విషహారిణి మనసాదేవి

విషహారిణి మనసాదేవిని దర్శిద్దాం పదండి !
లక్ష్మీ రమణ
నాగులకి మాత , వాసుకి చెల్లెలు మనసాదేవి . స్వయంగా శక్తి స్వరూపిణి. శివుని శిష్యురాలు . ఈమె అనుగ్రహం వల్లన సంతానం కలుగుతుంది. సకలరకాలైన కాలకూట విషయాలు సైతం హరిస్తాయి. ఆరోగ్యం, సంసారంలో అన్యోన్యత సిద్ధిస్తుంది . ఈ అమ్మవారు వెలసిన ఆలయాలు చాలా తక్కువగానే ఉన్నాయి . అటువంటి అద్భుతమైన ఆలయాన్ని ఈరోజు మనం దర్శించుకుందాం .
ఋగ్వేదంలోని సర్పసూక్తములు , యజుర్వేదములోని సర్ప మంత్రముల ద్వారా సర్పదేవతా ఉపాసన చెప్పబడుతోంది . దేవీభాగవతం మనసాదేవిని, దేవి ప్రధానాంశా స్వరూపాలలో ఒకరిగా పేర్కొంటోంది . కశ్యప ప్రజాపతి కూతురైన ఈమె , ఈశ్వరునికి ప్రియ శిష్యురాలు . ‘మనసా కశ్యపాత్మజా’ అని చెప్పే మానసాదేవి ప్రకృతిలో వెలసిన మూడవ ప్రధానాంశ స్వరూపం. ఈమె కశ్యప ప్రజాపతి మానస పుత్రిక.
పడగెత్తిన పామును వాహనంగా చేసుకున్నందుకు నాగ గణమంతా ఆమెను సేవిస్తుంటారు. ఈమె యోగిని. యోగులకి సిద్ధిని ప్రసాదించే దేవి . తపఃస్వరూపిణి. తపస్విలకు తపఃఫలాన్నిచ్చే తల్లిగానూ మానసాదేవిని ఆరాధిస్తారు.
పూర్వం భూమ్మీద మనుషుల కంటే అధికంగా పాములు ఉండేవట. అవి విచ్చలవిడిగా సంచరిస్తూ మానవాళిని భయభ్రాంతులకు గురిచేస్తుంటే కశ్యపముని తన మనసు నుంచి ఈ ఆది దేవతను సృష్టించాడు. ఈమె సర్పాలకు అధినేత్రి. మహాయోగేశ్వరి. అలా ఈ దేవి హరిద్వార్ సమీపంలో నిలిచి పూజందుకుంటోంది .
ఉత్తారాఖండ్ లోని హరిద్వార్ సమీపంలో ఉంది మానసాదేవి ఆలయం. ఇది ప్రాచీనమైన దేవాలయలలో ఒకటిగా ప్రసిద్ధిని పొందింది . హరిద్వార్ వెళ్ళే భక్తులు తప్పనిసరిగా మానసా దేవి ఆలయాన్ని సందర్శిస్తారు. హరిద్వార్ లో ఉన్న మూడు శక్తి పీఠాలలో మానసదేవి ఆలయం కూడా ఉంది. కోరిన కోర్కెలు తీర్చే దేవతగా భక్తులు మానసా దేవిని కొలుస్తారు. అదిష్టాన దేవతగా, శక్తి స్వరూపిణిగా ఈ అమ్మవారు పూజలందుకుంటుంది.
హిమాలయాలకు దక్షిణ భాగంలో ఉండే శివాలిక్ పర్వత శ్రేణిలోని బిల్వ పర్వతంపై మానసాదేవి కొలువై ఉంది. హరిద్వార్ ప్రాంతంలో ఉన్న అధ్యాత్మిక ఆలయాల్లో విశిష్టమైన ఆలయంగా మానస దేవి ఆలయాన్ని చెప్పవచ్చు. మానస అనగా కోర్కెలు నెరవేర్చే దేవత అని అర్ధం. ఈ దేవాలయంలోని వృక్షాలకు దారాలను కట్టి తమ కోర్కెలు నెరవేర్చమని భక్తులు మానసా దేవిని వేడుకుంటారు. కోరుకున్న కోర్కెలు నెరవేరిన భక్తులు తిరిగి ఆలయ సందర్శన చేసి చెట్టుకొమ్మలకు దారాలు కట్టి మొక్కులు చెల్లించుకుంటారు.
పార్వతీ దేవి రూపాలైన మానస, చండీ ఇద్దరూ ఎల్లప్పుడూ కలసి ఉండేవారని భక్తులు విశ్వసిస్తుంటారు. ఎత్తైన శిఖరంపై ఉన్న ఈ ఆలయానికి వెళ్ళాలంటే మెట్ల మార్గంతో పాటు రోప్ వే కూడా భక్తులకు అందుబాటులో ఉంది. ఈ దేవాలయం శిఖర భాగం నుండి చూస్తే కనుచూపులో గంగానది, హరిద్వార్ లు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు తెరిచి ఉంచుతారు.