చిన్నారులని జీవిత పర్యంతం రక్షించే అమ్మ!
చిన్నారులని జీవిత పర్యంతం రక్షించే అమ్మ! విచిత్రమైన ఆవిడ నైవేద్యాలు !!
లక్ష్మీ రమణ
సాధారణంగా ప్రసాదం అనగానే, వేడివేడి చక్రపొంగలి, దద్ధోజనం , పులిహోర , లడ్డూలు గుర్తొస్తాయి . కానీ బెంగాల్ రాష్ట్రంలో ఒక కాళికామాతకి నూడిల్స్ నైవేద్యంగా సమర్పించి ఆరాధిస్తుంటారు. ఇక్కడి దేవి చాప్ సూయ్ వంటి చైనీస్ వంటల్నీ రుచిచూస్తుంటుంది . అలాగే, గుజరాత్ లోని మరో దేవతకి పానీపూరీలు , పిజ్జా , బర్గర్లూ నివేదనగా సమర్పిస్తారట ! వింటుంటేనే నోరూరిపోతుంది కదా ! ఈ నైవేద్యాలు స్వీకరించే దేవత కూడా చాలా మహిమాన్వితమైన దేవి. తల్లిదండ్రుల పూజలు స్వీకరించి పిల్లల్ని సదా రక్షిస్తూ ఉంటుంది .
గుజరాత్‌లోని రాజ్ కోట్‌లో కొలువైన జీవంతికా అమ్మవారికి పిజ్జా, బర్గర్, పానీ పూరీ, శాండ్‌విచ్, చాక్లెట్స్, బిస్కెట్స్, క్రీమ్‌రోల్, కూల్‌డ్రింక్ వంటివి నైవేద్యంగా పెడతారు. వాటినే భక్తులకు ప్రసాదాలుగా పంచుతారు. దీంతో జీవంతికా అమ్మవారి దేవాలయం అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. ఎందుకుంటే అక్కడ వారికి ఇష్టమైన ప్రసాదాలుగా పెడతారు కాబట్టి.
రాజ్‌పూత్‌పర్‌లో కొలువైన జీవంతికా అమ్మవారి దేవాలయానికి 51 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాన్ని అబేలాల్ దబే అనే వ్యక్తి తన రెక్కల కష్టంతో నిర్మించాడు. స్కాంద పురాణంలో ఈ అమ్మవారి గురించి తెలుసుకొని ఈ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించినట్టు గా చెబుతారు స్థానికులు . జీవంతికాదేవి కథని భక్తులు ఇలా వివరిస్తారు .
శుషీల్ షింగ్ , సుకేషిబ అనే దంపతులకి సంతానం లేదు . దాంతో రాణీగారు ఒక మంత్రసాని సాయం తీసుకొని సుందర్ బెన్ అనే గర్భవతి ప్రసవించగానే, ఆ బిడ్డని తనకి అప్పజెప్పాలని చెబుతుంది . సుందరబెన్ నిజానికి ఒక మాంసపు ఖండానికి మాత్రమే జన్మనిచ్చినా , ఆమె గతంలో చేసిన శ్రావణ శుక్రవారపు జీవంతికా వ్రతం వలన ఆ బిడ్డ పరిపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు . అప్పుడు రాణీగారు ఆ బిడ్డని తస్కరించి ప్రియావ్రత్ సింగ్ అనే పేరిట పెంచి పెద్ద చేస్తుంది .
అతను రాజయిన తర్వాత ఒక సంప్రదాయ వేడుక సందర్భంగా, ఒకరి ఇంట్లో ఆతిధ్యం స్వీకరిస్తారు ఆ రాజకుమారుడు. అక్కడ తనని నిరంతరం కావలి కాస్తున్న జీవన్తికా దేవిని దర్శనం చేసుకుంటాడు. ఆమె చిన్నారులకి ఎటువంటి ఆపదలో వాటిల్లకుండా రక్షిస్తుందని, తల్లిదండ్రులు చేసిన పూజల ఫలం బలం వాళ్ళ జీవితపర్యంతమూ ఆమె రక్షణగా, ఇంతా బయటా కూడా వారి వెంటే ఉంది కాపాడుతుందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు . ఇలా తనకి అమ్మ రక్షణ లభించడానికి తన తల్లి చేసిన శ్రావణ శుక్రవారపు జీవంతికా వ్రతం కారణమని అర్థం చేసుకొంటారు . ఆతర్వాత తన తల్లిని, ఆమె ఆ వ్రతం చేసిందా ? అని అడుగుతారు . ఆమెకి దానిగురించి తెలీదని తెలుసుకొని , తన అసలైన తల్లికోసం అన్వేషించి ఆమెని చేరుకుంటారు . ఇదీ కథ .
ఆవిధంగా జీవంతికా దేవి జీవితకాల పర్యంతమూ కూడా బిడ్డలని రక్షిస్తూనే ఉంటుందని రాజస్థానీలు నమ్ముతారు . అందుకే ఈ దేవిని దర్శించేందుకు అధఃహిక సంఖ్యలో వస్తూ ఉంటారు. మనం శ్రావణమాసంలో లక్ష్మీ దేవి వ్రతాన్ని ఆచరించినట్టు , వీళ్ళు జీవంతికా వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు .
ఈ దేవాలయంలో ప్రత్యేకంగా పూజారి ఎవరూ ఉండరు. ఎవరు పట్టికెళ్లిన నైవేద్యాలను అమ్మవారికి వారే స్వయంగా నివేదన చేయవచ్చు. అంతేకాదు జీవంతికా అమ్మవారి దేవాలయం సామాజిక కార్యక్రమాలకు స్థానికులు వినియోగిస్తుంటారు. అంతేకాదు ఈ ఆలయంలో హుండీలు కూడా ఉండవు. అయితే ఈ ఆలయంలో ఆహార పదార్థాలను తయారు చేసి స్కూల్ లోని చిన్నారులకు పంచుతుంటారు.
భక్తులు ఈ అమ్మవారికి విదేశాల నుంచి కూడా అమ్మవారికి ప్రసాదంగా పెట్టటానికి ప్యాకెట్ల ద్వారా పిజ్జా, బర్గర్, శాండ్‌విచ్, చాక్లెట్స్, బిస్కెట్స్ పంపిస్తుంటారు. స్థానికులు..వ్యాపారులు జీవంతికా అమ్మవారికి ప్రతీ రోజూ పూజలు చేస్తుంటారు.