కోరికలు తీర్చే ప్రసన్నవరదుడు ఈ వేంకటేశుడు
కోరికలు తీర్చే ప్రసన్నవరదుడు ఈ వేంకటేశుడు .
సేకరణ
ప్రసన్నవెంకటేశ్వరస్వామి వారి తిరుమలకి సమీపంలోని అప్పలాయగుంటలో కొలువై ఉండే అభయ వరదాయకుడు . ఈ ఆలయంలో స్వామీ పసన్నవదనంతో అద్భుతమైన సౌందర్యంతో భాసిస్తూ దర్శనమిస్తారు . కొండమీద స్వామిని దగ్గరనుండీ చూడలేకపోయామని, తనివితీరేలా దర్శించుకోలేకపోయామని బాధ పడేవారు ఈ ఆలయంలో తృప్తిగా స్వామీ దర్శనాన్ని చేసుకోవచ్చు. ఇక్కడ స్వామికి నివేదించుకున్న కోరికలు తప్పక నెరవేరతాయని , అలా నెరవేరినవారు తిరిగి స్వామీ దర్శనానికి రావాలని చెబుతుంటారు ఇక్కడి అర్చకులు. రండి ఈ స్వామిని గురించిన విశేషాలు తెలుసుకుందాం .
అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో ఒకటి.శ్రీ వేంకటేశ్వరుడు నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని తన అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరారు.
తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురంలో ఆరునెలలు ఉండి, అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా తిరుమల చేరాడని స్థల పురాణం. ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంటపొలాలు ఉండడముతో వాతావరణము చాల ప్రశాంతంగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, దాని వెనుక అంతరాళం, ఎదురుగా గర్భ గుడిలో శ్రీ వారి దివ్య మంగళ రూపం కనుల విందు చేస్తుంది.
శ్రీ వారి ఆలయం ముందు చిన్న కోనేరు, దానికి ముందర ప్రధాన ఆలయానికి ఎదురుగా చిన్న ఆంజనేయ స్వామి వారి ఆలయము ఉంటుంది . నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి, తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగ జేస్తారు.
అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి పరిసరప్రాంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడా ఇక్కడి వస్తుంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయమిది.