పితృదేవతలకి పుణ్యలోకాలు అనుగ్రహించే పాదగయ !
కుక్కుటేశ్వరుడైన శివుడు , శక్తి సహితంగా వెలసి పితృదేవతలకి పుణ్యలోకాలు అనుగ్రహించే పాదగయ !
సేకరణ
చుట్టూ చక్కని పంట పొలాలు . గలగలా పారే గోదావరి జలసిరులు. ఆధ్యాత్మికమైన వాతావరణంలో విరాజిల్లే ఈ క్షేత్రంలో పితృదేవతలకు పిండప్రదానం చేస్తే, ఇక వారికి కైవల్యమే ప్రాప్తిస్తుందని నమ్మకం . పాదగయగా ప్రసిద్ధి పొందిన ఈ తెలుగునేలమీది క్షేత్రం శక్తిపీఠం కూడా కావడం విశేషం . రండి, మహాపుణ్యప్రదమైన ఈ క్షేత్ర దర్శనానికి వెళదాం .
పిఠాపురం పవిత్రమైన గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో జైన, బౌద్ధ, శైవ మరియు వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ఉన్నది. పిఠాపురం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్ఫు గోదావరి జిల్లాకు చెందిన పుణ్య క్షేత్రం. పిఠాపురాన్ని పూర్వం 'పీఠికాపురం' అనేవారు. ఇక్కడ ఉన్న శక్తి స్వరూపిణి పురుహూతికా దేవి పేరిట ఈ క్షేత్రానికి పురుహూతికా పురము అని , పాంచాల పురమనే పేర్లు కూడా ఉన్నాయి . ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు కళాపోషణను, సాహిత్యాన్ని పెంచిపోషించేవారు. అందుకే కవులు ఇక్కడి నీళ్ళల్లోనే విజ్ఞానం ఉంటుందని పేర్కొన్నారు . ఇక పురాణాల్లో ఈ క్షేత్రాన్ని పుష్కర క్షేత్రంలో గా పేర్కొన్నారు.
శైవ క్షేత్రం అయిన ఈ ఆలయంలో శివుడు కుక్కుటము (కోడి) రూపాన్ని ధరించి గయాసుర సంహారాన్ని చేశారు. అదే కుక్కుటము రూపములో లింగంగా ఇక్కడ ఆవిర్భవించారు . స్వామి లింగస్వరూపము చూడచక్కగా ఉంటుంది . కుక్కుటేశ్వర దేవాలయం కోనేరు (పాదగయ) కు ముందు తూర్పుముఖంగా ఉంటుంది. గుడికి ఎదురుగా ఏకశిల నంది విగ్రహం అతి పెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది.
ఈ ఆలయానికి రెండు వైపులా పురూహూతికా అమ్మవారి ఆలయం, శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి. శివుడు , దక్షయజ్ఞంలో మిగిలిన సతీదేవి శరీరాన్ని భుజాన ధరించి పిచ్చివాడై తిరుగుతుండగా , విష్ణుమూర్తి తన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండాలుగా ఛేదిస్తారు . అప్పడు దేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే , నేటి అష్టాదశ శక్తి పీఠాలు . అలా అమ్మవారి పిరుదులు పడిన ప్రదేశం పిఠాపురంలోని ఈ ఆలయం . ఆ విధంగా పురుహూతికా దేవి కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో కొలువయ్యుంది .
ఈ క్షేత్రం లోని మరో అద్భుతమైన విశేషం ఏమంటే , ఇక్కడ ఒకప్పుడు హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవళంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో కల ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కనిపించడం లేదు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైలు స్టేషను కి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్తాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. పురావస్తు పరిశోధక శాఖ వారు తవ్వకాలు జరిపించి చూస్తే కనిపించవచ్చని ప్రజలు అనుకొంటారు. గుడి చాలా చిన్నది. అయినప్పటికి అష్టాదశ శక్తీ పీఠాల శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది.
శ్రీపాద వల్లభ అనఘ దత్తక్షేత్రం పిఠాపురం దత్త క్షేత్రములలో ఒక ప్రాముఖ్య క్షేత్రం. శ్రీ గురు దత్తాత్రేయుని ప్రథమ అవతారం అయిన "శ్రీ పాద శ్రీ వల్లభ" స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు. ఆయన జన్మించిన గృహం ఇప్పడు "శ్రీ పాద శ్రీ వల్లభ మహా సంస్థానం" గా ఏర్పాటు చేయబడింది. శ్రీ కుక్కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయుల వారు స్వయంభూ విగ్రహరూపంలో దర్శనం ఇస్తారు. భారతదేశంలో దత్తాత్రేయుని స్వయంభూ విగ్రహం కేవలం పిఠాపురం లో మాత్రమే కలదు. మిగతా దత్త క్షేత్రములలో స్వామివారి పాదుకలు మాత్రమే ఉంటాయి .
పిఠాపురంలో చూడవలసిన ఇతర దేవాలయాలు/ సందర్శనీయ స్థలాలు:
షిరిడి సాయి గురు మందిరం, కాలభైరవుడు ఆలయం, కుంతి మాధవస్వామి ఆలయం, వేణు గోపాలస్వామి ఆలయం, నూకాలమ్మ గుడి, కుక్క పాముగుడి, రాముని కోవెల , వెంకటేశ్వరస్వామి గుడి, కోతి గుడి, కోట సత్తెమ్మ తల్లి గుడి, శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం మొదలైనవి చూడదగ్గవి.
పిఠాపురం ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం : విమానాల్లో వచ్చే యాత్రికులు రాజమండ్రి (60 కి. మీ) లేదా వైజాగ్ (180 కి. మీ) ఎయిర్ పోర్ట్ లో దిగి, క్యాబ్ లేదా టాక్సీ లలో ఎక్కి పిఠాపురం చేరుకోవచ్చు. రైలు మార్గం : సామర్లకోట రైల్వే జంక్షన్ పిఠాపురం నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ తెలంగాణ, రాయలసీమ మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే అన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగుతాయి. స్టేషన్ బయట షేర్ ఆటోలు లేదా బస్టాండ్ కు వెళ్లి ప్రభుత్వ బస్సుల్లో ఎక్కి పిఠాపురం చేరుకోవచ్చు. రోడ్డు మార్గం : కాకినాడ, సామర్లకోట, రాజమండ్రి, తుని తదితర ప్రాంతాల నుండి ప్రభుత్వ బస్సులు ప్రతిరోజూ తిరుగుతుంటాయి.