Online Puja Services

రోగ, శోక, దారిద్య్రాలు తొలగించే అరసవిల్లి క్షేత్రం

3.144.249.63

రోగ, శోక, దారిద్య్రాలు తొలగించే అరసవిల్లి క్షేత్రం . 
లక్ష్మీ రమణ 

మాఘశుద్ధ సప్తమి రోజున అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించి, సేవించడం ద్వారా రోగ, శోక, దారిద్య్రాలు పోతాయని భక్తుల నమ్మకం. అందుకే రథసప్తమి రోజున భక్తులు స్వామివారి నిజరూప దర్శనం, మహాక్షీరాభిషేకం సేవలో పాల్గొని తరిస్తారు. మాఘశుద్ధ సప్తమి వేకువజామున ఆకాశంలో నక్షత్రాలు రథం ఆకారంలో ఏర్పడుతుంటాయని, ఉత్తరాయణంలో వచ్చే చర్మ, కుష్ఠి, బొల్లి వ్యాధుల నుంచి రక్షణ పొందాలంటే సూర్యారాధన చేయాలని పండితులు చెబుతారు . 

ఊర్ధ్వముఖంగా ప్రయాణించే సూర్య కిరణాలు :
ఉత్తరాయణం నుంచి దక్షిణాయణానికి సూర్యుడు మారే సందర్భంలో కిరణస్పర్శ మూలవిరాట్టును తాకడం ఆనవాయితీగా వస్తోంది. సూర్య కిరణాలు స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్ళే ఈ అద్భుత ఘట్టం ఏటా ఇక్కడ కనువిందు చేస్తోంది. కేవలం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మాత్రమే ఈ దృశ్యం గోచరిస్తుంది. ఈ కిరణాలు పాదాలనుండీ శిరస్సుకి ప్రయాణించడం అంటే, ఊర్థ్వ ముఖంగా ప్రయాణించడం అనేది యోగ పరంగా మహజ్ఞాన ప్రదాయకం .  ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.

ఆలయ నిర్మాణం :
మన దేశంలోని సూర్యదేవాలయాలలో ఇది అత్యంత ప్రాచీనమైనది. పద్మ పురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కస్యప మహర్షి ఈ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. సాక్షాత్తు ఇంద్రుడే ఈ ఆలయం నిర్మించాడని, దీని పక్కనే ఉన్న కోనేరును ఇంద్ర పుష్కరిణి అని అంటారు.

సార్థక  నామధేయత :
ఇక్కడి క్షేత్రపాలకుడు రామలింగేశ్వర స్వామి . ఈ ఆలయంకూడా అరసవెల్లిలో చూసి తీరవాల్సినదే! ఈ క్షేత్రాన్ని  దీనిని అర్నోహర క్షేత్రం అని కూడా  అంటారు. అర్మస్సు అనగా మూలవ్యాధి. చాలా మొండి వ్యాధి . అటువంటి వ్యాధులు కూడా నయం చేయగలిగిన మహిమోపేతమైన క్షేత్రంగా అరసవల్లిని  పిలుస్తారు . అందుకే ఇది సార్థక నామధేయమైన క్షేత్రం కూడా ! 

అరుణశిల.. అత్యద్భుతం:
ఆదిత్యాలయంలో రథసప్తమి రోజున శ్రీసూర్యనారాయణస్వామి నిజరూప దర్శనం భక్తులకు మరపురాని మధురానిభూతి కలిగిస్తుంది. అరుణశిల దర్శించినంత మాత్రానే అద్భుతశక్తి శరీరంలోకి ప్రవేశించిన భావన కలుగుతుంది. ఆదిత్యాలయంలోని అయిదున్నర అడుగుల అరుణశిలతో దేవశిల్పి విశ్వకర్మ స్వామి మూలవిరాట్‌ను చెక్కినట్లు పురాణాలు చెబుతున్నాయి. మూలవిరాట్‌ కిందన వైజయంతి సప్త అశ్వరథం ఉంటుంది. రథంపై గుర్రాలు తాళ్లు పట్టుకుని సూర్య రథసారథి అనూరుడు ఉంటారు. స్వామి పాదాల ముందర ఛాయాదేవి, స్వామి ఎడమవైపు, కుడివైపు ఉషా, పద్మినిదేవి ఉంటారు. ముగ్గురు దేవేరుల్లో ఉషా, పద్మిని ధనుస్సులు ధరించి ఉంటారు. స్వామికి ఎడమవైపున ద్వారపాలకుడైన మాఠరుడు కత్తి, డాలు ధరించి ఉంటాడు. స్వామికి కుడివైపున చిన్న గడ్డంతో కూడిన పింగళుడు ఎడమవైపు సిరాబుడ్డీ, కుడిచేతిలో కలం పట్టుకుని ఉంటాడు. ఈయనే భక్తులు చేసే విజ్ఞాపనలు, కోరికలు స్వీకరించి స్వామికి నివేదిస్తారు. స్వామికి శిరస్సుకు ఎడమవైపు సనకుడు ఛత్రంలోను, కుడివైపున సనందుడు అనే మహర్షి ఛామరం పట్టుకుని సేవలు అందిస్తారు. స్వామికి రెండు చేతులు అభయ ముద్రలలో ఉంటాయి. స్వామి భుజాలకు ఇరువైపుల తామరపూలు, మొగ్గులను ధరించి ఉంటారు. స్వామి నిజరూప దర్శనంలో వస్త్రాల కిందన బెల్టును ధరించి ఉంటారు. సూర్యనారాయణస్వామి మెడలో హారాలు, మకర కుండలాలు, కేయూరాలు, రత్నఖచిత సూర్యమణి కిరీటంతో చిరునవ్వుతో స్థానక భంగిమలో భక్తులకు స్వామి దర్శనం ఇస్తుంటారు. స్వామి శిరస్సు మీద శరభ సాల్వం అనే పతాక చిహ్నం ఉంటుంది.

పాయసాన్నం.. పరమౌషధం
రథసప్తమి రోజున ఉదయం 8 గంటల లోపు వాకిట్లో పొయ్యిను పెట్టి కొత్తబెల్లం, కొత్తబియ్యం, చెరకు, ఆవుపాలతో పాయాసన్నం చేసి స్వామికి నివేదించి భక్తులు తింటే నరాలు, కీళ్ల నొప్పులు, హృద్రోగ సంబంధ వ్యాధులు నశిస్తాయని నగేష్‌ శర్మ తెలిపారు. స్వామికి సమర్పించిన తీపి పదార్థంపై లేలేత సూర్యకిరణాలు పడడం వల్ల శరీరంలో రోగ నిరోధకశక్తి పెరిగి, మధుమేహవ్యాధిని తగ్గిస్తుంది. పాయాసన్నంలో వాడే చెరకు వల్ల పళ్లు, దవడలు, నరాలకు శక్తి వస్తుంది. రథసప్తమి రోజు నదులు, చెరువుల్లో తలపై దీపం పెట్టి వదిలివేస్తే మరుజన్మ ఉండదని భక్తుల విశ్వాసం. జిల్లేడు ఆకులు శిరస్సున, రెండు భుజాలపైన రేగుపళ్లు పెట్టుకుని స్నానం చేస్తే ఏడు జన్మల రోగాల పోయి, మనస్సు, నవరంధ్రాలు, పంచేంద్రియాలు సుషుప్తావస్థ నుంచి జాగృతావస్థలోకి వస్తాయని చెబుతారు. రథసప్తమి రోజున స్వామి నిజరూప దర్శనం వల్ల అభిషేకం చేసిన అరుణశిల కిరణాల స్పర్శతో భక్తులకు రోగనివారణ కలుగుతుందని నమ్ముతారు. 

ఇలా చేరుకోవచ్చు : శ్రీకాకుళం నుండీ ఈ ప్రాంతానికి బస్సులు అందుబాటులో ఉంటాయి  . 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore