ళు ఆదిశేషుణ్ణి పడుకోమని చెప్పితానూ అనంతశయనమూర్తిగా పవ్వళించవచ్చును కదా! లేదు! ఆళ్వారు ఆజ్ఞకోసం కాచుకొని నిలుచున్నాడు, ఆయన యథోక్తకారి కదా!
అంత వినయంగా నిలుచున్న ఆ పరమపదనాధుని చూచి ఆళ్వారుకు ప్రేమ పొంగిపోయింది. ''నేను వచ్చాను. నా శిష్యుడూ వచ్చాడు. 'అతనిని తీసుకొని రావడానికి నిన్ను చాపచుట్టమన్నాను. ఇప్పుడెందుకు వ్యర్ధంగా నిలుచున్నావు? చాప పరచుకొని సుఖంగ పవ్వళించు'' అని భక్తుడు ఆనతిచ్చాడు . భక్తుడు చెప్పిన మాటవిని భగవంతుడు భుజగ శయనుడయ్యాడు. ఆవిధంగా పరమ భక్తుడైన తిరుమళిసి ఆళ్వార్ చెప్పినట్టు విని యథోక్తకారి అనే పేరుని సార్థకం చేసుకున్నారు ఆ పెరుమాళ్ళు .
దీని ఆంతర్యం గురుభక్తి ఉన్నవారిని, గురువే కాదు; ఈశ్వరుడు కూడా అతనిని అనుసరిస్తాడని. అందుచేతనే కొందరంటారు; ''నాకు నా గురువనుగ్రహం వుంటే చాలు ఈశ్వరానుగ్రహం తానుగా వస్తుంది'' అని.
తిరుమళిసి ఆళ్వారు విష్ణువుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ''నాశిష్యుడు దేశం వదిని వెడుతున్నాడు. నీవు ఇక్కడ ఊరకే కూర్చుంటే ఎలాగు? అతనిని తీసుకొని రావడానికి నేను వెడుతున్నాను'' అని అనగానే పెరుమాళ్ళు ఆళ్వారును అనుసరించాడు. తిరిగి శిష్యుడు మళ్ళా కంచీపురం వచ్చినపుడు గురువు , అతని వెనుకనే పెరుమాళ్ళూ తిరిగి వచ్చాడు. అందుకనే అంటారు , గురువు అనుగ్రహం ఉంటె చాలు , విష్ణువు అతనిని అనుసరిస్తాడని. సత్యభామ తానూ చెప్పినట్టు కృష్ణుడు వినాలని అనుకోని , బంగారంతో తులాభారం తూచింది . కానీ భక్తి గల ఒక్క తులసి దళమే, నిలువెత్తు ధనం తూచలేని ఆ పెరుమాళ్ ని, జగద్గురువుని తూచగలిగింది . భక్తికి ఆ పెరుమాళ్ దాసుడు . ఆ విధంగా సద్గురువులైన వారికి , వారి శిష్య , ప్రశిష్య పరంపరకూ కూడా ఆయన తులసీ దళంతో తూయగలిగినత తేలికగా అనుగ్రహాన్నిచ్చే దేవుడు , చెప్పినట్టు వినేవాడు కూడా . మరి ఇంకా ఆలస్యం ఎందుకు , మీ మనసనే తులసిని భక్తితో ఆ స్వామికి అర్పించండి.
ఇలా ఈ పెరుమాళ్ కోవెలకి చేరుకోవచ్చు :
ఈ ఆలయాన్ని తమిళులు ‘సొన్న వన్నం సెయిధ పెరుమాళ్’ అని పిలుస్తారు .
రోడ్డు మార్గం ద్వారా , చైన్నై , మధురై , తిరుపతి నుండీ కంచికి చేరుకోవచ్చు. డైలు మార్గం ద్వారా మధురై , చెన్నైల దాకా వచ్చి , అక్కడ నుండీ ఇక్కడికి చేరుకోవచ్చు . వాయుమార్గంలో వచ్చే వారికి కంచి విమానాశ్రయం నుండీ 64 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది .