శ్రీ కనకమహాలక్ష్మీ క్షేత్రం !!
సంపాదననీ, సౌభాగ్యాన్నీ ప్రసాదించే శ్రీ కనకమహాలక్ష్మీ క్షేత్రం !!
- లక్ష్మి రమణ
లక్ష్మీ దేవిని బంధించి ఉంచితేనే మన ఇంట నిలుస్తుందని పెద్దలు చెబుతుంటారు . కానీ ఈగ్రామవాసులకి మాత్రం ఆ సూత్రం వర్తించదు. మహా మహిమాన్వితమైన కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి స్వయంగా వచ్చి నిలిచింది. సంపదలకు అధిదేవతైన ఆ కనకమహాలక్ష్మి విరాజిల్లే ఈ ఆలయం మన తెలుగు నేల మీదే ఉండడం తెలుగువారు చేసుకున్న అదృష్టం. ఆ దేవదేవి దర్శనం అనంతమైన సంపదల్ని అనుగ్రహిస్తుంది స్థానికుల విశ్వాసమూ , స్థలమహత్యమూ కూడా ! రండి ఆ క్షేత్రాన్ని ఈ అక్షరాలలో దర్శిద్దాం .
విశాఖపట్టణం పేరు వినగానే, అనంతజలరాశిని కలిగిన సముద్రుడు, తన పాదమంజీరాలతో జ్ఞాన బోధని చేసే గంగమ్మ గోదావరి గుర్తుకు రాక మానవు. ఆ విశాఖపట్టణం లోని బురుజుపేటలో కొలువయ్యింది మన కనకలక్ష్మీ దేవి. సత్యంగల తల్లిగా, కల్పవల్లిగా కోరిన వరాలిచ్చే అమృతమూర్తిగా భాసిల్లుతోంది ఇక్కడి అమ్మవారు . స్థానికులు బంగారం కొన్నా, వెండి కొన్నా, తమ ఇంట వివాహ వేడుకలు జరుగుతున్నా, బిడ్డ పుట్టినా, కొత్త పంట ఇంటికి చేరినా మొదట ఆ అమ్మ దర్శనం చేసుకొని ఆ సంతోషాన్ని మొదట అమ్మతో పంచుకోవడం ఒక సంప్రదాయం .
లక్ష్మీ నివాసం అంటే, ఆ హంగూ ఆర్భాటం వేరే లెవల్లో ఉంటాయి . సంపదకు అధిదేవతైన అమ్మ ఉండే ఇల్లంటే ఆ సాధ్యమేనా ? కానీ ఇక్కడి అమ్మ గుడికి గోపురం కూడా ఉండదు. గోపురం నిర్మించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదని, వాటిని ఆ అమ్మే అడ్డుకుంటుందని ఇక్కడి భక్తులు చెబుతారు . సాదాసీదాగా ఉండే ఈ ఆలయంలో సామాన్యులకోసమే దిగివచ్చిందా అన్నట్టు అమ్మ ప్రసన్నవదనంతో దర్శనమిస్తారు . సంవత్సరం పొడవునా, ఇరవైనాలుగు గంటలపాటు ఈ ఆలయం తెరిచే ఉంటుంది . భక్తులు ఏ సమయంలో అయినా పూజలు చేసుకొనే వీలుంటుంది .
ఇక్కడి మూలవిరాట్టుకి వామహస్తం సగమే ఉంటుంది . ఇలా అమ్మవారు సగం చేతితోనే దర్శనమివ్వడానికి కారణం మహేశ్వరుడని స్థలపురాణం. ఆ కథనం ప్రకారం కలియుగారంభంలో సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు దైవ సాన్నిధ్యం పొందాలన్న కోరికతో కాశీకి ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ బురుజుపేట చేరుకున్నాడు. అప్పటికి మధ్యాహ్నం అయినందున పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ప్రస్తుత అమ్మవారి క్షేత్రం వద్ద ఉన్న బావిలో స్నానం చేశాడు . ఆ తర్వాత సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తుండగా, అమ్మవారి వాణి వినిపించింది. కలియుగ భక్తుల కోర్కెలు తీర్చడానికి తాను వెలిశానని, బావిలో ఉన్న తనను బయటకు తీసి ప్రతిష్టించమని అమ్మ కోరింది.
కాని, బ్రాహ్మణుడు అమ్మవారి కోరికను సున్నితంగా తిరస్కరించి తాను కాశీకి వెళ్లే తొందరలో ఉన్నట్టు నివేదించి వెళ్లడానికి అనుమతి ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో అమ్మ ఆగ్రహం చెంది బావి నుంచి పైకి వచ్చి తన వామహస్తంలో గల పరిఘ అనే ఆయుధంతో ఆ బ్రాహ్మణుణ్ణి సంహరించటానికి ఉద్యుక్తురాలయ్యింది. అది చూసి భీతిల్లిన బ్రాహ్మణుడు రక్ష కోసం శివుణ్ణి ప్రార్థించగా, శివుడు తన దివ్యదృష్టితో సంగతి గ్రహించి అమ్మవారి ఆగ్రహాన్ని తగ్గించడానికి ఆమె చేతిలోని ఆయుధాన్ని నిర్వీర్యపరచి వామహస్తాన్ని మోచేతి వరకు ఖండించాడు. దాంతో అమ్మవారిలో కోపం మటుమాయమై శాంతి, కారుణ్యం నిండగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించింది. అప్పుడు మహేశ్వరుడు ఆమెను కలియుగంలో శ్రీకనకమహాలక్ష్మిగా అవతరించి భక్తుల పూజలు అందుకోమని అనుగ్రహించినట్టూ కథనం.
మరో ఉదంతం ప్రకారం శ్రీకనకమహాలక్ష్మీ అమ్మవారు ఈ ప్రాంతాన్ని పాలించిన విశాఖ రాజుల ఇలవేల్పు. ఆమె నెలకొన్న ఈ ప్రాంతంలో ఒకప్పుడు విశాఖ రాజుల కోటబురుజు ఉండేదని, అందుచే తల్లి ఉన్న ఈ ప్రాంతాన్ని బురుజుపేటగా పిలుస్తున్నారని అంటారు. అయితే ఒకసారి శత్రురాజులు బురుజుపై దండెత్తి వచ్చినప్పుడు అమ్మవారిపై దృష్టి పడకుండా ఉండేందుకు విగ్రహాన్ని బావిలో పడవేశారనీ తర్వాత బయటకు తీసి గుడిలో ప్రతిష్టించారని, ఆ సమయంలోనే అమ్మవారి చేయి అలా విరిగిపోయింది మరో కథనం.
ఈ స్థల మహత్యం సంగతి ఎలా ఉన్నా, సత్యమున్న తల్లిగా , సకల సంపదలనూ అనుగ్రహించే దేవతగా మాత్రం ఈ క్షేత్రం లోని కనకమహాలక్ష్మి పేరొందింది . దక్షణ భారత దేశం నుండే కాక, ఉత్తరభారత దేశం నుండీ కూడా భక్తులు ఇక్కడికి అమ్మ దర్శనార్థం వస్తుంటారు . గురువారం నాడు ప్రత్యేకపూజలు నిర్వహిస్తుంటారు . ఈ క్షేత్రంలో పూజలు నిర్వహించడం వలన ఐశ్వర్యాన్ని , సౌభాగ్యాన్ని శ్రీ కనకమహాలక్ష్మి అనుగ్రహిస్తుందని భక్తుల విశ్వాసం.