చిత్రగుప్తుని ఆరాధన
చిత్రగుప్తుని ఆరాధన
- లక్ష్మి రమణ
చిత్రగుప్తుడు యముని దగ్గర చిట్టాపద్దులు రాస్తుంటాడు . ఆయన లెక్కలేవేరు .అవన్నీ మనుషుల పాపపుణ్యాల కథలు . మన తెలుగు సినిమాల్లో యముడి వెంటతిరిగే చిత్రగుప్తుడు ఎప్పుడూ హాస్యపాత్రల్ని పోషిస్తూఉంటాడు . చాలామందికి ఒక దురభిప్రాయం, ఒకింత చిన్నచూపు చిత్రగుప్తుని మీద ఈ విధంగా ఏర్పడిందేమో , కానీ చిత్రగుప్తుడు ఆరాధనీయుడు . మహిమోపేతుడు, బ్రహ్మ పుత్రుడు. ఆయనకీ హిందూదేశంలో విశేషమైన పూజలు, నోములు ప్రత్యేకించి ఆలయాలూ ఉన్నాయి .
ఎవరీ చిత్రగుప్తుడు :
చిత్ర గుప్తుడు అంటే చిత్రంగా మనలోనే దాగినవాడు . మనలోనే రహస్యంగా దాగిఉండి నిత్యం పాప పుణ్యాలని లెక్కించేవాడు . ఈయన ఉత్పత్తికి సంబంధించిన కథ కూడా ఇదే చెబుతుంది . యమధర్మరాజు కాలంతీరిన జీవుల లెక్కలు సరిగా వేయలేక ఒక్కొక్కసారి స్వర్గానికి వెళ్ళవలసిన వారిని నరకానికి , నరకానికి వెళ్ళవలసిన వారిని స్వర్గానికి పంపిస్తూ తికమకపడిపోతూ వుండేవారట ! బ్రహ్మదేవుడు ఈ అవకతవకలేమిటి ? అని యముణ్ణి ప్రశ్నిస్తారు . అప్పుడు ఒక్కొక్క ప్రాణీ ఎత్తే 83 జన్మల్లో, కర్మఫలాలని లెక్కించడం తన తరం కావడంలేదని, అందుకు పరిష్కారం చూపమని యముడు బ్రహ్మదేముణ్ణి వేడుకుంటారు . అప్పుడు బ్రహ్మగారు కొన్నివేల సంవత్సరాలపాటు తపస్సుచేశారు . అలా ఆయన తపోఫలితంగా ఆయన నుండీ ఒక స్వరూపం ఉద్భవించింది. ఆయన పుడుతూనే, కాగితం , కలం పట్టుకొని ఉద్భవించారు . అలా చిత్రంగా బ్రహ్మలోనే గుప్తుడై (దాగిఉండి) ఉండి ఉద్భవించిన మూర్తి కనుక ఆయన చిత్రగుప్తుడుగా పిలువబడ్డారు .
చిత్రగుప్తుని పూజ :
వేదాలలో కూడా చిత్రగుప్తుడి గూర్చి ఉంది. ఉత్తర భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో పెన్ను, పేపరు, ఇంక్, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చెక్కెర, గంధం చెక్క, ఆవాలు, నువ్వులు, తమలపాకులు ఉంటాయి. దక్షిణ భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో ఎద్దు తొక్కని వడ్లు, ఎర్ర గుమ్మడి పండు, కట్లు లేని గంప మొదలైన విశేష ద్రవ్యాలు ఉంటాయి. న్యాయం, శాంతి, అక్షరరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు పొందడానికి చిత్ర గుప్తుని ఆరాధన విశేషంగా చెప్పబడింది. వాటిని ప్రతిబింబించే ద్రవ్యాలే ఆయన పూజా సామాగ్రిలోనూ ఉంటాయి.
చిత్రగుప్తుని వ్రతము:
గుప్తంగా మనలోనే ఉంటూ చిత్రంగా మన పాపపుణ్యాలను లిఖించేది అంటే , అది మన మనస్సు. మన మనసే చిత్రగుప్తుడు. ఎన్ని వ్రతములు చేసినా చిత్రగుప్త వ్రతమును తప్పక చేయాలి అని చెబుతారు. అలా చేయకపోతే పుణ్యఫలం లభించదని అంటారు . దీని అర్థం ఏంటంటే, ఎన్ని పుణ్యకర్మలను చేసినప్పటికీ మనోనియమము లోపించడం . మనోనియమము లేకపోవడం చేత అవి అవన్నీ కూడా వృధా అయినట్టే కదా . కనుక చిత్రగుప్తుని వ్రతమును చేయడం వలన మనోనిశ్చలత చేకూరి సర్వకర్మలను పరిపూర్ణము చేసే శక్తి కలుగుతుందని పెద్దల మాట. చిత్రగుప్తుని ఆరాధనలో మరో విశేషం ఉంది . ఆయన్ని ఆరాధించిన వారికి కర్మానుసారంగా వచ్చేటటువంటి ఈతి బాధల నుండీ ఉపశమనం లభిస్తుంది . దర్శనమాత్రం చేత అనంత ఫలితాలనీ చిత్రగుప్తుడు అందిస్తారు . చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య సూర్యదక్షిణ నందిని. రెండో భార్య పార్వతీ శోభావతి. వీరిద్దరితో కలిపి ఆయనని ఆరాధించడం మరింత ఫలప్రదం .
చిత్రగుప్తుని ఆలయాలు :
కాంచీపురంలో ప్రసిద్ధ ఉలగనంద పెరుమాళ్ (వామన మూర్తి) దేవాలయం ప్రక్కన చిత్రగుప్తుని దేవాలయం వుంది.
హైదరాబాద్ ఉప్పుగూడ (Huppuguda) రైల్వే స్టేషన్ నుండి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఒక చిత్రగుప్త దేవాలయం వుంది.
మధ్యప్రదేశ్ లోని ఖజరహో నగరంలో చిత్రగుప్తునికి చాలా పెద్ద గుడే వుంది.
మధ్యప్రదేశ్ లోని, ఉజ్జయినీ నగరం, న్యాసంక్ పథ్లో చిత్రగుప్తునికి ఒక దేవాలయం వుంది.
బీహార్ లోని పాట్నాలో ఒక చిత్రగుప్త దేవాలయం వుంది.
ఇంకా ఢిల్లీలోను, ఢిల్లీకి సమీపంలోనూ సుమారు 15 చిత్రగుప్తుని దేవాలయాలు వున్నాయి. ఇంకా ఉత్తరప్రదేశ్ (అయోధ్య, గోరఖ్ పూర్, సుల్తాన్ పూర్, ఛాతర్ పూర్), హర్యానా, రాజస్థాన్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలలో కూడా చిత్రగుప్తుని దేవాలయాలు ఉన్నాయి .
#chitragupta #yama
Tags: Chitragupta, Yama, chitragupta vratam, vratham, vratam