Online Puja Services

కష్టాలని తొలగించే త్రినేత్రుడైన హనుమంతుని దర్శనం !

18.118.255.51

కష్టాలని తొలగించే త్రినేత్రుడైన హనుమంతుని దర్శనం !
- లక్ష్మి రమణ 

ఆంజనేయుడి పేరే దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకు మారు పేరు. ఆయన మాటెత్తితేనే భూత ప్రేతాది దుష్టశక్తులు ఆమడదూరం పారిపోతాయి. ఆయన వాలము (తోక) స్వయంగా పార్వతీదేవి. సర్వశక్తి స్వరూపిణి. హనుమయ్య మాత్రమేమి తక్కువవారా ? ఆయనా రుద్రసంభవుడే కదా ! కానీ వానర రూపంలో ఉండడం వలన మూడవకన్ను ఉండదు . ఉండదని మనం అనుకుంటే సరికాదు.  మూడవ కన్ను ఉన్న హనుమ కొలువైన దేవాలయం, ఆ దేవాలయానికో దివ్యమైన స్థల పురాణం కూడా ఇన్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, కష్టాలన్నీ రూపుమాపి , రక్షణనిచ్చే ఆ రుద్రహనుమంతుని దర్శనానికి వెళదాం పదండి. 

 ఆంజనేయుని ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే స్వామే గుర్తుకు వస్తారు. ఆయన సాధారణంగా చేతిలో సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్ద అంజలి ఘటించో దర్శనమిస్తారు. కాదంటే , పంచముఖాలతో కనిపిస్తారు . కానీ , పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని ఎప్పుడైనా చూశారా?అటువంటి విభిన్నమైన స్వరూపంతో కొలువైన హనుమంతుణ్ణి దర్శించాలంటే తమిళనాడు రాష్ట్రానికి వెళ్లాల్సిందే !

దేవాలయాలు అత్యధికం ఉన్న రాష్టాలలోఒకటిగా పేరొందిన తమిళనాడు రాష్ట్రంలోని  నాగపట్నం జిల్లాలో ఆనందమంగళం అనే ప్రాంతముంది. అక్కడ కొలువైయున్నారు  త్రినేత్ర దశభుజ వీరాంజనేయ స్వామి. ఇక్కడ ఈ విధమైన విభిన్నమైన రూపంలో ఆంజనేయుడు కొలువై ఉండడానికి గల కారణం ఈ ప్రాంత స్థల పురాణం వివరిస్తుంది . 

త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన తర్వాత నారదుడు ఆయనను కలుసుకున్నారు. “స్వామి! లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు చేస్తున్నారు. వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాల”ని వేడుకున్నారు. అప్పుడు రాముడు “నారదమహర్షి రామావతారంలో నా కర్తవ్యం పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను. ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమ”ని అన్నాడు. కాగా, రాక్షస వధకు హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు.

అటువంటి యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు. ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు. కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు. ఆ విధంగా వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు. ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో ఆ ప్రాంత వాసులు, దేవతలు, ఋషులు, హనుమంతుడు అందరూ ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని భక్తులు చెబుతుంటారు.

ఈ క్షేత్రాన్ని దర్శించడం చేత భయాలన్నీ తొలగిపోతాయి. దైర్యం రక్షణ లభిస్తాయి . సర్వ కార్యాలలో విజయం సిద్దిస్తుంది. శుభం భూయాత్ !!

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi