ఆనందవిమాన దర్శనం చేయాల్సిన అవసరం ఏమిటి ?
ఆనందవిమాన దర్శనం చేయాల్సిన అవసరం ఏమిటి ?
- లక్ష్మీరమణ
తిరుమల ఆనంద విమానాన్ని దర్శించమని పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రీనివాసుని గర్భాలయ విమానం మీద ఉండే ఆ శ్రీనివాసుని ఎందుకు దర్శించుకోమంటారు? అంతరాలయంలో శ్రీనివాసుని దర్శించుకున్నాక కూడా ఆనందవిమాన దర్శనం చేయాల్సిన అవసరం ఏమిటి ? దీనికి సమాధానం స్కాంద పురాణంలో లభిస్తోంది . ఆ వివరాలు తెలుసుకుందాం రండి .
శ్రీనివాసుడు కలియుగానికి ప్రత్యక్ష దైవమె కానీ , కలియుగంలోనే అవతరించిన వాడు కాదు. ఆ స్వామి వేదకాలం నుండే ఉన్నారనడానికి ఆధారాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి గొప్ప ఉదంతాలు స్కాంద పురాణంలోనూ లభ్యమవుతున్నాయి. అటువంటి వాటిలో ఈ ఆనంద నిలయవాసుని కథ కూడా ఒకటి .
వైవస్వత మన్వంతరంలో కృతయుగం జరుగుతున్నప్పుడు, వాయుదేవుడు శ్రీహరి కోసం గొప్ప తపస్సు చేశాడు. ఈ తపస్సు ఫలితంగా శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతుడై , స్వామి పుష్కరిణికి దక్షిణ భాగంలో ఆనందం అనే విమానం మీద నివసించ సాగారు. అలా నిలచిన స్వామిని కుమార తీర్థంలో ఉన్న కుమారస్వామి నిత్యం అర్చిస్తూ ఉండేవారు. ఆ విమానం నచ్చిన శ్రీనివాస ప్రభువు కల్పాంతం దాకా అక్కడే అదృశ్యంగా నివసించాలని నిర్ణయించుకున్నారు.
ఇదిలా ఉండగా, ఒకనాడు అగస్త్య మహర్షి అక్కడికి వచ్చి విమానంలో నివసిస్తున్న శ్రీనివాసుని 12 సంవత్సరాలు పాటు ఆరాధించి, ఆయన్ని సంతోషపరిచారు. అగస్త్య మహర్షి స్వామిని ప్రభువు అందరికీ కనిపించేలా ఈ ఆనంద శిఖరం మీద నివసించు అని కోరారు. అప్పుడు శ్రీదేవి, భూదేవి సహితుడైన శ్రీనివాసుడు ఇలా అన్నారు. “ ఓ అగస్త్య మునీంద్రా ! మీ కోరిక ప్రకారం ఇకపై సకల జీవులకీ కనిపిస్తాను. అయితే ఈ ఆనంద విమానం మాత్రం ఎవరికీ కనిపించదు. ఈ కల్పాంతం వరకు నేనిక్కడే కొలువుంటాను. ఇందులో ఏమీ సందేహం లేదు” అని చెప్పారు .
“ అహం దృశ్యో భవిష్యామి త్పత్కృతే సర్వదేహినామ్ |
ఏతద్విమానం దేవర్షే నదృశ్యం స్యాత్కదాచన|
ఆకల్పాంతం మునీంద్రాస్మిన్దృశ్యోహం నాత్రసంశయః”
ఈ విధంగా స్వామి చెప్పగా విని, అగస్త్య మహర్షి ఎంతో సంతోషించారు. ఆ స్వామికి తిరిగి నమస్కరించి, తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇక ఆనాటి నుంచి చతుర్భుజి అయినటువంటి శ్రీనివాసుడు ఈ విమానం నుంచి అందరికీ దర్శనమిస్తున్నారు. కుమారస్వామి వాయుదేవుడు నిత్యం స్వామిని అర్చిస్తూ ఉన్నారు.
అందువల్ల విమాన వేంకటేశ్వరుడు స్వయంగా ఆ వేంకటేశ్వరుని స్వరూపమే. ఆ దేవదేవుని కృపాకటాక్షాలు అనంతంగా ఆ ఆనంద విమానం నుండీ వర్షిస్తూ ఉంటాయి. అందుకే పెద్దలు ఆ ఆనంద విమాన దర్శనం చేసుకోమని చెబుతూ ఉంటారు.
శ్రీ వెంకటేశ్వర దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు !!
శుభం .
#tirumala #tirumalatirupathi #vimanavenkateswara #anandanilayam #garbhalayam #ttd
Sri Venkateswara Swami, Ananda Nilayam, Tirumala Tirupati, Vimana Venkateswara Swami, Swamy