రుణబాధలు తొలగించే వెంకన్న సన్నిధి
రుణబాధలు తొలగించే వెంకన్న సన్నిధి !
లక్ష్మీ రమణ
వెంకన్న సామి పెళ్లిచేసుకొని నానాతిప్పలు పడ్డారు . పాపం పెళ్లి చేసుకొని అప్పులపాలయిపోయారు . మనమైనా అంతే కదా ! పెళ్లి చేసుకొని , ఆ అప్పులు తీర్చుకునేందుకు నానా తిప్పలూ పడుతుంటాం . అప్పులవాళ్ళు వాయిదా కట్టకపోతే అనే మాటలు , పెళ్లి చేసుకొన్న సంతోషాన్ని ఒక్క నెలనాళ్ళయినా నిలవనిస్తారా ? అయినా వాళ్ళ వాదనా కరక్టే మరి ! అదిగో అలాటి పరిస్థితిలోనే ఇరుక్కుని , కుబేరుడి అప్పుకి వద్దే కట్టలేక గుబులు పడిపోయిన వెంకన్న హైదరాబాద్- వరంగల్ హైవే దాకా వచ్చేశారట !!
గుబుగుబులుగా , ఆ అప్పు గురించే ఆలోచిస్తున్న స్వామి వెంకన్న హైదరాబాద్- వరంగల్ హైవే పైనున్న చిల్పూరు కొండపైన విడిది చేశారు . ఈయన్ని దర్శించుకుంటే, అప్పుల బాధల నుండీ విముక్తి కలుగుతుందని ప్రతీతి . ఈ ఆలయానికి గూగుల్ వెంకటేశ్వర స్వామి ఆలయమనే పేరు కూడా ఉంది . స్వయంగా రుణబాధలు అనుభవించారు కదా ఆ వేంకటేశ్వరుడు . అందుకే ఆయనకీ రుణగ్రహీతల కష్టాలు బాగా తెలుసు . తాను పడ్డ గుబులు తన భక్తులకి వద్దని ఇక్కడ వెలిసి భక్తులని అనుగ్రహిస్తున్నారు .
ఇక్కడ స్వామివారి పాదాలు చక్కగా విరిసిన కమలాలలాగా ఉంటాయి . చుట్టూ పరుచుకున్న పచ్చని ప్రకృతి నడుమ , కొండమీద వెలిసిన కోనేటిరాయుడు నిండుగా దర్శనమిస్తాడు . ఇక్కడి స్వామి పాదాలని దర్శించుకొని అక్కడి అఖండ దీపంలో నూనె వేసుకొని , దీపారాధన చేసుకుంటే, ఆర్ధిక బాధలు తొలగిపోతాయని నమ్మకం .
ఏదేమైనా తన దర్శన మాత్రం చేత రుణబాధలు తొలగించే దేవుడు చెంతనే ఉన్నారంటే , వెళ్లి దర్శించుకోవడం గొప్ప సుకృతమే కదా ! పైగా ఏడుకొండలూ ఎక్కాల్సిన అవసరం లేకుండా, ఆకొండలన్నీ తానె నడిచి , తెలుగునేలపై నిలిచి అనుగ్రహిస్తుంటే , ఆ శ్రీవారిని పెన్నిధిలా దర్శించుకోవడమే కర్తవ్యమ్ కదా ! ఈ సారి వరంగల్ , హైదరాబాదులకి ప్రయాణమయ్యేవారు తప్పక ఇక్కడ కాసేపు ఆగండి మరి !