మీసాల మొక్కు చెల్లిస్తే, సంతానాన్ని అనుగ్రహించే వీరభద్రుడు !!

సంక్రాంతి జాతరలో, మీసాల మొక్కు చెల్లిస్తే, సంతానాన్ని అనుగ్రహించే వీరభద్రుడు !!
లక్ష్మీ రమణ
దక్షయజ్ఞం , ఆ పరమేశ్వరుని రౌద్రం, ఆ రౌద్రం నుండీ ఉద్భవించిన రుద్రుని రూపం వీరభద్రుని వీరంగం ఒక గొప్ప శివలీల . ఆ రుద్రతాండవ స్వరూపమే వీరభద్ర స్వరూపం. కానీ కొలిచే భక్తుల పాలిటి మాత్రం ఈ స్వరూపం ఒక కల్పతరువు. కోరిన కోర్కెలు తీర్చే అనుగ్రహదాయకుడు వీరభద్రుడు. ఈ స్వామికి బండెనక బండికట్టి , సంక్రాంతికి చేసే పూజలు చూసి తీరాలి . పైగా గుబురు మీసాల స్వామికి, మీసాలు సమర్పిస్తామని మొక్కుకుంటే, అడిగిన కోరికలన్నీ తీరుస్తారట. సంతానాన్ని వరంగా ఇస్తారట . సంక్రాంతి కోలాహలం మధ్య దివ్యమైన కోలాహలంతో సందడిగా మారే ఆ వీరభద్ర క్షేత్రాన్ని దర్శిద్దాం పదండి .
వీరభద్రుడి ఆలయాలు మహా అరుదు. వాటిల్లో వీరశైవ సంస్కృతికి పేరెన్నికగన్నవి కాకతీయుల పరిపాలనలో విరాజిల్లిన ప్రాంతాలలోనే ఎక్కువగా ఉండడాన్ని గమనించవచ్చు. కాకతీయాల రాజధానిగా వెలుగొందిన వరంగల్ జిల్లా లోని భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామంలో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల వీరభద్ర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ మనం ఏదైనా కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఆలయంలో ఉన్న అర్చామూర్తి స్వయంభువుగా వెలిశారు. ఆయన వ్యక్తమైన విధానం కూడా విచిత్రంగానే ఉంటుంది . కొందరు కుమ్మరులు వంట చెరుకు కోసం కొండపైకి ఎడ్ల బండితో వెళ్లారు. వారు వంట చెరుకును తీసుకువచ్చి చూసేసరికి వారి ఎడ్లు కాస్త మాయమయ్యాయి. అప్పటికే చీకట్లు ముసురుకోవడంతో, వారందరూ ఆ రాత్రికి కొండపైనే సేద తీరారు. అలా నిదురిస్తున్న వారి కలలో వీరభద్రస్వామి కనిపించి తాను కొండపైన ఒక గుహలో కొలువై ఉన్నానని, తనని కిందకి తీసుకెళ్లి ఆలయం నిర్మించాలని చెప్పారు. ఇలా చేస్తే మీ ఎడ్లు మీకు తిరిగి దక్కుతాయని చెప్పి మాయమయ్యారు .
ఉదయాన్నే ఆ కుమ్మరులంతా కలిసి, కలలో స్వామీ చెప్పిన ప్రకారంగా వెతుకుతూ వెళ్ళి కొండపైన గుహలో ఉన్న వీరభద్రుణ్ణి ఇప్పుడు ఆలయమున చోటికి , కిందికి తీసుకువచ్చారు . అలా వచ్చే సమయంలోనే స్వామివారికి కాలుకూడా విరిగిందని చెబుతారు స్థానికులు . ఎంతో మహిమ గల ఈ స్వామివారికి సంతానం లేని వారు కోర మీసాలను సమర్పిస్తామని మొక్కుకుంటే, వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.
మీసాల వీరభద్రుడికి , ఎద్దులని మాయం చేశాడుకాబట్టి, కోడె దూడలని కానుకగా సమర్పిస్తారు . రాజరాజేశ్వరునికి కోడె మొక్కు చెల్లించిన విధంగానే, అపార శివావతారమైన వీరభద్రునికి కూడా ఈ ప్రాంతంలో కోడె మొక్కు చెల్లిస్తారు భక్తులు.
సంక్రాంతి సమయంలో ఈ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు . ఈ ఉత్సవాలలో మొదటి రోజు కుమ్మరులు పాల్గొని స్వామివారికి బోనాలు సమర్పిస్తారు. అంతే కాదు, బండెనక బండికట్టి , ఎడ్ల బండ్లతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు.
చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు సమర్పించుకుంటారు. ఇక ఈ ఉత్సవాల్లో నిప్పుల గుండాలు తొక్కడం వంటి వీర ఆచారాలూ పాటిస్తారు . ప్రసన్న భద్రకాళిగా దర్శనమిచ్చే అమ్మవారు ఇక్కడ చూడచక్కని ప్రశాంత వదనం తో దర్శనమిస్తూంటారు . ఈ బ్రహ్మోత్సవాల్లో వీరభద్రునికి, భద్రకాళికి వైభోగంగా కళ్యాణమహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. సంక్రాంతి మూడురోజులూ కూడా కన్నుల పండుగగా, అద్భుతం అనిపించేలా రంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు ఏటా నిర్వహిస్తారు .
వరంగల్ నుండీ ఇక్కడికి, బస్సులు అందుబాటులో ఉంటాయి . వరంగల్ కి అన్ని ప్రధాన కూడళ్ల నుండీ రైలు , బస్సు సౌకర్యం ఉంటుంది .
#meesalaveerabhadrudu
Tags: meesala veerabhadrudu, warangal