అఖండ సౌభాగ్యాన్నిచ్చే కంచి కామాక్షి విశిష్ఠ దర్శనం !
భర్తని తిట్టిన దోషం పోగొట్టి, స్త్రీలకు అఖండ సౌభాగ్యాన్నిచ్చే కంచి కామాక్షి విశిష్ఠ దర్శనం !
- లక్ష్మీరమణ
ఈ సమస్త భూమండలానికి నాభి స్థానమే కాంచీపురం. అక్కడ అమ్మ జగజ్జననే స్వయంగా మాతృస్వరూపమై వేంచేసి ఉన్నారు . ఆమే కామాక్షీ దేవి. కామాక్షీ దేవిని దర్శించుకోవాలి అనుకుంటే మానవ సంకల్పం మాత్రమే సరిపోదు . ఆవిడ త్రిశక్తిస్వరూపాల ఏరూపం . శ్రీచక్ర బిందు స్వరూపిణి. శ్రీరాజరాజేశ్వరీ . ఆ అమ్మ సంకల్పం ఉంటె తప్ప ఆ దేవదేవుని దర్శించుకోవడం అంత సులువైన పనికాదు . ఇది కంచి కామాక్షి అమ్మవారి దర్శనములోని విశిష్ఠత. ఆ మాటకొస్తే, ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి . అవన్నీ చెప్పుకుంటూ ఆ అమ్మ దర్శనాన్ని, ఆ క్షేత్ర దర్శనాన్ని ఈ అక్షరాల్లో చూసుకొని తరించే ప్రయత్నం చేద్దాం రండి !
సౌభాగ్యదాయని సుగంధకుంతలాంబ:
కంచిలోని అమ్మ కరుణాంతరంగిణి అయిన అమ్మే! ఆ పదంలోని మాధుర్యాన్ని , కారుణ్యాన్ని నింపుకున్న తల్లి . ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శించుకొని, అమ్మ ముందర చేతులు జోడించగలిగామా , ఇక ఆమె మనల్ని కన్నా బిడ్డల్లా కాపాడుకుంటుంది . ఆ దర్శనమే గొప్ప వరంగా భావించాలి . ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా ఇక్కడ అమ్మ మనకి "సుగంధ కుంతలాంబ" గా దర్శనమిస్తారు . ఈ రూపంలో ఆ జగజ్జననిని దర్శించుకోవడం వలన స్త్రీలకి అఖండ సౌభాగ్యం కలుగుతుంది అని విశ్వాసం.
అమ్మవారి తపస్సు :
అమ్మవారు అంతటి తపస్సు ఇక్కడ చేశారు మరి . అమ్మ కాత్యాయనీ దేవిగా, పరమేశ్వరుణ్ణి భర్తగా వరించడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచీపురం. తపస్సులో భాగంగా ఆమె పూజించేందుకు ఒక ఇసుకతో చేసిన లింగాన్ని (శైకతలింగాన్ని) నిల్పి పూజించారు . శివయ్య అమ్మ భక్తిని పరీక్షించాలనుకున్నారు. శివ మాయా కల్పితమైన గంగా ప్రవాహాన్ని అందుకు వినియోగించారు . దాంతో కంపానది ఉగ్రరూపంతో ఆ లింగాన్ని తనలో కలిపేసుకొనే ప్రయత్నం చేసింది . దాన్ని తట్టుకొని సైకతలింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో, అమ్మవారు ఆ లింగాన్ని ఆలింగనం చేసుకొని రక్షించుకుంది . అలా ఆలింగనం చేసుకున్నప్పుడు పడిన గాజుల ముద్రలు , కుచముల ముద్రలు ఇప్పటికీ ఆ శివలింగం పై చక్కగా కనిపిస్తాయి .
త్రిశక్తి స్వరూపమే కామాక్షి :
కామాక్షి అనే పేరులోనే అమ్మ త్రిశక్తి స్వరూపము అని స్పష్టం అవుతుంది . ఆ పేరులోని కా అంటే లక్షీ దేవి, మా అంటే సరస్వతీ దేవి, అక్షి అంటే కన్నులు కలిగినది . అంటే, లక్ష్మీ సరస్వతులు రెండు కళ్లుగా కలిగిన పరాశక్తి కామాక్షి దేవి. అమ్మవారికి అభిముఖంగా ఉన్న మండపాన్ని గాయత్రీ మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బిలహసనం, శ్రీ చక్రం అనే మూడు రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనం పై కూర్చున్నట్టుగా మలిచారు. దేవి తన చేతులలో పాశం అంకుశం పుష్ప బాణం చెరుకు గడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రరూపంలో బలిని కోరుతూ ఉండడంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని చెబుతారు. ఇక్కడ ఆ శ్రీ చక్రానికీ పూజలు జరుగుతాయి.
ఢంకా వినాయకుడు :
ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ వినాయకుని దర్శనం మనకి ‘ఢంకావినాయక’ రూపంలో అవుతుంది . ఆదిదంపతుల కళ్యాణమహోత్సవాన్ని ఈ వినాయకుడు ఢంకా మోగించిమరీ విశ్వానికి తెలియజేస్తారట .
భర్తని నిందించిన దోషం నివారించే అరూపలక్ష్మి :
కామాక్షి తల్లి ఆలయంలో "అరూప లక్ష్మి" దేవి ఉంటుంది. కామాక్షితల్లిని అర్చించిన తరువాత,అర్చకులు మనకి కుంకుమని ప్రసాదంగా ఇస్తారు . దాన్ని అరూప లక్ష్మి తల్లికి ఇచ్చేయాలి. తిరిగి దాన్నే ప్రసాదంగా గ్రహించాలి . ఇలా చేయడం వలన భర్తను నిందించిన దోషం తొలగి పొతుంది. మనకు తెలియని జన్మ జన్మల శాపాలు ఏమైనా ఉంటే , స్త్రీ పురుషులకి అటువంటి శాపాలు ఈ అరూప లక్ష్మిని దర్శించుకోవడం వలన తీరిపోతాయి .
అమ్మవారి ధ్యానంలో, ‘శోకాపహంత్రీ సతాం’ అని ఉంటుంది . మనసుని అమ్మవారికి నివేదించి , త్రికరణ శుద్ధిగా ఆవిడని శరణు వెడతారో అటువంటి వారికి అమ్మ ఎన్నడూ వెన్నంటి ఉండి , అన్ని ఆపదల నుండీ రక్షిస్తుంది. వారి దుఃఖాన్ని బాపడానికి ఆ తల్లి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది . కరుణాంతరంగిణి అయిన ఆ కామాక్షీ కృపా కటాక్షాలు ఎల్లవేళలా మనపైన ఉండాలని కోరుకుంటూ నమస్కారం .
#kanchikamakshi
Tags: Kanchi, Kamakshi, aroopalakshmi,