దొంగతనం చేస్తేనే ఫలితం !
ఇది అమ్మతనాన్ని అనుగ్రహించే బొమ్మ ! కానీ దొంగతనం చేస్తేనే ఫలితం !
లక్ష్మీ రమణ
మన ఇళ్ళల్లో పెళ్లయినప్పుడు వధువుని కాపురానికి పంపించేప్పుడు సారెతో సహా చిన్న చిన్న బొమ్మలు పంచిపెడతారు. దీన్ని బొమ్మసారే అంటారు. అలాగే పిల్లు పుట్టునప్పుడుకూడా కొందరు చిన్నారి బొమ్మలు పంచడాన్ని ఆచారంగా పాటిస్తుంటారు. ఇలా సారెతోపాటు పంచిన బొమ్మలు అందుకున్నవారికి పిల్లలు పుడతారని విశ్వాసం ఉంది. కానీ ఈ ఆలయంలో మాత్రం ఒక బొమ్మని దొంగతనం చేస్తే, పిల్లలు పుడతారట . ఆ కథేమిటో తెలుసుకుందాం పదండి .
గుడికి వెళ్లి దొంగతనం చేయాలని ఎవరూ అనుకోరు. కానీ ఈ గుడికి మాత్రం దొంగతనం చేయడానికే వెళ్లాలి. దొంగతనం చేస్తేనే అక్కడున్న అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. ఇంతకీ ఆ గుడి ఎక్కడుంది ? ఈ ఆచారం ఎలా వచ్చింది? అనుకుంటున్నారా! ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లాలోని చేడియాల అనే గ్రామంలో చూడామణి ఆలయం ఉంది. పిల్లలు లేని వాళ్లు ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. నమ్మకం మాత్రమే కాదు, అలా జరిగిన సంఘటనలూ ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ ఆలయానికి సంతాన ఆలయం అని పేరు .
ఇంతకీ ఇక్కడ దొంగతనం చేయాల్సింది ఒక చెక్కబొమ్మని. ఆబొమ్మ చూడామణి అమ్మవారి పాదాలదగ్గర ఉంటుంది. అక్కడున్న పూజారి, దంపతులు ఇలా దొంగతనం చేసేందుకు దగ్గరుండి ప్రోత్సహిస్తారు కూడా! ఇలా దొంగతనము చేసిన బొమ్మని తీసుకెళ్లిన భక్తులు , సంతానవంతులయ్యాక, ఆ బొమ్మతోపాటు, మరో కొత్తబొమ్మని ఈ అమ్మవారిపాదాల దగ్గర అర్పించాల్సి ఉంటుంది. వింతగా ఉంది కదా ఈ ఆచారం .
ఈ సంప్రదాయం కొనసాగడం వెనుక ఒక స్థానిక కథ ఉంది . లాందౌరా రాజు ఒకరోజు అడవిలో వేటాడుతూ చూడామణి ఆలయం దగ్గరికి వస్తారు. అక్కడో తెజోప్రకాశ స్వరూపంగా వెలుగొందుతున్న దేవతని చూసి, భక్తితో నమస్కరించి, తనకో బిడ్డను ప్రసాదించమని వేడుకుంటాడు. వెంటనే అమ్మవారు మాయమై, చిన్న చెక్క బొమ్మ రూపంలో దర్శనమిస్తుంది. రాజు ఆ చెక్క బొమ్మను తన వెంట తీసుకొని రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ దేవి అనుగ్రహ ప్రభావంతో ఆయనకీ ఒక పండంటి మగపిల్లాడు పుడతాడు . ఆ తర్వాత రాజుగారు అమ్మవారి చెక్కమూర్తితోపాటుగా మరో కొత్త బొమ్మని తీసుకొచ్చి ఈ ఆలయంలో పెట్టారని చెబుతారు. అప్పటినుండీ ఈ సంప్రదాయం అలా కొనసాగుతోందని భక్తుల విశ్వాసం .
ఆలయానికి ఇలా వెళ్లొచ్చు :
చూడియాలా లో రైల్వే స్టేషన్ ఉంది. స్టేషన్ బయట దిగి ఆటో రిక్షాల లో ఆలయానికి చేరుకోవచ్చు. చూడియాలా సమీపంలో ఉన్న మరో రైల్వే స్టేషన్ రూర్కీ రైల్వే స్టేషన్(19 KM). దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి. అంతే కాకుండా హరిద్వార్, డెహరాడూన్, రుషికేశ్, చండీఘర్, మీరట్, ముజాఫర్ నగర్, అంబాలా, ఢిల్లీ ల నుండి మరియు రూర్కీ నుండి రాష్ట్ర సర్వీసు బస్సులు ఉంటాయి.