Online Puja Services

కోరిన వరాలిచ్చే వైష్ణోదేవి

3.144.210.92

కోరిన వరాలిచ్చే వైష్ణోదేవి 
కూర్పు , లక్ష్మీ రమణ 

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు ఏవిధంగా భక్తులు పోటెత్తుతారో , ఈ శక్తి క్షేత్రాన్ని దర్శించేందుకు కూడా భక్తులు అలాగే బారులు తీరతారు . పరవశింపజేసే ప్రక్రుతి , కురిసే తెల్లని మంచు , పలికే చల్లని తల్లి సన్నిధి కాశ్మీర్ లోని  వైష్ణోదేవి  ఆలయం. శక్తి పీఠం అయిన ఈ దేవి ఆలయాన్ని ఇవాళ దర్శిద్దాం . 

 హిందువులు వైష్ణోదేవినే ‘మాతా రాణి’ అని, ‘వైష్ణవి’ అని సంభోదిస్తారు. ఈ ఆలయం ఉత్తర భారత్ లోని జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతంలోని త్రికూట పర్వత శేణిలో ఉంది. జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న ఈ అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది, ఇదమిత్థంగా చెప్పలేం. కానీ పిండీలు అని పిలవబడే మూడు మూర్తులు కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. త్రికూట పర్వతంగా ఋగ్వేదంలో చెప్పబడిన పర్వతసమూహం ఇదేనని కొందరి వాదన. ఋగ్వేదంలో ఇక్కడ శక్తి ఆరాధన జరుగుతుండేదని చెప్పబడింది. 

ఇతిహాసాలలో వైష్ణో దేవి గురించిన మొదటి ప్రస్తావన మహాభారతంలో ఉంది. కురుపాండవ సంగ్రామానికి  ముందు శ్రీకృష్ణుని ఆదేశానుసారం అర్జునుడు ఇక్కడ అమ్మవారిని పూజించి, ఆమె దీవెనలు తీసుకున్నాడని వ్యాసభారతం చెపుతోంది. "జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే" అనే శ్లోకం ఆధారంతో ఈ దేవస్థానంలోనే అర్జునుడు పూజలు చేసాడని తెలుస్తుంది.

స్థలపురాణం ప్రకారం, పాండవులు మొదటగా ఇక్కడ దేవాలయ నిర్మించారని తెలుస్తుంది. త్రికూటపర్వతానికి పక్కన ఐదు రాతి కట్టడాలున్నాయి. వీటిని పంచ పాండవులకు ప్రతీకగా స్థానిక ప్రజలు భావిస్తారు.

వైష్ణోదేవి వెళ్ళి వచ్చినవారు వుంటారుగానీ, ఆమె  కధను పూర్తిగా తెలుసుకున్నవారు తక్కువమందే వుండవచ్చు. అందుకే ముందుగా వైష్ణోదేవి గురించి తెలుసుకుందాం.

ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో కొలువైవుంది వైష్ణోదేవి. ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ వైష్ణవి . 

పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా వుండి. వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి, ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింపచేయాలనుకున్నారు. వారి సంకల్పమాత్రంచేత అక్కడో అందమైన యువతి ప్రత్యక్షమైంది. వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్ధం రత్నాకరసాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆధ్యాత్మికంగా ఉన్నతస్ధాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహా విష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు. ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణంచేయబడ్డది.

వైష్ణవి చిన్నతనంనుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైంది. ఏ గురువులూ ఆమె జ్ఞాన తృష్ణను తీర్చలేకపోయారు. జ్ఞానసముపార్జనలో ఉన్నతస్ధాయి చేరుకోవాలనే తపనతో వైష్ణవి అంతర్ముఖి అయిచేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది. తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని, ఇల్లు వదిలి అడవుల్లోకెళ్ళి తపస్సు చేయసాగింది.

అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలోవున్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు. వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి ఆ శ్రీ మహావిష్ణువుగా గుర్తించి, తనని ఆయనలో లీనం చేసుకోమనికోరింది. శ్రీ రామచంద్రుడు దానికి తగిన సమయంకాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమెదగ్గరకు ఒక వృధ్ధుడి రూపంలో వచ్చాడు. కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది. అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు.

బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకారాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు. త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని తపస్సు కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించమని, ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి, పేద, బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు.

శ్రీ రామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకుని తన తపస్సు కొనసాగించింది. అనతికాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సులకోసం రాసాగారు.

కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకురావటానికి అత్యంత సమర్ధుడైన తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు. భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు. తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. 

భైరవనాధుడు వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు. వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్ , భైరవనాధ్ తో సహా మిగతా ఆయన శిష్యులనందరినీ భోజనానికి ఆహ్వానించాడు.

భోజనసమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. వైష్ణవి మందలించినా వినడు. వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సును కొనసాగించటానికి.

భైరవుడు ఆమెని వదలకుండా వెంటాడుతాడు. బాణగంగ, చరణపాదుక, అధక్వారీ అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి. అప్పటికీ విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది. తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరంమీదపడింది.

అప్పుడు తన తప్పుతెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధిస్తాడు. మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది.

తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి, అలాగే తనని సృష్టించిన త్రిమాతలు, మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞప్రకారం ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో, 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది. వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు (పిండీలంటారు అక్కడివారు) ఆ మాత తలలే. వాటినే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు.

వైష్ణోదేవి ఆలయం చేరటానికి 14 కి.మీ. దూరం కొండలెక్కాలి. దోవ పొడుగుతా తినుబండారాలు, త్రాగు నీరు, శౌచాలయాలు వగైరా యాత్రీకులకి కావలసిన అన్ని రకాల సదుపాయాలు వున్నాయి. దోవలో అవసరమైతే కొంతసేపు ఆగి విశ్రాంతికూడా తీసుకోవచ్చు. 24 గంటలూ యాత్రీకుల సందడితో వుండే దోవ పైన చాలా మటుకు రేకులతో కప్పబడి పైనుంచీ పడే రాళ్ళనుంచేకాక, ఎండా వానలనుంచీ కూడా యాత్రీకులని రక్షిస్తుంటాయి. ఎత్తైన కొండలమీద నుంచి కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు నడిచేవారికి అలసట తెలియనీయవు. కొండ ఎక్కలేనివారికోసం గుఱ్ఱాలు, డోలీలు వున్నాయి. గుఱ్ఱం కొంచెం నడుం గట్టితనాన్ని పరీక్షించినా, డోలీలో ఎలాంటివారైనా తేలికగా వెళ్ళవచ్చు. కుర్చీ లో మనం కూర్చుంటే దానికి వున్న కఱ్ఱల సహాయంతో నలుగురు మనుష్యులు మనల్ని మోసుకెళ్తారు. అదే డోలీ. తోవ పొడుగూతా భక్తులు జై మాతాకీ అంటూ లయ బధ్ధంగా చేసే నినాదాలు యాత్రీకులలో ఎనలేని ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

‘ఆగేవాలే బోలో జైమాతాకీ 
పీఛేవాలే బోలో జైమాతాకీ
పాల్కీవాలే బోలో జైమాతాకీ 
ఘోడేవాలే బోలో జైమాతాకీ’

అంటూ అందరినీ కలుపుకుంటూ చేసే నినాదాలతో మనమూ శృతి కలపకుండా వుండలేము. అర్ధరాత్రి అయినా జనసంచారం, విద్యుద్దీపాలు వుంటాయి. నిర్భయంగా కొండ ఎక్కవచ్చు. అయితే రాత్రిళ్ళు డోలీలుండవు. ఆలయం అన్నివేళలా తెరిచివుంటుంది (రాత్రంతా కూడా). దేవీ దర్శనానికి ఇదివరకు చిన్న గుహ మార్గంలో పాకుతూ వెళ్ళవలసి వచ్చేదిట. ప్రస్తుతం మార్గం సుగమంచేశారు. ఎక్కడా వంగకుండా నడుస్తూనే వెళ్ళిరావచ్చు.

పాదగయ (అమ్మవారి పాదాలుంటాయి), అమ్మవారి ఆలయానికి ఇంకా కొంచెం పైకి వెళ్తే భైరవ ఆలయం వుంటుంది. ఈ ఆలయ దర్శనంతో వైష్ణోదేవీ యాత్ర సంపూర్ణమవుతుంది . 

శుభం .

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha