అన్నవరంలో స్వామి వ్రతం చేసుకుంటే, ఇక పునర్జన్మ లేనట్టే
అన్నవరంలో స్వామి వ్రతం చేసుకుంటే, ఇక పునర్జన్మ లేనట్టే !!
లక్ష్మీ రమణ
సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే, సకల సౌభాగ్యాలూ , సిరి సంపదలూ , పుత్ర పౌత్రాదులూ వృద్ధి చెందుతారని పెద్దలు చెబుతారు . పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించడం మరింత శ్రేష్టం అంటారు పండితులు . అంతకన్నా శ్రేష్టమైనది , ఆ స్వామి సత్యనారాయణ స్వరూపంగా , అనంతలక్ష్మీ సత్యవతీ సహితంగా వెలసి పూజలందుకుంటున్న అన్నవరంలో సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవడం . అందులోనూ పౌర్ణమి కలిసి వచ్చిందనుకోండి , ఇక పూర్వజన్మ అనేది లేనట్టే !
అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి చాలా ప్రసిద్ధమైంది. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అన్నవరంలో రత్నగిరి కొండమీద ఉంది. సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం, ఎడమవైపున కళ్యాణ మండపం ఉంటాయి . రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం ఇక్కడే చేసుకుంటూ ఉంటారు కనుక, గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. అలాగే గుడి వెనుక గుట్టమీద అనేక కాటేజ్ లు కూడా ఉంటాయి . కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించడానికి వచ్చే భక్తులకి సదుపాయాలకు లోటుండదు .
ఇక , కొత్తగా పెళ్ళయిన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్ళలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకుంటామని ప్రత్యేకంగా స్వామికి మొక్కుకుంటారు కూడా!
ఇక్కడ స్వామీ వెలసిన దివ్యగాథని స్థలపురాణం ఇలా వివరిస్తుంది . పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు. ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు. భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు. రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.
అదలా ఉంటె, ఇక ఆ రత్నాచంపైన స్వామీ వేంచేసిన తీరు మరో అద్భుతం . క్రీ.శ. 1891లో తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర ఈ రత్నకుడు - రత్నాచలం అనే కొండగా వెలసిన ప్రాంతమైన అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, ఇంకా శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి “రాబోవు శ్రావణ శుక్ల విదియ, మఖా నక్షత్రములో, గురువారము నాడు రత్నగిరిపై నేను వెలుస్తాను. నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుమని చెప్పి మాయమయ్యారట.
అప్పుడు ఆ రాజు సంతోషంతో అందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి వెతికి, ఒక పొదలో సూర్యకిరణాలు ప్రణమిల్లుతున్న స్వామి పాదాలని దర్శించారు . ఆ తర్వాత అక్కడున్న స్వామి విగ్రహాన్ని చూసి అమితానందం చెందారు. కాశీనుండి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి 1891, ఆగస్టు 6వ తారీకున ప్రతిష్టించి, ఆ యంత్రంపై స్వామిని దేవేరియైన అనంతలక్ష్మీ సత్యవతీ సమేతంగా ప్రతిష్టించారు. హరి హరులకు బేధం లేదని నిరూపిస్తూ సత్యన్నారాయణ స్వామి ప్రక్కనే ఈశ్వరుడుకూడా పూజలందుకుంటూంటాడు.
ఈ స్వామి మూలం బ్రహ్మ, మధ్య భాగం ఈశ్వరుడు, పై భాగం మహ విష్ణువుగా, త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఆలయ సమీపంలో పంపా నది హోయలొలుకుతూ పారుతుంటుంది. ఆలయ నిర్మాణం అయి ఒక శతాబ్దము మాత్రమే అయినా చాలా ప్రాశ్యస్త్యాన్ని, ప్రాముఖ్యతను పొందింది. ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండుగగా చేసుకోవడం ఒక ప్రత్యేకత.
అన్నవరం శ్రీ వీరవెంకట సత్యన్నారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి వైశాఖ బహుళ పాడ్యమి వరకు పంచాహ్నికంగా, స్మార్తాగమరీతిలో, ఆపస్తంబ సూత్రరీత్యా, మహావైభవంగా జరుగుతాయి. వీటినే అన్నవరం సత్యదేవుని బ్రహ్మోత్సవాలు అంటారు.
అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అన్నవరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామము.రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. అన్ని ప్రధాన పట్టణాల నుండీ బస్సు , రైలు సౌకర్యాలు ఉంటాయి .