విచిత్రమైన నాగులు నేటికీ సంచరించే ప్రపంచంలోనే దివ్యమైన క్షేత్రం .
విచిత్రమైన నాగులు నేటికీ సంచరించే ప్రపంచంలోనే దివ్యమైన క్షేత్రం .
-లక్ష్మీ రమణ
ప్రపంచంలోనే సర్పారాధనకి అత్యన్నతమైన ఆరాధనా స్థలం ఒకటుంది. మందార పూలకీ ఈ ఆలయానికి విడదీయరాని సంబంధముంది. శివుని ప్రసాదితమైన గొడ్డలి అనుగ్రం ఈ ప్రదేశం. ఒక్క మొక్క కూడా మొలవని లవణసమన్వితమైన నేల. ప్రస్తుతం పచ్చని ప్రకృతి పరవశించి ప్రకాశిస్తుంది. కారణం మహా కాలకూట విషం. ఇది కేవలం ఆ నాగరాజు కృపా కటాక్షం. ఆ కథ అత్యంత అపూర్వం. ఆ క్షేత్రం అద్భుతం అనే పదానికి అసలైన అర్థం. 30వేలకి పైగా సర్పాల రూపాలు , విచిత్రమైన నాగులు నేటికీ సంచరించే ప్రదేశం. సర్పదోషాలని తొలగించే అత్యున్నతమైన ఈ దివ్య స్థలిని దర్శిద్దాం రండి.
మందారపూలవనం ఇది. కేరళ భాషలో చెప్పాలంటే మందారశాల. కాలక్రమంలో ఈ పేరు మన్నరసాలగా స్థిరపడింది. ఇక్కడ ఆ నాగరాజు శివ, కేశవ స్వరూపుడై దివ్యప్రభావ సమన్వితుడై స్వయంగా కొలువయ్యాడు. సర్ప దేవతలకు అత్యున్నతమైన ఆరాధనా స్థలంగా మన్నరసాల పేరొందింది. మన్నరశాల నిజంగానే ఒక అద్భుతం . ఆ ప్రాంతం ఈ భూమిలో ఒక భాగం కావడం నుండీ ఇప్పటి ప్రసిద్ధి పొందిన పరిణామ క్రమం ఒక చరిత్ర . ఆ చరిత్రని సోదాహరణంగా మీకందించే ప్రయత్నమే ఈ కథనం .
నాగరాజ ఆవిర్భావం :
భృగు వంశస్థుడైన మహర్షి జమదగ్ని కుమారుడు పరశురాముడు. పరశురాముడు విష్ణు అంశావతారం కాగా, ఆయన చేతిలోని పరశువు శివప్రసాదితం. పరశురాముని కథ ఒక దివ్యామృతమే. అయితే, ఇక్కడ మనం ఈ మన్నరశాల స్థల పురాణంతో ముడిపడిన కథనే చెప్పుకుందాం. తండ్రి మరణానికి ప్రతీకారంగా భూమిమీద కక్షత్రియులందరినీ మట్టు పెడతాడు పరుశురాముడు. అయితే, పాస్చాత్తాపం కలిగాక, అంత మంది క్షత్రియులను చంపిన పాపం నుండి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఋషులను సంప్రదించాడు. అప్పటికే కశ్యపునికి ధారపోసిన భూమి కాకుండా, తనదైన భూమిని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వాలని వారు సూచించారు. సమస్త భూమిని దానం చేసేసిన పరశురాముడు తన సొంత భూమి ఎక్కడుందా అని వెతుకుక్కుంటున్న ఆ సమయంలో సముద్రుడు ఆయన కంటికి కనిపించాడు. వెంటనే వరుణదేవుని (సముద్రాల ప్రభువు) ధ్యానించి, తనకు కొంత భూమి కావాలని కోరాడు. వరుణుడు ప్రత్యక్షమై భూమిని తిరిగి పొందేందుకు శివ ప్రసాదించిన ఆయన పరశువుని ( గొడ్డలిని) సముద్రంలోకి విసిరేయమని సలహా ఇచ్చాడు. అలా ఆ ఆ పరశువు యెంత దూరంలో పడిందో అంతవరకూ ఉన్న భూమి సముద్రుడు విడిచిపెట్టి దాన్ని పరశురాముని ధారపోశాడు. అలా తానూ పొందిన భూమిని బ్రాహ్మణులకి దానం చేశాడు పరశురాముడు. ఆ భూమే ప్రస్తుత కేరళ అని విశ్వాసం.
సముద్రం విడిచిన భూమి కావడంతో సహజంగానే ఆ భూమి ఉప్పునిండి ఉండేది. లవణీయత కారణంగా అక్కడ కూరగాయలు కూడా పండలేదు. ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. దీంతో పరశురాముడు బాధపడ్డాడు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమయ్యి, కేవలం కాలకూట విషయాన్ని ఆ నేలంతా విస్తరింపజేయడం మాత్రమే ఏకైక మార్గమని సూచించాడు. దానికి సర్పరాజుని ప్రసన్నం చేసుకోమని సలహా ఇచ్చారు.
పరశురాముడు కేరళ పచ్చని మొక్కలు, చెట్లతో సస్యశ్యామలంగా మారేంతవరకూ తాను విశ్రాంతి తీసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. నాగరాజుని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సుకు సంతోషించిన నాగరాజు ఆయన కోరికను తీర్చడానికి సిద్ధపడి పరశురాముని ముందు ప్రత్యక్షమయ్యాడు. పరశురాముడు నాగరాజు పాద పద్మములకు సాష్టాంగ నమస్కారము చేసి, తన లక్ష్యమును సాకారం చేయమని ప్రార్థించాడు. నాగరాజు చాలా సంతోషంతో అతని అభ్యర్థనను మన్నించాడు. మంటలు చెలరేగుతున్న కాలకూట విషాన్ని వ్యాపింపజేయడానికి క్రూరమైన సర్పాలు ఒక్కసారిగా ఆ స్థలానికి చేరుకున్నాయి. వాటి విషం కాణంగా అప్పటివరకూ విపరీతమైన లవణసమన్వితమైన భూమి, పంటలు పండేందుకు అనువుగా తయారయ్యింది. పచ్చదనంతో నివాసయోగ్యంగా తయారయ్యింది. ఆవిధంగా అనుగ్రహించిన నాగరాజుని, అదే ప్రదేశంలో శాశ్వతంగా ఉంది భక్తులని అనుగ్రహించమని వేడుకున్నాడు పరశురాముడు. దయాద్రహృదయుడైన ఆ నాగరాజు కూడా అందుకు అంగీకరించారు.
నాగరాజు ప్రతిష్ఠాపన:
ఒక పవిత్రమైన ముహూర్తంలో , పరశురాముడు, వేద సంస్కారాల ప్రకారం, మందర వృక్షాలతో కూడిన వనం 'తీర్థస్థలం' లో బ్రహ్మ, విష్ణు , శివ స్వరూపుడైన నాగరాజును ప్రతిష్టించాడు. ఈ ప్రదేశాన్నే మందారశాల అని పిలుస్తారు. ఈ నాగరాజు - అనంతడు (విష్ణుస్వరూపము), వాసుకి (పరమేశ్వరుని ) ఏకస్వరూపముగా భావిస్తారు. ఈయన శక్తి స్వరూపిణులుగా సర్పయక్షి, నాగయక్షి , నాగచాముండి, నాగ దేవతలు దర్శనమిస్తారు. ఇతర నాగ సహచరుల ప్రతిష్ఠాపనలు సరైన ఆచారాలతో సరైన ప్రదేశాలలో నిర్వహించబడ్డాయి. వేదపఠనం, సామగానం , అభిషేకం, అలంకారం, నైవేద్యసమర్పణం, నీరంజనం, సర్పబలి తదితర వ్రతాలను పారాయణం చేస్తూ పరశురాముడు సర్పదేవతలకి ప్రీతిని కలిగించారు.
స్త్రీశక్తి స్వరూపిణులైన ఈ నాగ దేవతల్లో సర్పయాక్షియమ్మ శ్రీ నాగరాజు భార్య. ఆమె ప్రధాన ఆలయానికి ఉత్తరం వైపున ప్రతిష్టించబడిన ఇతర ప్రధాన దేవత. శ్రీ నాగరాజ సమేతంగా సర్పయాక్షియమ్మకు రోజూ పూజలు నిర్వహిస్తారు.నాగయక్షీఅమ్మ కూడా శ్రీ నాగరాజు భార్య. కాగా నాగచాముండియమ్మ శ్రీ నాగరాజు సోదరి.
ఆ తర్వాత వేదవిద్వాంశులైన పండితులని తీసుకువచ్చారు పరశురాముడు. వివిధ ప్రదేశాలలో దుర్గ మరియు ఇతర దేవతలను స్థాపించారు. పూజలు నిర్వహించడానికి తాంత్రిక నిపుణులైన బ్రాహ్మణులను నియమించారు. వైద్యుల్లో అగ్రగామిగా ఉన్న క్షత్రియులు, రైతులు మరియు అష్టవైద్యులను నియమించారు. ఈ ప్రదేశ పవిత్రతను కాపాడటానికి అనుసరించాల్సిన ముఖ్యమైన సూచనలను ఇచ్చిన తరువాత, పరశురాముడు మహేంద్ర పర్వతాలపై తపస్సు చేయడానికి వెళ్లిపోయారు.
ఇక్కడితో మన్నరశాల కథ ముగిసిపోలేదు. మరో కొత్త ప్రారంభం మొగ్గతొడిగింది.
కొత్త ప్రారంభం:
పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళాక , ఆయన నాగరాజు సేవ కోసం నియోగించిన బ్రాహ్మణ కుటుంబాలు శ్రద్ధగా , నియమ నిష్టలతో నాగరాజుని సేవించుకుంటూ ఉన్నారు. అలా కొన్ని తరాలు గడిచిన తర్వాత , సంరక్షించాల్సిన ఒక బ్రాహ్మణ కుటుంబం సంతానం లేని దుఃఖంలో పడింది. వాసుదేవుడు, శ్రీదేవి ఆ దంపతుల పేర్లు. తమ దుఃఖాన్ని తొలగించమని నాగరాజును అనేక విధాలుగా ప్రార్ధించేవారు ఆ పుణ్య దంపతులు.
ఈ సమయంలోనే నాగరాజు నివాసం ఉన్న ఆ చుట్టు పక్కల అడవిలో అనూహ్యంగా మంటలు చెలరేగి అడవి దగ్ధమైంది. అనేకమైన సర్ప జాతులు ఆ మంటలతో హింసించబడ్డాయ. వాసుదేవుడు, శ్రీదేవి దంపతులు శరీరాలు సగం కాలిపోయి, అప్పుడప్పుడు స్పృహతప్పి పడిపోయి, పాకుతూ ఆ మంటల నుండీ బయటపడిన సర్పాలను రక్షించారు. ఆప్యాయంగా సేవలు చేశారు. సాక్షాత్తూ నాగరాజు స్వరూపాలుగా భావించి పూజించి సేవలు చేశారు. గాయాలపై తేనె , నూనె కలిపిన నెయ్యిని పోశారు; గంధపు లేపనంతో వాటి శరీరాలను సేదతీర్చారు ; మర్రి చెట్ల కింద ఉంచి స్వాంతన చేకూర్చారు. వాటి పుట్టాలని శుద్ధి చేసి అమర్చారు. పంచగవ్యాలతో (ఆవు పాలు, పెరుగు, వెన్న, మూత్రం మరియు పేడ నుండి ఐదు వస్తువుల పవిత్ర మిశ్రమం) తో వాటికి అభిషేకం చేశారు; అరెకా కాయ పూల గుత్తులు, సువాసనగల పువ్వులు మరియు నీరు, ధూపం మొదలైన వాటితో నియమాల ప్రకారం విస్తృతమైన పూజలు చేశారు. ఈ సేవ ఒక కొత్త ప్రారంభానికి నాంది పలికింది.
మన్నరశాల అమ్మ :
ఆవిధంగా వారు చేసిన సేవలకు సంతోషించిన నాగరాజు స్వయంగా తానె వారికి పుత్రుడై జన్మించారు. అలా మాతృ మూర్తి అయిన శ్రీ దేవి తర్వాత ఆ ఆలయంలో స్త్రీలే పూజారులయ్యారు. అలా ఇప్పటికీ ఆ ఆలయంలో నాగరాజు తల్లిచేతనే పూజలు అందుకుంటారు. నాగరాజుకు పూజలు అందించే మాతృదేవిని మన్నరశాల అమ్మ అని పిలుస్తారు.
మన్నరసాల అమ్మవారే మన్నరసాల ఆలయ ప్రధాన పూజారి. ఆమె ఆయిల్యం ,మహా శివరాత్రి తదితర పర్వతాలలో, పవిత్రమైన రోజులలో అన్ని ప్రధాన పూజలను నిర్వహిస్తారు.
ప్రత్యేక సర్ప పూజలు :
ఉరుళి కమజ్తు అనేది శ్రీ నాగరాజ మరియు సర్పయాక్షియమ్మలకు ఒక ముఖ్యమైన నైవేద్యం, ఇది వివాహిత దంపతులు సంతానం పొందేందుకు (‘సంతాన లబ్ధి’ కోసం) చేస్తారు.
వివిధ రకాలైన సర్ప దోషాలు, రాహు దోషాలు, కాల సర్ప యోగం మొదలైన వాటికి నివారణగా చేసే ముఖ్యమైన పూజలో నూరుమ్ పళం ఉంది. మే చివరి వారంలో నిర్వహించబడుతుంది.
సర్ప దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు సర్పబలి అత్యంత ముఖ్యమైన పూజ. సర్పబలిలో శ్రీ నాగరాజ మరియు సర్పయక్షియమ్మలతో పాటు అన్ని సర్ప దేవతలకు నూరు పాలు సమర్పించడం కూడా ఉంటుంది. ఇందులో నాగచాముండియమ్మ మరియు నాగయక్షిమ్మలకు గురుతి పూజ కూడా ఉంది.
అష్ట నాగ పూజ అనేది అనంత మరియు వాసుకితో ప్రారంభించి అష్ట నాగులకు (ఎనిమిది ప్రధాన సర్ప దేవతలు) ఒక ముఖ్యమైన పూజ.
తులాభారం అనేది ఒకరి కోరికను నెరవేర్చడానికి, శ్రేయస్సు, శ్రేయస్సు మరియు దీర్ఘ ఆరోగ్యవంతమైన జీవితం కోసం శ్రీ నాగరాజకు సమర్పించబడిన నైవేద్యం. నైవేద్యం ఏదైనా పదార్ధం కావచ్చు (సాధారణంగా అరటిపండు, బెల్లం, పాలు మొదలైనవి) శ్రీ నాగరాజ ముందు ఉంచిన తర్వాత, తులనాత్మకంగా కొలవబడిన బరువు కంటే అది ఎక్కువ బరువు ఉండడం విశేషం .
సర్పప్రతిమ నడక్కెవెప్పు అనేది సర్పదోషాల నుండి విముక్తి కోసం శ్రీ నాగరాజు మరియు సర్పయాక్షియమ్మలకు అత్యంత భక్తితో సమర్పిస్తుంటారు. అందువల్ల ఇక్కడ కొన్ని వేల సర్ప ప్రతిమలుంటాయి.
ఇప్పటికీ కనిపించే విచిత్ర సర్పాలు :
ఇప్పటికీ ఈ ప్రాంతంలో మనం కానీ వినీ ఎరుగని సర్పాలు తిరుగుతూ ఉంటాయి. అవి భక్తులని ఏమీ చెయ్యవు . విచిత్రం , దివ్యమూ ఐన ఈ ప్రదేశాన్ని దర్శించుకోవడం ఆ నాగరాజుని స్వయంగా దర్శించుకోవడంతో సమానమని ఇక్కడి స్థానికులు చెబుతూ ఉండడం సత్యదూరం కాదని ఈ క్షేత్రాన్ని దర్శించినారు ఖచ్చితంగా అనుకోని తీరతారనడంలో అతిశయోక్తి లేదు.
మన్నరసాల శ్రీ నాగరాజ క్షేత్రం నైరుతి కేరళలో ఉన్న ఒక పురాతన పుణ్యక్షేత్రం. ప్రపంచంలోని అన్ని సర్ప పూజా స్థలాలలో ఉన్నతమైనది మాత్రమే కాదు. దివ్యమైన భగవంతుని ఉనికినిచాటే పరమ పవిత్ర క్షేత్రం. ఈ సారి కేరళ వెళ్లేప్పుడు, ప్రక్రుతి అందాలని ఆస్వాదించడానికి మాత్రమే కాకుండా, మన్నరశాలలో అణువణువూ నిండిన ఆధ్యాత్మిక శోభని అనుభూతి చెందే విధంగా మీ యాత్రని రూపొందించుకోండి.
శుభం .
Mannarasala, nagaraja kshetram, nairuthi kerala, astanaga puja, astanaga, pooja, nadakkiveppu, sarpayakshiyamma, Naga chamundi amma, sarpayakshi amma, special snake pooja, variety snakes