Online Puja Services

గుంటనక్కలకి ప్రసాదాన్ని పంచే దివ్యాలయం ఈ దత్తధామం .

18.116.36.23

గుంటనక్కలకి ప్రసాదాన్ని పంచే దివ్యాలయం ఈ దత్తధామం . 
- లక్ష్మి రమణ 

 నక్కలని గుంటనక్కలని తిడుతూ ఉంటారు.  వాటిని చూస్తేనే అశుభంగా , వాటి అరుపు వింటే మహా పాపంగా భావిస్తారు . సాధారణ పరిస్థితుల్లో ఈ మాటలు నిజమై వర్తిస్తాయేమో కానీ, ఈ ఆలయంలో మాత్రం వాటికి పెద్ద పీట వేస్తారు.  భగవంతునికి నివేదించిన ప్రసాదాన్ని వాటిని ఆహ్వానించి మరీ ఆరగింపు చేస్తారు.  ఈ విచిత్రమైన ఆచారానికి నాంది పలికినవాడు జగద్గురువు దత్తాత్రేయులవారు. 

  దత్తాత్రేయుని మహిమలు, ఆయన ప్రవర్తన చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది.  ఆయన అనుగ్రహాన్ని పొందితే ఇక జీవితంలో కావలసినది, కోరుకోవలసినదీ ఏదీ ఉండదు. అపారమైన కృప అంటే కేవలం అది దత్త ప్రభువుదే ! నక్కలు, కుక్కలు కూడా ఆయన అపార కృపకి పాత్రం కాగలవు.  అటువంటి దివ్య కరుణాసింధువు దత్త ప్రభువు . నక్కలని ఆదరిస్తున్న ఈ క్షేత్రం కూడా ఆ దత్త స్వామిదే ! 

గుజరాత్లో కచ్ అనే జిల్లా ఉంది. ఇది మన దేశంలోనే అతిపెద్ద జిల్లా. ఈ జిల్లా ముఖ్య కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో కాలో దుంగార్ అనే పర్వతం ఉంది. ఈ పర్వతం నల్లటి నలుపు రంగులో ఉంటుంది. అందుకే దానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. కాలో దుంగార్ పదిహేను వందల అడుగుల ఎత్తున ఉంటుంది. కాబట్టి ఈ పర్వతాన్ని ఎక్కితే దూరదూరంగా ఉన్న ప్రదేశాలన్నీ కనిపిస్తాయి. ఆఖరికి పాకిస్తాన్ భూభాగం కూడా కనిపిస్తుంది. అందుకని పర్యటకులు ఈ కొండని ఎక్కేందుకు ఉత్సాహపడుతూ ఉంటారు. అయితే వారి ఉత్సాహానికి మరో కారణం కూడా ఉంది! అదే కాలో దుంగార్ మీద ఉన్న దత్తాత్రేయుని ఆలయం.

 కాలో దుంగార్ మీద ఉన్న ఆలయం చిన్నదే! దాని వెనుక ఉన్న చరిత్ర మాత్రం అనూహ్యం. త్రిమూర్తుల అవతారమైన దత్తాత్రేయులవారు ఒకానొక సందర్భంలో ఈ పర్వతాలు మధ్యన సంచరించారట. ఆ సమయంలో ఆయన దగ్గర ఆహారాన్ని ఆశించి కొన్ని నక్కలు దగ్గరకు వచ్చాయి. కానీ ఆ నక్కల ఆహారాన్ని తీర్చేందుకు దత్తాత్రేయులవారి దగ్గర ఎలాంటి ఆహారమూ లేదయ్యే! దాంతో తన చేతినే వాటి ముందు ఉంచారట స్వామివారు. ‘లే అంగ్’ (నా శరీరభాగాన్ని తీసుకో) అంటూ తన చేతినే వాటికి అర్పించారట.

 మరొకకథ ప్రకారం ఒకానొక రాజు, దత్తాత్రేయుని దర్శనం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. ఆ రాజు తపస్సుని పరీక్షించేందుకు దత్తాత్రేయులవారు ఒక నక్క రూపంలో రాజు దగ్గరకు చేరుకుని తన ఆకలి తీర్చమని అడిగారట. దాంతో ఆ రాజు రుచికరమైన భోజనాన్ని ఆ జీవి ముందు ఉంచాడు. ‘ఇదేనా నీ దానగుణం. మాంసాహారాన్ని ఇష్టపడే నా ముందు ఇలాంటి ఆహారం ఉంచుతావా!’ అంటూ ప్రశ్నించిందట ఆ నక్క. దాంతో రాజు స్వయంగా తన చేతిని నరికి మారురూపంలోని దత్తాత్రేయుల ముందు ఉంచాడట. రాజు దానగుణానికి దత్తాత్రేయులవారు ఎంతో ప్రసన్నులై ఆయనకు తన నిజరూపంలో సాక్షాత్కరించారని చెబుతారు.

  కథ ఏదైతేనేం, ఈ ప్రాంతంలో నక్కల ఆకలిని తీర్చిన ఘటన ఒకటి జరిగే ఉంటుంది. ఆ ఘటన ఆధారంగా గత 400 సంవత్సరాలుగా నక్కలకు ప్రసాదాన్ని అందించే ఆచారమూ సాగుతోంది. రోజూ మధ్యాహ్నమూ, సాయంత్రమూ ఇక్కడి దత్తాత్రేయ ఆలయంలో ఉన్న పూజారి ఒక అరుగు దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ఓ పళ్లెం మీద కొడుతూ ‘లే అంగ్, లే అంగ్’ అని అరుస్తాడు. పూజారి మాట కోసమే ఎదురుచూస్తున్నాయా అన్నట్లుగా, కొద్ది నిమిషాలలో ఓ పాతిక నక్కలు బిలబిలలాడుతూ వచ్చేస్తాయి. అరుగు మీద పూజారి ఉంచిన ప్రసాదాన్ని ఆవురావురుమంటూ తింటాయి. చాలా సందర్భాలలో బెల్లంతో చేసిన పరమాన్నాన్నే ప్రసాదంగా పెడుతూ ఉంటారు.

 కాలో దుంగార్లో జరిగే ఈ వింతను చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. ఇలా ఎన్ని వందల మంది ఆ ఆలయం చుట్టుపక్కల తిరుగుతున్నా, నక్కలు వారిని దాడి చేసిన సంఘటన ఇప్పటివరకూ ఒక్కటి కూడా నమోదు కాకపోవడం విచిత్రం! క్రూరత్వానికి పేరుపొందిన నక్కలు కాస్తా ఆలయం దగ్గరకు రాగానే సాధుజంతువులుగా మారిపోవడం ఆ దత్తాత్రేయుని మహిమే అని చెబుతారు.

ఇది కేవలం ఆ దుష్ట ప్రవృత్తిగల వన్య జీవులకే పరిమితం అనుకుంటే పొరపాటే !! మనుషుల్లో ఉండే దుష్టమైన గుణాలనీ మచ్చిక చేసి, మానసిక పరివర్తన తీసుకువచ్చే అనుగ్రహాన్ని ప్రసాదించగలిగిన దివ్య దేశం ఈ దత్తక్షేత్రం . 

శుభం !!

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba