Online Puja Services

తాగుడు వ్యసనం నుండీ బయటపడాలా ?

18.118.119.77

తాగుడు వ్యసనం నుండీ బయటపడాలా ? అయితే ఈ ఆలయానికి బయల్దేరండి !
లక్ష్మీ రమణ 

మాల ధారణం  నియమాల తోరణం అని అయ్యప్ప భక్తులు నియమాలతో అయ్యప్పమాల వేసుకుంటారు. కానీ ఆ నియమాలు జీవితాంతం పాటించేవారు ఎంతమందన్నది ఆలోచించుకోవాల్సిందే ! కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయేది  అయ్యప్పమాల గురించి కాదు. పాండురంగ మాల  గురించి. పైగా ఈ దీక్షని పాండురంగని భక్తులు విశేషంగా ఉండే మహారాష్ట్రలో కూడా కాదు. అచ్చంగా స్వచ్ఛమైన  తెలుగు ప్రాంతంలో . 
    
సాధారణంగా మనందరికీ కూడా ఒక్కొక్కరికీ ఒక్కో ఇష్టదైవం ఉంటారు . కానీ, ఉంతకల్లు లో మాత్రం ఊరు ఊరంతా పాండురంగని భక్తులే ! ఇక్కడ కొలువైన పాండురంగ దేవాలయం ఎంతో మహిమకలది. గ్రామస్తులందరూ భక్తి శ్రద్దలతో ఆ స్వామీ పూజా కార్యాక్రమాలను నిర్వహిస్తుంటారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పాండురంగ స్వామి దేవాలయాన్ని భక్తుల దర్శనార్థం తెరిచే ఉంచుతారు.

కొన్ని శతాబ్దాల క్రితం ఈ ఊరు ప్రజలు తరచూ మహారాష్ట్ర లోని పుణ్యక్షేత్రమైన 'పండరీపురం' వెళ్లివచ్చేవారు. ఆతర్వాత ఇక్కడే ఒక దేవాలయాన్ని నిర్మించుకొని పాండురంగ స్వామి దేవాలయంగా పేరుపెట్టుకున్నారు. భక్తి ఎక్కడుంటే, అక్కడే కట్టుబడే దేవుడు పాండురంగడు. అందుకే మహిమాన్వితమైన దైవంగా ఈ ఊరి ప్రజల భక్తికి కట్టుబడిపోయాడు. 

ఇక్కడి పాండురంగడి ప్రత్యేకత ఏంటంటే, మద్యాన్ని మాన్పించడం . మద్యానికి బానిసైనవారు ఒక్కసారి ఈ దేవాలయాన్ని దర్శించి పాండురంగ మాల ధరిస్తే మళ్ళి జన్మలో దాని జోలికి పొరనేది ఉంతకల్లు భక్తుల ప్రగాఢ నమ్మకం. మాల ధరించిన ఏ ఒక్కరూ మళ్ళి ఇప్పటివరకు మద్యం జోలికి వెళ్లలేదనే సాక్ష్యాలు ఉన్నాయి అని స్థానికులు చెబుతారు.

'మాల' ఎప్పుడు ధరించాలి? 'పాండురంగ మాల' ఎప్పుడు పడితే అప్పుడు, ఏ రోజుపడితే ఆరోజు వేసుకోకూడదు. మాలాధారణ నిర్వహణ నెలలో కేవలం రెండు రోజుల మాత్రమే 'శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి' రోజుల్లోనే మాల ధరించాలి. ఆ రోజులలో రాష్ట్రం నలుమూలల నుంచే కాక పక్కనున్న కర్ణాటక, తమిళనాడు మరియు మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో ఊంతకల్లు పాండురంగాని దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. 
 
పాండురంగ మాల ధరించాలనుకొనేవారు ముందుగా 100 రూపాయల ధర చెల్లించి టోకెన్ తీసుకోవాలి. ముందురోజు అర్ధరాత్రి నుంచి మాలను స్వామి వారి సన్నిధిలో ఉంచి పూజలు, భజనలు చేస్తారు. మాల ధరించేవారు ఉదయాన్నే నిద్ర లేచి స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకోవాలి. గుడి ప్రాంగణంలో టోకెన్ నెంబర్ ప్రకారం క్యూ లైన్ లో నిల్చోవాలి. ఇలా నిల్చున్న భక్తులకు ఆలయ ప్రధాన పూజారి వచ్చి మెడలో ఒక్కోటిగా మాల వేస్తారు.

ఆరోజున ఎంత ముందైతే భక్తులు వస్తారో, అంతమందికి ఉచిత భోజనాన్ని గ్రామస్తులే వండి, వడ్డిస్తారు. టోకెన్ కు 100 రూపాయలు తప్పనిచ్చి ఇంకా దేనికీ డబ్బులు తీసుకోరు. మాలధారణ చేసిన వారు వరుసగా మూడు ఏకాదశ రోజులలో ఇక్కడికి వచ్చి ఆలయ ప్రాంగణంలో నిద్రపోవాలి. కావాలనుకుంటే ఆ మూడు ఏకాదశ రోజులు నియమానుసారం నిద్ర చేశాక, మాల తీసేయవచ్చు. అంతకు ముందర ఈ మాలని మెడలో నుండీ తీయకూడదు . దీనివల్ల ఖచ్చితంగా ఆ పాండురంగని కృప వారిపై వర్షిస్తుందని, వ్యసనం నుండీ బయటపడే దైర్యం , మానసిక స్థైర్యం దైవబలం వల్ల చేకూరుతుందని ఇక్కడివారి బలమైన విశ్వాసం .  

రాయదుర్గం, ఉంతకల్లు లోని ఈ  పాండురంగ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం, మీకు సమయముంటే, రాయదుర్గం కోట, అందులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చూడవచ్చు. 

ఇలా చేరుకోవచ్చు: 
రాయదుర్గ లో రైల్వే స్టేషన్ ఉంది . ఇక్కడి నుండి ఆటోలో ఎక్కి సమీపాన ఉన్న ఉంటకళ్ (ఉంతకల్లు) పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. బళ్లారి నుండి వచ్చేవారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయదుర్గం వరకు చేరుకొని, అక్కడి నుండి ఉంటకల్  దేవాలయానికి వెళ్ళవచ్చు. రోడ్డు మార్గంలో వచ్చేవారికి కూడా రాయదుర్గం వరకూ అన్ని ప్రధాన పట్టణాల నుండీ బస్సులు అందుబాటులో ఉంటాయి . 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore