ఏ సమస్యకైనా కుండెడు నీళ్ళు మొక్కితే చాలు !
ఏ సమస్యకైనా కుండెడు నీళ్ళు మొక్కితే చాలు ! కరుణించి కాపాడే అమ్మ!
- లక్ష్మి రమణ
భక్తుల కష్టనష్టాలు ఎరుకగలిగిన దేవి .
శిరస్సు లేని శివకామేశ్వరి.
శ్రీచక్రమే శిరస్సయిన బిందుమండలవాసిని .
కుండెడు నీళ్లు అర్పిస్తే, అనుగ్రహించే దేవదేవి .
రండి అమ్మవారి దర్శనం చేసుకుందాం !!
విరిగిన విగ్రహాలు పూజార్హం కాదని అంటారు . కానీ ఇక్కడ శిరస్సు విరిగిపోయిన అమ్మవారే మూలమూర్తి . అవును, ఈ ఆలయంలో కొలువైన అమ్మవారికి శిరస్సు ఉండదు. శిరస్సు స్థానంలో ఒక ఓంకారం ఉంటుంది . అమ్మవారి శిరస్సు ఆమె పాదాల చెంత దర్శనం ఇస్తుంది. అహంకారమే లేని అనుగ్రహవల్లి ఈ గౌరమ్మ . అమ్మవారి వెనుక భాగంలో శ్రీచక్రం ఉందని, అందువల్ల అమ్మవారి శక్తిస్వరూపిగా అనుగ్రహిస్తుందని ప్రజల విశ్వాసం .
ఈ అమ్మవారి పేరు ఎరుకమాంబ. విశాఖపట్టణంలోని దొండపర్తిలో ఈ ఎరుకుమాంబ దేవాలయం ఉంది . సాధారణంగా అమ్మవారికి మొక్కుకునేవారు పసుపూ, కుంకుమలు , చీర, పళ్లు, పంచబక్ష పరమాన్నాలను మొక్కుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఎరుకుమాంబ అమ్మవారికి మాత్రం నీళ్లు మొక్కుకుంటే చాలు. అడిగిన వరాలు అనుగ్రహించి, భాధలు తీరుస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం.
ఇక ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఏడో శతాబ్దం నుంచి ఎరుకమాంబ అమ్మవారు ఇక్కడ కొలువైయ్యారని స్థల పురాణం చెబుతోంది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉన్న వైర్ లెస్ కాలనీలో ఎరుకుమాంబ అమ్మవారు పూజలు అందుకునేవారు. గతంలో అక్కడ ఉన్న గ్రామ ప్రజలను రైల్వే స్టేషన్ నిర్మాణ సమయంలో ఖాళీ చేయించారు. ఆ సమయంలో దేవత విగ్రహం ఎద్దుల బండి మీద పెట్టి తీసుకొస్తూ , ఎక్కడైతే ఆ బండి కదలకుండా ఆగిపోతుందో అక్కడ ఆలయం కట్టి విగ్రహం స్థాపించాలని అమ్మవారిని గ్రామస్థులతోపాటు తీసుకువస్తూ ఉన్నారు . ఆ సమయంలో అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరుపడింది. అయితే, వేరు పడిన అమ్మవారి శిరస్సుని తిరిగి ఎన్నిసార్లు అతికించినా నిలవలేదు. అప్పుడు భక్తులు అమ్మవారిని వేడుకోగా, ఆవిడ తన శిరస్సుని కాళ్ళ దగ్గరే పెట్టి, కంఠానికి నీళ్లు పోస్తే, చల్లగా చూస్తానని ఆనతినిచ్చారు. అప్పటి నుండీ అమ్మవారు చెప్పినట్లు ప్రతి బుధవారం నాడు, గురువారం నాడూ అమ్మవారికి పవిత్రమైన పసుపు నీటితో అభిషేకాలు చేస్తారు . ఇలా అమ్మవారికి మొక్కుకొని ఎవరు స్నానం చేస్తారో, వారి కోరికలు తప్పక తీరుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం.
ఉత్తరాంధ్రలో సత్యం గల తల్లిగా ఎరుకమాంబను భక్తులు కొలుస్తారు.ఈ అమ్మవారు గౌరీ స్వరూపం.ప్రజల సంక్షేమం కోసం ఈ కలియుగంలో జన్మించిన దేవతలలో ఒకరిగా ఎరుకుమాంబను వ్యవహరిస్తారు.బుధవారం నాడు అమ్మవారిని పవిత్రమైన పసుపు నీటితో ఎవరు స్నానం చేస్తారో, వారి కోరికలు తీరుతాయని విశ్వాసం. వివిధ ప్రాంతాల నుండి మరియు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు బుధవారం స్నానోత్సవ వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. వికలాంగులు స్వస్థత పొందుతారు, వివాహం లేకుండా ఎక్కువ కాలం ఉన్న ఆడపిల్లలు కల్యాణ యోగం పొందుతారు.
ప్రత్యేకించి, ఇక్కడి విశేషం ఏమిటంటే అమ్మవారికి మొక్కుకున్నవారు స్వయంగా అమ్మవారి గర్భాలయంలో పూజలు చేసుకోవచ్చు. స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు . సత్యమున్న ఈ గౌరమ్మ పూజలందుకొంటున్న దొండపర్తిని ఈ సారి మీ విశాఖ ట్రిప్ లో తప్పక దర్శించండి .
శుభం !
#yerukamamba
Yerukamamba, visakhapatnam, dondaparti