పాకిస్థాన్ ఎన్ని బాంబులు వేసినా పేలకుండా చేసిన అమ్మవారి ఆలయం .
పాకిస్థాన్ ఎన్ని బాంబులు వేసినా పేలకుండా చేసిన అమ్మవారి ఆలయం .
- లక్ష్మి రమణ
ఈదేశం మీద, ఈ దేశ ధర్మం మీద అరాచకంగా విరుచుకుపడిన ముష్కర మూకలని తరిమి కొట్టేందుకు ఆ జగజ్జనని అనేక రూపాలలో వ్యక్తమై వారిని తుదముట్టిస్తుంది . తన శక్తిని ప్రసాదించి తన బంటులని ప్రేరేపిస్తుంది . ఆ విధంగానే కదా భవానీ మాత శివాజీకి తన కత్తినిచ్చి ఆశీర్వదించింది . జగజ్జనని కొలువై ఉన్న ఒక ఆలయం ఇప్పటికీ పాకిస్థాన్ సరిహద్దులో మన సైనికులకు రక్షగా ఉంది . ఈ ఆలయం పైన ఎన్ని బాంబులు వేసినా పేలని వైనం విచిత్రమై వైరి మూకలకి నిద్రలేకుండా చేస్తోంది . ఆ ఆలయాన్ని దర్శిద్దాం.
అమ్మ నామాలూ , రూపాలూ అనంతం . ప్రకృతిలోని ప్రతి శక్తి ఆ జగజ్జనని రూపమే కదా ! రాజస్థాన్లోని జై సల్మేర్ జిల్లాలో పాక్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న దేవాలయంలో అమ్మ శ్రీ తనోట్ మాత గా పూజలు అందుకుంటోంది. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పేరొందిన బలోచిస్తాన్లో వెలసిన హింగ్లాస్ మాత అవతారమే తనోట్ మాత అని చరణ్ సాహిత్యం తెలుపుతోంది.
ఈ ఆలయంపైన, ఈ ఆలయ పరిశరాల్లో విసిరిన ఒక్క బాంబు కూడా పేలిని ఉదంతం ఆశ్చర్య చకితులని చేస్తుంది . ఈ అమ్మవారి ఆలయాన్ని భారత రక్షణ దళాలు పర్యవేక్షిస్తూ ఉంటాయి. అయితే 1965 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధాలలో అమ్మవారి ప్రభావంతోటే పాక్ పై విజయం సాధించినట్లు స్థానికులు చెబుతారు. 1965లో జరిగిన యుద్ధంలో పాక్ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు భారీ బలగాలతో పెద్ద ప్రణాళిక వేసింది. ఆ సమయంలో ఆలయ సమీపంలో భారత్ కి చెందిన కొద్దిమంది సైనికులు మాత్రమే విధుల్లో ఉన్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న భారత సైనికులపై పాక్ ఏకంగా మూడు వేల బాంబులను ప్రయోగించింది. ఇన్ని బాంబులతో మన సైనికులమీద అరాచకంగా దాడికి తెగబడినా, ఒక్క బాంబు కూడా పేలక పోవడం అమ్మవారి అద్భుత శక్తికి నిదర్శనమని అక్కడి స్థానికులు విశ్వశిస్తుంటారు.
అప్పుడు అలా అమ్మవారి అనుగ్రహం వలన పన్నాగం పారకపోవడంతో పాక్ సైన్యం తోకముడిచింది. అప్పటి నుంచి తనోట్ మాత ఆలయానికి వేలాదిమంది సందర్శకులు వస్తున్నారు.
ఈ ఆలయాన్ని 13 శతాబ్దాల క్రితమే నిర్మించారని చెబుతారు. రాజపుత్ర వంశానికి చెందిన తనురావు ఈ ఆలయాన్ని నిర్మించారు ఇప్పటికీ ఆ వంశస్థులు ఆలయంలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. 1971 యుద్ధం అనంతరం ఆలయాన్ని సరిహద్దు భద్రత దళం నిర్వహణలోకి తీసుకుంది. ఆలయాన్ని మరింతగా విస్తరించడం జరిగింది. భారత విజయాలకు గుర్తుగా ఆలయ ప్రాంగణంలో ఒక విజయ స్తంభాన్ని కూడా నిర్మించారు. పాక్ పై విజయానికి గుర్తుగా ఏటా వేడుకలు నిర్వహిస్తారు.
ఆలయ ప్రాంగణంలో ఒక మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ పాకిస్థాన్ వారు ప్రయోగించి పేలని బాంబులతో పాటు, పలు ఆయుధాలను కూడా చూడవచ్చు.
ఎలా చేరుకోవాలి:
రాజస్థాన్లోని జైసల్మేరు జిల్లాలో పాక్ సరిహద్దుకు ఆనుకుని ఉంటుంది. ఈ ఆలయం లో దిగి 120 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడకు చేరుకోవాలి. జై సల్మాన్ నుంచి ఈ ఆలయాన్ని సందర్శించడానికి టాక్సీలు దొరుకుతాయి.