చికెన్ పాక్స్, మీజిల్స్ వ్యాధులనుండీ రక్షించే నూకాంబిక
చికెన్ పాక్స్, మీజిల్స్ వ్యాధులనుండీ రక్షించే నూకాంబిక !!
- లక్ష్మి రమణ
శ్రీ గురు దత్తాత్రేయుని శక్తి స్వరూపం శ్రీ అనఘామాత. అణిమాదిసిద్ధులకీ జన్మనిచ్చిన తల్లి . ఈమె స్వయంగా ఆదిలక్ష్మీ స్వరూపం . అష్టమినాడు అనఘాదేవిని అర్చించినవారింట సిరి సంపదలకు లోటుండదు. నవశక్తి స్వరూపాలలో అనఘాస్వరూపం కూడా ఒకటి . ఆవిడే నూకాంబికగా తెలుగు నేలమీద విరాజిల్లుతూ భక్తులని అనుగ్రహిస్తున్నారు . ఆ ఆలయదర్శనం చేద్దాం రండి .
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లిలో కొలువైన దేవత నూకాంబిక అమ్మవారు. నూకాంబిక మాతని పూర్వం అనఘాదేవిగా అర్చించేవారు . ఆవిడ పేరుమీదుగానే ఈ ప్రాంతానికి అనఘాపల్లి అనీ ఆతర్వాత అనకాపల్లి అనీ పేరువచ్చినట్టు చరిత్రకారులు చెబుతున్నారు .
కాకతీయుల కాలంలో ఈ ఆలయం అత్యంత వైభవంగా ఉండేదట. కాకతీదేవిగా ఇక్కడి అమ్మవారు పూజలందుకున్నారు . కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత, ఆలయ వైభవం కాస్త మసకబారింది . అయితే, ప్రస్తుతం ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో ఉంది. గోదావరి ప్రవహించే ప్రాంతం కావడంతో పచ్చదనంతో పరవశించే మధ్య అణిమాదిసిద్ధులని అనుగ్రహించే దివ్యమైన అమ్మ సన్నిధానం ఆధ్యాత్మిక వైభవంతో అలరారుతూ ఉంటుంది .
ఫాల్గుణ మాసంలో సృష్టి మొదలైందని, విశ్వాన్ని సృష్టించింది ఇక్కడ కొలువైన ఆ జగజ్జననే అని భక్తుల విశ్వాసం. అందుకని పవిత్రమైన ఫాల్గుణ బహుళ అమావాస్య నుండి పూజలు చేస్తూ ఉంటారు. దేశం నలుమూలలనుండే కాకుండా విదేశాలనుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు . వినాయక చవితి దేవీ నవరాత్రులలో మకర సంక్రాంతి రోజులలో కూడా ఈ ఆలయంలో నూకాంబికగా పూజందుకుంటున్న అనఘాదేవికి ప్రత్యేక పూజలు . ఈ ఆలయ ప్రాంగణంలోనే వంటలు చేసుకొని, ఆ వంటని అమ్మవారికి సమర్పించి ఆరగించడం స్థానికుల సంప్రదాయంగా ఉంది.
విశేషించి ఈ నూకాంబికని దర్శించుకుంటే, చికెన్ పాక్స్, మీజిల్స్ వంటి వ్యాధులు దరిచేరవని , వాటిని అమ్మవారు తగ్గిస్తుందని భక్తుల విశ్వాసం