మంత్రాలయానికి చేరువలో ఉన్న ఈ ఆంజనేయుని గురించి విన్నారా ?

మంత్రాలయానికి చేరువలో ఉన్న ఈ ఆంజనేయుని గురించి విన్నారా ?
లక్ష్మీ రమణ
ఆంజనేయుని లీలలు అనంతాలు. ఆయన గురించి ఏం చెప్పినా, యెంత చెప్పినా తనివితీరదు, అంతం కనిపించదు . అందువల్ల ఆ ఆంజనేయుని ఒక దివ్య మహిమోపేతమైన ఆలయాన్ని గురించి ఇక్కడ చెప్పుకుందాం . ఆంజనేయస్వామి ఎక్కడ కనిపించినా , రామునికి దాసునిగానే దర్శనమిస్తారు. హరి ఆలయాలలోనే కొలువై ఉంటారు. కానీ తమ్ ఆపంచముఖాలతో దశ భుజాలతో భక్త వరదుడై వెలసిన ఆలయాలు చాలా తక్కువేనని చెప్పుకోవాలి.
పంచముఖి ఆంజనేయుని విగ్రహం ఐదు ముఖాలు, పది ఆయుధాలతో భక్తులకు దర్సనమిస్తుంది. పంచముఖి ఆంజనేయస్వామి అవతారంలో హనుమంతుడు, నరసింహుడు, గరుడుడు, వరాహుడు, హయగ్రీవుడు ఆయన పంచ ముఖాలలో దర్శనమిస్తారు . రామలక్ష్మణులని మాయోపాయంతో యుద్ధభూమినుండీ పాతాళానికి ఎత్తుకుపోతాడు మైరావణుడు . ఆ రాక్షస సంహార సమయంలో ఈ పంచముఖి అవతారాన్ని ఎత్తారు ఆంజనేయస్వామి .
కంభరామాయణంలో హనుమంతుని గురించి చాల గొప్ప వివరణ ఉంటుంది . పంచ భూతాలకి ప్రతి రూపం కూడా ఈ ఆంజనేయ స్వామేనని ఇది మనకి చెబుతుంది . గాలి, నీరు, ఆకాశం, భూమి, నిప్పు ఈ ఐదు భూతాలనీ తనలో ఇముడ్చు కున్నవాడు అంజనీ సుతుడు. పవన తనయుడై - గాలిని , ఆకాశ (శూన్యాన్ని) మర్గాన నూరు యోజనాలు అధిగమించి - ఆకాశాన్ని . సముద్రాన్నిదాటి- నీటిని , అవనిజ అయిన సీతాదేవి జాడ తెలుసు కుని - భూమిని , లంకా దహనం చేసి - అగ్నిని స్నేహం చేసుకున్నాడు. ఆయా స్వరూపాలు తానె అయ్యి వెలుగొందాడు .
సుందరా కాండలో కుడా హనుమంతుని ధీర లక్షణాలను ఐదవ ఖండం లో చాలా చక్కగా తెలిపారు. అలాగే పంచ ముఖి ఆంజనేయునిలో తూర్పు దిక్కుని చూసే అంజనేయుడు మనోభీష్టాలు తీర్చే వానిగాను, దక్షిణ దిక్కు చూసే ఉగ్ర నరసింహుడు అబీష్ట సిద్ధిని, పడమర దిక్కుని చూసే మహావీరుడైన గరుడుడు సకల సౌభాగ్యాన్ని, ఉత్తర దిక్కుని చూసే వరాహ స్వామీ ధన ప్రాప్తిని, ఊర్థ ముఖుడైన హయగ్రీవుడు సర్వ విద్యా ప్రాప్తిని అందిస్తారని ప్రతీతి. ఇక్కడి స్వామీ అచ్చంగా ఇలాగే ఉంటారు. అద్భుతమైన ఆంజనేయ తత్వాన్ని విశదపరుస్తుంటారు .
ఈ ఆలయానికి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే, ఇక్కడ పక్కనే తుంగభద్రానది పరవళ్లు తొక్కుతుంటుంది. ఈ నదికి ఆవలివైపు ఆంధ్రప్రదేశ్ లోని మంత్రాలయం ఉంది. ఈ వైపు కర్నాటకా రాష్టంలోని పంచముఖి అనే ప్రాంతంలో ఈ పంచముఖ ఆంజనేయస్వామి ఉంటారు . ఈ ప్రాంతంలోనే గురు రాఘవేంద్రుల వారిని ఆయన పంచముఖ స్వరూపంతో అనుగ్రహించారని స్థానిక విశ్వాసం. అదే స్వరూపంలో స్వయంభువుగా ఇక్కడ వెలసి, భక్తులని కటాక్షిస్తున్నారు .
ఇక్కడ సహజం గా రాళ్ళతో ఏర్పడిన ఆకృతులు నిజంగా ఆశ్చర్య పరుస్తాయి. మంచం తలగడ, విమానం, తాబేలు, పాదుకలు, ఇంకా ఎన్నో ఆకారాలు మనకి దర్సనమిస్తాయి. పంచముఖి ఆలయంలో ప్రతి రోజు పూజాదికాలు నిర్వహిస్తుంటారు. ఈ ప్రాంతంలో శ్రీ అనంతాచార్యులు అనే శిష్యులు రుద్రదేవుడు, గణపతి, నాగ దేవుని విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు .
శక్తి వంతం, మహిమాన్వితం, అయిన శ్రీ పంచముఖి ఆలయం చూడవలసిన ప్రదేశం. ఇక్కడికి చేరుకోవడానికి మంత్రాలయమే దగ్గరి ప్రదేశం. ఇదివరకూ తుంగభద్రానదిపై పడవలు నడిచేవి. కానీ ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణం జరిగిన తరువాత ఆటోలు అందుబాటులో ఉన్నాయి .