ఏలిననాటి శని దోషాన్ని తొలగించే శనిక్షేత్ర దర్శనం !
ఏలిననాటి శని దోషాన్ని తొలగించే శనిక్షేత్ర దర్శనం !
-లక్ష్మీ రమణ
కర్ణాటక రాష్టంలో హొయసనలు కళాత్మకంగా తీర్చిదిద్దిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి ఆలయాల కోవలోకే వస్తుంది ఈ శనీశ్వరాలయం. ఏలిన నాటి శనిదోషం పోవాలంటే, ఇక్కడి శనికి పూజలు చేయడమే పరిహారం. వృత్తాకారంగా ఉండే ఈ ఆలయంలో పూజలు చేస్తే, జన్మలగ్నంలో ఉండే శనిదోషం కూడా తొలగిపోతుందని విస్వాసం.
శని అంటే, శక్తి అని అర్థం. శక్తితో కలిశిన ఈశ్వరుడే, శనీశ్వరుడు . సత్యానికీ ధర్మానికి ప్రతీక. ఆయన ఛాయా, సూర్యుల పుత్రుడు. ధర్మం తప్పే వారిని దండిస్తాడు. అలాగే, ధర్మానువర్తులైన వారిని రక్షించేందుకు ఎంతకైనా తెగించి, వారికి మేలుచేసే దేవుడు శని. అందుకే ఆయనని సత్యశక్తి స్వరూపం, సంకట హరణం దేవం శనీశ్వరం ప్రణమామ్యహం అని పూజిస్తుంటారు .
కానీ జాతకరీత్యా, జనమ లగ్న రీత్యా ఏలిననాటి శనిదోషం ఉన్నవారు, దాని వల్ల జీవితంలో చాలా సమస్యలని ఎదుర్కొంటూ ఉంటారు. అటువంటి వారికి పరిష్కారాన్ని చూపిస్తూ ప్రసిద్ధిని పొందింది కర్ణాటకలోని, పావగడలో ఉన్న ఈ శని దేవాలయం .
నీలవర్ణంలో ఉండే ఈ స్వామికి నీలము రంగులో పూవులు, నీలి రంగులోని పూలమాలలు చాలా ఇష్టం . నీల గంధం, నీల ఛత్రం ధరించి ఉండే ఈ స్వామీ దివ్యమైన రథాన్ని అధిరోహించి ఉంటారని శాస్త్రం.
నిజానికి ఈ దేవాలయం శీతలాదేవి ఆలయం. 400 సంవత్సరాల క్రితం ఈ ఊరికి ఒక పెద్ద కరువు సంభవించింది. ఆ కరువు గట్టెక్కేందుకై సమీపాన అరణ్యంలో ఉన్న సిద్ధులు, మునుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు ప్రజలు. అప్పుడు వారు ఒక నల్లరాతిని తీసుకొని, శీతలాదేవి మహాబీజాక్షర యంత్రాన్ని రాశారు. అందులో అమ్మవారిని ఆవాహనం చేసి భూమి పై ప్రతిష్టించారు. భూమిని కాపాడే ఆ తల్లి చల్లని చూపుల ఫలితంగా ఆ ఊర్లో వర్షాలు బాగా పడ్డాయి, తద్వారా ప్రజలు బాగుపడ్డారు. అప్పటి నుండి ఇప్పటి వరకు చుట్టుపక్కల ఏ ఊరిలో కరువు వచ్చినా అమ్మవారి యంత్రాన్ని పూజించడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఇక్కడ వర్షాల కోసం వరుణ యాగాలను, యజ్ఞాలను జరిపిస్తుంటారు.
అనంతర కాలంలో ఇక్కడ శనీశ్వరప్రతిష్ఠ జరిగింది. ప్రతిష్ట చేసిన దైవమె అయినా ఆయన మహిమకి కొదవలేదని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు . స్థానికంగానే కాకుండా దేశ విదేశాలనుండి సైతం ఈ శనిదేవుని పూజించుకునేందుకు భక్తులు రావడం విశేషం.ఇక్కడ పూజలు చేయించుకున్నవారికి దోషనివారణ ఖచ్చితంగా జరుగుతుందని చెబుతారు .
ఇక్కడ పూజా విధానం కాస్త విచిత్రంగా ఉంటుంది. స్వామివారి వెండి దండాన్ని చేత పట్టుకొని, శనీశ్వరునికి ప్రదక్షిణాలు చేస్తారు. ఆ తర్వాత ఆదండాన్ని తిరిగి స్వామివారికి ఇచ్చేస్తారు . ఆవిధంగా ఆ దండం రూపంలో తమ బాధలని శనీశ్వరునికి తిరిగి అప్పజెబుతారని భావన .
పెళ్లి కానివారు (ఆలస్యం అవుతున్నవారు), సంతానం లేని వారు, వ్యాపారంలో వృద్ధి చెందాలనుకొనేవారు ఈ స్వామిని కొలుస్తారు. పెళ్లి జరగటానికి మాంగళ్య పూజ, వ్యాపారంలో వృద్ధి చెందటానికి ప్రాకార పూజ జరిపిస్తారు.
ఇక్కడి మరో విశేషం, దేశంలో మరెక్కడా లేని విధంగా జ్యేష్టాదేవి ఇక్కడ కొలువై పూజలందుకుంటూ ఉంటుంది. దరిద్రం తాండవించేవారు , ఈ దేవత అనుగ్రహాన్ని పొందితే, వారు ఆ బాధల నుండీ విముక్తిని పొందగలరని నమ్మకం .
ఇలా వెళ్లొచ్చు :
బెంగళూరు నుండి 175 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నుండి 114 కిలోమీటర్ల దూరంలో, తుముకూరు నుండి 98 కిలోమీటర్ల దూరంలో, కళ్యాణ దుర్గం కు 60 కిలోమీటర్ల దూరంలో పావగడ ఉంది . పావగడ కు సమీపాన 40 కి. మీ ల దూరంలో హిందూపూర్ రైల్వే స్టేషన్ ఉంటుంది . ఆంధ్రా సరిహద్దులో ఉన్నది కనుక తెలుగు భక్తులు కూడా అధికసంఖ్యలో వస్తుంటారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు.