పాండురంగని దీక్ష గురించి విన్నారా ?
పాండురంగని దీక్ష గురించి విన్నారా ?
లక్ష్మీరమణ
పాండురంగడు నడుముకి రెండు చేతులూ ఆనించుకుని ఠీవిగా నిలబడి ఉంటాడు . మహారాష్ట్ర వైభవమంతా ఆ పాండురంగ విఠలుని భక్తిలోనే దాగుంది. విఠలుడు,రుక్మిణి సమేతుడై చంద్రభాగానది (భీమా నది) ఒడ్డున వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆ అనుగ్రహము సామాన్యమైనది కాదు . కాదు ఎందరికో సశరీరదర్శన భాగ్యము,మోక్ష భాగ్యమిచ్చి జన్మరాహిత్యము చేసిన లీలారూపుడు. ఆయన భక్తుల్లో తుకారాము మీరాబాయి బహుశా మనకి తెలుగులో వచ్చిన సినిమాల వల్ల బాగా పరిచయమయ్యారేమో ! కానీ ఇటువంటివారు ఆ నేలలో చాలామంది ఉన్నారు .
ఆ విఠలుని ఆశ్రయించి, ఆయనే జీవితంగా బ్రతికిన భక్తుల కథలు, అనుభవాలు తెలుసుకుంటుంటే, భగవంతుని సత్యం కనులముందు మెరుపులా మెరిసి, శరీరం రోమాంచితం అవుతుంది . ఈ భక్తులు మధుర భక్తిలో లీనమై , పాండురంగని ప్రేమని పూర్తిగా ఆస్వాదించారు. వారు ఆ స్వామిని కీర్తిస్తూ మరాఠీలో రాసిన కీర్తనలను అభంగాలు అంటారు . ఈ అభంగాలు మరాఠీయుల జీవనములొ ఒక భాగమయ్యాయింటే అతిశయోక్తికాదు. ఈ అభంగాలన్ని ఎవరొ ఓకరు కృతి చేసినవి కావు. అనేకమంది భక్తులు వివిధకాలాల్లొ బాల,స్త్రీ,పురుష,కుల మత ప్రసక్తి లేకుండా చేసినవి.ఈ భక్తులను అనుసరించి కాలగమనములో వర్కారి సాంప్రదాయము అని ఏర్పడింది.
వర్కరీ సంప్రదాయం అంటే విఠలుని దీక్ష తీసుకోవడం లాంటిది. రాధా కృష్ణుల భజనలతో కాలక్షేపం చేస్తూ , పండరినాధుని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ పెద్ద ఎత్తున జరిగే భజనలు చూసితీరాలి . చాలా గొప్పగా ఉంటాయి . షాడ శుద్ధ ఏకాదశీ నాడు, కార్తీక శుద్ధ ఏకాదశీ పర్వదినాలలో అయితే, పండరీపురం భక్తులతో కిటకిటలాడుతుంది . ఇంకా సంవత్సరానికో, నెలకో ఒకసారి ఖచ్చితంగా విఠలుని భక్తులు పండరీయాత్ర చేస్తారు . ఈ యాత్రకి వర్కరీ యాత్ర అని పేరు .
దాదాపు మనకు పాండురంగ భక్తులంటే తుకారాం,సక్కుబాయిలు మాత్రమే తెలుసు కాని ఇంక ఎందరొ మహానుభావులు వున్నారు.
వారు ఙ్ఞానేశ్వర్(ఙ్ఞానదేవ్),సంత్ నామదేవ్,జనాబాయి,సవతిమాలి,చోఖామేళా,నరహరి సొనార్,గోరా కుంభార్,రాకా కుంభార్,సంత్ జీ పవార్,జగమిత్ర నాగ,సేన నహ్వీ, కనహొ పాత్ర,భానుదాస్,జనార్ధన స్వామి,సంత్ ఏకనాధ్,మంకోజీ బోద్లే, సంత్ తుకారాం,సమర్ధ రామదాస్ స్వామి,లతిబ్ షా, షేక్ మహమ్మద్,సక్కుబాయి,నీలోబా మక్సారే.. వీరందరు గణుతికెక్కిన భక్తులు.
ఇంకా ఆశ్చర్యకరమయిన విషయము బ్రిటిష్ కాలములో వీరి మహిమలు,వీరి జీవనము రికార్డులలోకలవు. వీరందరి కాలము 1250 నుంచి 1650 మధ్య వున్న 400 సంవత్సరాలు. అంటే దాదాపు 500 ఏళ్ళ క్రితం పాండురంగడు వీళ్ళకి స్వయంగా కనిపించి , అనుగ్రహించాడు . అద్భుతంకదా ! ఈ విషయం విన్నాక ఆ, తెలుసుకున్నాక, భగవంతుని పైన భక్తి మరింతగా పెరిగినట్టు , ఆయన కృపని పొందడం సులభమే అనీ అనిపించడం లేదూ !
పండరీపురం షోలాపూర్ జిల్లాలో ఉంది. రుక్మిణీ సమేతంగా వెలసిన పండరినాధుని దర్శనానికి ఖచ్చితంగా వెళ్ళిరండి. ఆయన అనుగ్రహం కోట్ల ధనరాసులకన్నా , ఇతరత్రా కోరికలకన్నా చాలా గొప్పది . దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుండీ షోలాపూర్ కి రైలులో వెళ్లొచ్చు . హైదరాబాద్ , విజయవాడ నుండీ బస్సులు కూడా నడుస్తూ ఉంటాయి . షిరిడీకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి , అటు గురువు దర్శనం, ఇటు భగవంతుని దర్శనం ఒకేసారి అవుతాయి . అలా ప్లాన్ చేసుకోండి మరి !!