Online Puja Services

సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరిచే ఆలయం,

18.188.91.223

సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తెరిచే ఆలయం, దర్శనం లభిస్తే , సర్పదోషాలు మాయం ! 
లక్ష్మీ రమణ 

నాగ జాతిని ఆరాధించడం మనకి ఈనాటి సంస్కృతికాదు. ఆదిశేషుడు, వాసుకి, సుబ్రహ్మణ్యుడు, మనసాదేవి, ఎల్లమ్మ తల్లి ఇలా మనకి నాగరూపంలో పూజందుకునే దేవతలది పెద్దజాబితానే. ఇక ఈ పూజలని పక్కనపెట్టి కాస్త యోగమార్గంలోకి తొంగిచూశామా , సర్పాలతోటి మనిషికి విడదీయరాని ఆల్కెమీ ఏదో పొట్టపోసుకొని మనముందర నిలబడ్డట్టే ఉంటుంది . కానీ, ఇప్పుడు చెప్పబోయే ఆలయంలోని వైచిత్రి నిజంగా అద్భుతమే. దర్శనం దొరికిందా, ఇక సర్పదోషమన్నది జాతకం నుండీ తొలగిపోయినట్టే! 

యోగమార్గంలో ఇదా, పింగళ నుండీ కుండలిని వరకూ అన్ని నాడులూ, శక్తులూ సర్ప సదృశాలేకదా ! ఆ యోగములో నిరంతరం రమించేవాడు శివుడు. అందుకే కాబోలు, శిగకి రబ్బరుబ్యాండు లాగా, చెవులకి కుండలాలలాగా , మెడలో హారాలుగా, కాలికి కంకణాలుగా ఆ నాగులే  నిలువెల్లా ధరించి ఉంటాడా సర్వేశ్వరుడు . ఇక అటువంటి నాగపాశములని ధరించిన కాలుడు ఉజ్జయినీ మహాకాళుడు .  ఈ ఉజ్జయని క్షేత్రంలోనే నాగ‌చంద్రేశ్వ‌రునిగా కొలువై భక్తులని అనుగ్రహిస్తున్నారు . 

ఉజ్జ‌యినిలోని మ‌హాకాల్ మందిరంలోని మూడో అంత‌స్థులో నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం­ ఉంది. ఈ ఆలయం సంవ‌త్స‌రంలో ఒక‌రోజు మాత్ర‌మే, అది కూడా శ్రావ‌ణ శుక్ల పంచ‌మి రోజు మాత్ర‌మే తెరిచి ఉంటుంది. ఆరోజు మాత్ర‌మే భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. ఆల‌యం తెరిచి ఉండే ఈ ఒక్క‌రోజున స‌ర్ప‌రాజుగా భావించే త‌క్ష‌కుడు ఆల‌యంలోనే ఉంటాడ‌ట‌. 

ఈ తక్షకుడు జనమేజయుని యజ్ఞం తర్వాత, మళ్ళి తనకి అటువంటి సంకటం ఎదురవుతుందనుకున్నాడేమో మరి , ఇక్కడి శివయ్యని గురించి తపస్సు చేశారట . అందుకు సంతసించి ప్ర‌స‌న్న‌మైన శివుడు త‌క్ష‌కుడికి అమ‌ర‌త్వాన్ని ప్ర‌సాదించారట‌. ఇక అప్పటి నుంచి త‌క్ష‌కుడు శివుడు సాన్నిధ్యంలోనే ఉండిపోయాడ‌ని చెబుతారు. ఇదీ  స్థానిక ఐతిహ్యం. 

ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. దానికన్నా చెప్పుకోదగిన విశిష్ఠత ఏంటంటే, ఇక్కడ పరమేశ్వరుడు ప‌డ‌గ విప్పి ఉన్న సర్పాన్ని ఆస‌నంగా చేసుకొని శయనించి  ఉన్న భంగిమలో , పార్వతీదేవి , వినాయకునితో కలిసి దర్శనమిస్తారు . సాధార‌ణంగా అయితే స‌ర్పంపైన విష్ణు భ‌గ‌వానుడు మాత్ర‌మే శ‌యనిస్తాడు. కానీ ప‌ర‌మ‌శివుడు శయ‌నించిన కథలు ఎప్పుడూ విన‌లేదు. ప్ర‌పంచంలో ఎక్కడా లేని విధంగా ఉజ్జ‌యినిలోని, ఈ నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో భోళాశంకరుడు శ‌య‌నించి ఉండ‌డం విశేషం.

నాగ‌చంద్రేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఉన్న ఈశ్వరుని ఈ ప్రతిమ 11 వ శతాబ్దానికి చెందిన దిగా చెబుతారు .ఈ ప్ర‌తిమ‌ను నేపాల్ నుంచి తెప్పించార‌ని స్థానికులు అంటారు . ఉజ్జ‌యినిలో త‌ప్ప ఇలాంటి ప్ర‌తిమ ప్ర‌పంచంలో మ‌రెక్క‌డా కనిపించదు .1050 లో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఆయ‌న త‌ర్వాత సింధియా వంశానికి చెందిన రాణోజీ మ‌హ‌రాజ్ 1732 లో ఆల‌య జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టాడు. 

ఈ ఆల‌యాన్ని ఒక్క‌సారి ద‌ర్శించుకుంటే చాలు స‌ర్ప‌దోషాల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. అందుకే నాగ‌పంచ‌మి రోజు ఆల‌యానికి భ‌క్తులు పోటెత్తుతారు. నాగ‌చంద్రేశ్వ‌రుడి ద‌ర్శించుకొని పునీతుల‌వుతారు. ఈ ఒక్క‌రోజే దాదాపు రెండు ల‌క్ష‌ల మంది భ‌క్తులు వస్తారట. 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore