తారా దేవి ఆలయం .

విచిత్రమైన పూజావిధానం, అతీంద్రియమైన అనుగ్రహం- తారా దేవి ఆలయం .
-సేకరణ
భారత దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దేవాలయం మాత్రం చాలా ప్రత్యేకమైనది. అక్కడ సాధారణ భక్తుల కంటే అఘోరాలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుంది. అంతే కాకుండా దేవాలయం దగ్గర్లో ఉన్న స్మశానంలోనే అఘోరాలు ఉంటూ తాంత్రిక శక్తి కోసం పూజలు చేస్తుంటారు. వారి పూజలు కూడా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. ఎంత కష్టసాధ్యమైన కార్యమైనా, ఎంతటి ప్రయోగమైనా, ఎటువంటి సమస్యయినా తారాదేవి అనుగ్రహంతో ఖచ్చితంగా తొలగిపోతుందని తాంత్రికులు చెబుతారు.
ముఖ్యంగా మరణించిన కన్నెపిల్లల శరీర భాగాలు పవిత్రమైన దేవతగా వారు భావించి వాటితో పాత్ర గా మార్చుకుని, అందులోనే ఆహారం స్వీకరిస్తారు. ఆ శరీర భాగాలు దొరక్కపోతే వారు వేరే పాత్రలో ముద్ద కూడా ముట్టరు. దానికి కారణం అక్కడే సతీదేవి దేహం విడిచిందని అందుకు అక్కడ స్త్రీల మృతదేహాన్ని కూడా పవిత్రమైనదని భావిస్తారు. ఇంతటి విచిత్రమైన దేవాలయం దర్శనం కోసం విదేశాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఆ భక్తులు కూడా తాంత్రిక శక్తుల కోసమే వస్తారు.
స్థలపురాణం :
పూర్వం సతీదేవి తండ్రి, స్వయంగా పరమేశ్వరునికి మామ అయిన దక్షప్రజాపతి ఒక దివ్యమైన యాగం తలపెట్టాడు. అహంకారంతో తానూ తలపెట్టిన యజ్జానికి పరమేశ్వరుని ఆహ్వానించలేదు. పుట్టింటిపైన మమకారంతో ఆహ్వానం లేకపోయినా దక్షప్రజాపతి కుమార్తే అయిన దాక్షాయణి తన భర్త అయిన శివుడిని బలవంతంగా ఒప్పించి, పుట్టింటిలో జరిగే యాగానికి వెళ్లింది.అయితే అక్కడ ఆమెను తండ్రితో సహా తోబొట్టువులు ఎవరూ పలుకరించలేదు. పైగా శివుని నానా దుర్భాషలూ ఆడారు. శివనింద, నిరాదరణ, అవమాన భారంతో సతీదేవి కుమిలిపోయింది . భర్త మాట వినకుండా పిలవని పేరంటానికి వచ్చానని పశ్చాత్తాప పడింది. యోగాగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేసింది.
విషయం తెలిసిన శివుడు ప్రళయ రుద్రుడయ్యాడు. తన జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. అంతే కాకుండా తన భార్య వియోగాన్ని భరించలేక శివుడు పార్వతి దేవి మృత దేహాన్ని భుజం పై వేసుకొని పట్టరాని ఆవేశంతో ప్రళయ తాండం చేస్తాడు. దీంతో ముల్లోకాలు భయపడుతాయి. సమస్య పరిష్కారం కోసం విష్ణువు ముందుకు వస్తాడు. తన సుదర్శన చక్రాన్ని వినియోగించి పార్వతి దేవి శరీరాన్ని 51 భాగాలు చేస్తాడు. ఆ భాగాలన్నీ పడిన ప్రదేశంలో శక్తి పీఠాలు వెలిశాయి. అలా దక్షాయని నేత్రం పడిన ప్రాంతం ఈ తారా పీఠమని ఒక కథనం.
అయితే ఇక్కడ తారామాత స్వరూపంలో దేవదేవి కొలువవ్వడానికి మరో గాధానికూడా స్థానికులు ప్రామాణికంగా భావిస్తూ ఉంటారు .
దేవతలూ, రాక్షసులూ కలిసి అమృతం కోసం సాగరమథనం చేశారు. మథనం ప్రారంభించిన కొద్ది సమయం తర్వాత ఈ విశ్వాన్ని అంతటిని దహించి వేసే హాలాహలం సముద్రం నుంచి పుట్టింది. దేవతల కోరిక పై ఈ విశ్వంలోని సమస్త కోటిని రక్షించడానికి వీలుగా పరమేశ్వరుడు ఆ హాలాహాలన్ని తాను స్వీకరించాడు. అయితే ఆంతటి దేవదేవుడు కూడా ఆ హాలహలం ప్రభావం వల్ల అస్వస్థతకు గురయ్యి కొద్ది సేపు మూర్చపోయారు. అప్పుడు అమ్మవారు జగన్మాత తారా దేవి రూపంలో ప్రత్యక్షమయ్యి ఆ పరమశివుడిని తన ఒడిలోకి తీసుకుని తన స్తన్యం ఇస్తుంది. దీంతో పరమశివుడు కొంత కొలుకుంటారు.
అందుకే ఇక్కడ తారాదేవి పరమశివుడికి స్తన్యం ఇచ్చిన స్థితిలో నల్లటి విగ్రహం ఉంటుంది. అయితే ఈ విగ్రహం మొత్తం ఎల్లప్పుడూ పూలతో కప్పబడి ఉంటుంది. కేవలం అమ్మవారి మొహం మాత్రమే చూడటానికి వీలవుతుంది.అందువల్లే ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలిగిపోతాయని భక్తుల నమ్మకం.
ఇక అమ్మవారి నేత్రాలు పడటం వల్ల ఈ పీఠం మిగిలిన శక్తి పీఠాలతో పోలిస్తే అత్యంత శక్తివంతమైనది పురాణాలు చెబుతాయి. ఇక్కడ అమ్మవారిని కొలిచిన వారికి అతీంద్రియ శక్తులు వస్తాయని చెబుతారు. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో అమ్మవారి విగ్రహానికి అతీతమైన శక్తి వస్తుందని, ఆ సమయంలో ఈ దేవిని ఉపాసన చేసిన వారికి తాంత్రిక శక్తులకు వశమవుతాయి అని చెబుతారు.
అందువల్లే ఈ దేవాలయాన్ని తాంత్రిక శక్తుల దేవాలయాలకు రాజధానిగా పేర్కొంటారు. అందువల్లే ఇక్కడకు తాంత్రిక కార్యక్రమాలు నిర్వహించే అఘెరాలు ఎక్కవగా వస్తుంటారు.
దేవాలయంలో అమ్మవారికి రెండు విగ్రహాలు ఉంటాయి. ఒక విగ్రహం పరమేశ్వరునికి క్షీరాన్ని అనుగ్రహిస్తున్న భంగిమలో ఉంటుంది. ఇది రాతితో తయారయ్యింది. మరొకటి లోహ మూర్తి. ఈ మూర్తిలో అమ్మవారు భయంకరంగా కనిపిస్తారు. నాలుగు చేతులతో, ఆయుధాల్ని ధరించి , చింత నిప్పుల కన్నులతో రౌద్ర స్వరూపంతో ఉంటారు. కపాలమాలని హారాన్ని ధరించిన తారాదేవి చూడటానికి గగుర్పాటు కలిగించేలా ఉంటారు. అమ్మవారి ఈ రూపాన్నే అఘోరాలు ఎక్కువగా పూజిస్తుంటారు.
అఘోరాల పూజలు :
అఘోరాలు ఈ దేవలయం పక్కన ఉన్న స్మశానంలోనే ఉంటూ అమ్మవారికి పూజలు చేస్తుంటారు. ఇందుకోసం చిన్న కుటీరాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఈ కుటీరాలు చాలా వరకూ ఎముకల నిర్మితం. వారి పూజలు కూడా చాలా విచిత్రంగా ఒళ్లును గగుర్పాటుకు గురిచేసేలా ఉంటాయి.
స్వయంగా శివస్వరూపాలని భావించే అఘోరాల పూజా విధానాలు సామాన్యులకి విచిత్రంగా అనిపించడంతో ఆశ్చర్యం లేదు. స్మశానంలో అప్పుడే కాల్చిన శవం బూడిదను వీరు తమ ఒంటికి రాసుకుంటారు. మనుష్యుల ఎముకలను ముఖ్యంగా పెళ్లికాని వారి భౌతిక కాయం నుంచి వేరు చేసిన ఎముకలు వీరు తమ శరీరంపై ధరిస్తుంటారు.
అఘోరాలు ఆహారం తీసుకునే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్ల పుర్రెలు, కటి భాగం (పెల్విక్ బోన్స్, హిప్ బోన్) తో చేసిన ప్రాత్రలో వారు ఆహారాన్ని తీసుకుంటారు.
ఒక వేళ అవి దొరకకపోతే ఉపవాసం అయినా ఉంటారు కాని వేరొక పాత్రలో ఆహారాన్ని తీసుకోరు. వీరు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. సంవత్సరాల కొద్ది వారు అలాగే ఉండి పోతారు. ఇక అమ్మవారిని కొన్ని ఏళ్లపాటు వారు ఉపాసన చేస్తూ ఇక్కడ ఉండిపోతారు.
ఈ తాంత్రిక దేవాలయం పశ్చిమ బెంగాల్ లోని బీర్బుమ్ జిల్లాలో తారపీఠ్ అనే చిన్న పట్టణంలో ఉంది. ఈ దేవాలయంలో తాంత్రిక పూజలు చేయడానికి విదేశీయులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.
(ఎంతో కష్టమైన పనులు కూడా ఈ తల్లి అనుగ్రహం ఉంటే సాధ్యం అవుతుంది, అలాగే ఎంతటి ప్రమాదం అయినా తొలగించ గల శక్తి ఉన్న దేవత )
ఇలా చేరుకోవాలి:
కలకత్తా ఎయిర్ పోర్టు నుంచి తారాపీఠ్ కు 216 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నుంచి ప్రేవేటు ట్యాక్సీల ద్వారా తారాపీఠ్ చేరుకోవచ్చు. తొమ్మిది కిలోమీటర్ల దూరంలో రాంపుర్హాట్ రైల్వే స్టేషన్ కలదు. కలకత్తా నుంచి బస్సులు కూడా ఉన్నాయి.
Taradevi Temple, Tarapeeth, Sakthi Peetham, Astadasha Sakthi peetham, Kolkata, calcutta,
#taradevitemple #tarapeeth #sakthipeetham #astadashasakthipeetham