గబ్బిలాలు, చుంచెలుకలు, తేళ్లు, దోమలకీ గుడులున్నాయి
గబ్బిలాలు, చుంచెలుకలు, తేళ్లు, దోమలకీ గుడులున్నాయి ! కాబట్టి జాగ్రత్త !!
-లక్ష్మీ రమణ
అగ్గిపుల్లా , సబ్బుబిళ్ళా కావేవీ కవితకనర్హం అన్నట్టు , భారతీయ భక్తి తత్త్వం కూడా పరిధులు లేనిది . అయినా మనం ప్రతి జీవిలోనూ పరమాత్మని దర్శించే సంస్కృతిని కలవారము కదా ! అని మీకో చిన్న డౌట్ అనుమానం రావొచ్చు . కాదన్నవారెవరు ? కానీ మనసు అనేది ఒకటుంటుంది కదా , దానికి తోచిన నాలుగుమాటలూ అనకుండా ఊరుకుంటుందా ఏమిటి ? గబ్బిలాలు , చుంచెలుకలు, తేళ్లు , దోమలకి గుడులు కట్టారనీ వాటిని దేవతలుగా పూజలు చేసి నీరాజనాలిస్తారనీ తెలిస్తే, కొంచెం పిచ్చితో కూడిన అనుమానం లాంటి ఆశ్చర్యం ఖచ్చితంగా కలుగుతుందనేది నా అనుమానం. వీటి కథా కమామీషు తెలుసుకుందాం పదండి .
కొండమయి దేవత ఆలయం:
తెలు విషప్రాణి అని తిట్టేరు ! పసుపు, కుంకుమలు వెంటతీసుకువెళ్ళి పూజించాలని తెలుసుకోండి ! తెలంగాణ – కర్ణాటక సరిహద్దులో, మహబూబ్ నగర్, నారాయణపేట దగ్గరలో ఉన్న కందుకూరు గ్రామంలో ఒక కొండపైన కొండమయి దేవత ఆలయం ఉంది. ఇక్కడి గ్రామస్థులు తేళ్ళని దేవతగా భావిస్తూ కొండమయి దేవత గా కొలుస్తారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం ఇక్కడ నాగుల పంచమి రోజున ఈ ఆలయంలో తేళ్ల ఉత్సవం జరుగుతుంది. ఆశ్చర్యంగా ఈ ఉత్సవం అప్పుడు విషపూరితమైన తేళ్ళని భక్తులు చేతులతో పట్టుకున్నప్పటికీ ఎవరికీ ఎలాంటి హాని అనేది జరగదు.
దోమకు గుడి:
హైదరాబాద్ పరిసరప్రాంతంలో దోమకి నిర్మించిన గుడి ఉంది . ఈ ఆలయాన్ని ఓ డాక్టర్ నిర్మించడం విశేషం . దోమ కాటు వల్ల వచ్చే వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహాన కల్లించాలనే సదుద్దేశ్యంతో ఎం. సతీశ్ రెడ్డి అనే వైద్యుడు దోమకి ఆలయానికి కట్టారు. 2008లో నిర్మించిన ఈ ఆలయం ద్వారానైనా ప్రజలకి దోమకాటు నుండీ రక్షించుకోవాలని తలంపు కలుగుతుందని ఆయన ఆశ . వాళ్ళ పూజలవల్ల దోమలు కుట్టకుండా , తద్వారా మనకి వ్యాధులు సంక్రమించకుండా ఉండాలని ఆ దోమదేవుణ్ణి ప్రార్ధిద్దాం .
గబ్బిలం గుడి గురించి తెలుకోండి :
కరోనా గబ్బిలం వల్లే వ్యాప్తిని పొందింది అని మీకు తెలిస్తే, జ్ఞానోదయం కలిగిందని మిన్నకుండండి . అంతేగానీ బీహారీబాబుల దగ్గరమాత్రం మీకు తెలుసును కదా అని అట్టే ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయకండి . ఎందుకంటె, వాళ్ళు గబ్బిలాలకి గుడికట్టిమరీ , ఆరాధిస్తుంటారు . బిహార్ లోని వైశాలీ జిల్లాలోని ఈ గుడి ఉంది. ఈ ప్రాంతం పాట్నా, ముజఫర్ పుర్ కు మధ్యలో ఉంటుంది. గబ్బిళాలు ఎలాంటి హానికారకాలు కావని అక్కడున్న స్థానికులు గట్టిగా విశ్వసిస్తుంటారు. గబ్బిళాలకు ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ ఆక్కుడున్న గ్రామస్థులు గబ్బిళాల వల్లే తామంత సురక్షితంగా ఉన్నామని బలంగా నమ్ముతుంటారు . కాబట్టి తస్మాత్ జాగ్రత్త !!
చుంచెలుక గుడి :
ఎలుకలకు ముందుపెట్టి , అట్టలు పెట్టి వాటి అంటూ చూడాలనే కసి మనసులో ఉంటె, దయచేసి మర్చిపోండి . ఎందుకంటె, అవి ఇక్కడ దేవుడితో సమానం మరి . అసలే , వినాయకుడికి వాహనం అనే దర్జాని పొందిన ఎలకకి గుడి ఉండడంలో విచిత్రమేముంది అనుకునేరు , ఇక్కడున్నది అమ్మ ఎలుక మరి . ఈ ఎలుక చుంచుఎలుకలన్నింటికీ అమ్మట !ఈ ఆలయం రాజస్థాన్ లోని బికనీర్ లో ఉంది . కార్నీమాట దేవాలయంగా పిలుస్తారు . ఈ దేవాలయానికి వచ్చే భక్తులు చుంచెలకకు పూజలు చేయాలని ఉద్దేశ్యంతో దీన్ని నిర్మించారు. అంతేకాకుండా అక్కడకొచ్చే భక్తులు చుంచెలకలను దేవుడులా భావించి బహుమతులు కూడా అందజేస్తుంటారు. ఇక్కడున్న ఎలుకలన్నింటికీ, పూజలందుకుంటున్న చుంచెలుక తల్లి వంటిదని అక్కడ నమ్ముతారు.
మనకి ఈగ సినిమాలో హీరో అవ్వగా లేనిది , గబ్బిలాలు, చుంచులు దేవుళ్ళు కాకూడదా ఏంటి అని సామాన్యులైన మనలాంటి వారికి అనిపించడంతో ఆశ్చర్యం ఏమీ లేదు అయినప్పటికి కూడా ఒక్కసారి అణువూ అణువున నిండిన దేవా పాట ఏదో చానెల్లో వినిపిస్తోంది . ఆస్వాదిద్దాం . అంతే !