ఈ సుబ్రహ్మణ్యుడి సడి ఇక్కడ నిత్యం వినిపిస్తుంది
సూర్యతేజో సంపన్నమైన ఈ సుబ్రహ్మణ్యుడి సడి ఇక్కడ నిత్యం వినిపిస్తుంది .
-లక్ష్మీ రమణ
బద్ధవైరులైన పాము, ముంగిస, నెమలి కలిసి ఆడుకుంటున్న ఆ ప్రదేశాన్ని చూసి అగస్త్యుడు ఆశ్చర్యపోయారు . దానికి కారణం ఏమిటాఅని ఆలోచిస్తున్న ఆయన కంటికి దివ్యమైన ప్రభలు విరజిమ్ముతున్న ఒక పుట్ట కనిపించింది . సామాన్య మానవులు తమ కంటితో చూసి భరించలేని సూర్య ప్రభలు విరజిమ్ముతున్న ఆ పుట్టని చూసి ఆ మునీశ్వరుడు రెండుచేతులూ జోడించి నమస్కారం చేశారు . అక్కడ సర్పరూపమై తపస్సు చేసుకుంటున్న ఆ సుబ్రహ్మణ్యుడు ఆయనని ఆశీర్వదించాడు . అప్పుడు అర్థమయ్యింది అగస్త్యునికి బద్ధవైరులైనవారు సఖ్యంగా కలిసి మెలిసి ఆడుకుంటూ ఉండడంలోని ఆంతర్యం . ఇప్పటికీ ఈ కేత్రాన్ని దర్శిస్తే, సంతానం కలుగుతుందని, వివాహం జరుగుతుందని, ప్రతీతి .
స్థలపురాణం :
స్కాందపురాణం లోని సహ్యాద్రిఖండం లో కృష్ణానదీ మహాత్మ్యము, ఇతర క్షేత్రములను వివరించే సందర్భంలో మోపిదేవి క్షేత్ర ప్రశంస కన్పిస్తోంది. అగస్త్యమహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్టవలసి వచ్చింది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి, ఆకాశంలోకి చొచ్చుకొనిపోయి, సూర్య గమనాన్ని సైతం నిరోధించ సాగింది. ప్రకృతి స్థంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపోయాయి.ఈ మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్యమహర్షి మాత్రమేనని భావించిన బ్రహ్మాది దేవతలు అగస్త్యమహర్షికి , విషయాన్ని వివరించారు. యోగదృష్టితో సర్వము నెరింగిన మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితే కల్పాంతమైనా తిరిగి కాశీకి రావడానికి వీలుపడదని తెలిసి కూడ లోకశ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమరకార్యానికి అంగీకరించాడు. లోపాముద్రా సహితుడై దక్షిణాపథానికి బయలుదేరాడు అగస్త్యమహర్షి. దారిలో నున్న వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరించింది. తాను మరలి వచ్చే వరకు అలాగే ఉండమని శాసించి, కాశీ విశాలాక్షీ, విశ్వనాథులను మనసులో నిలుపుకొని, దక్షిణాపథం వైపు బయలుదేరారు అగస్త్యుడు.
పవిత్ర గోదావరీ ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణాతీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని దర్శించుకొని వ్యాఘ్రపురం (పులిగడ్డ) చేరుకున్నారు. “వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమమ్ సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదమ్” అనేమాట అప్రయత్నంగా మహర్షి గళం నుండి వెలువడింది.
ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండివుంది. లోపాముద్రా దేవి, శిష్యబృందము ఆయన ననుసరించారు. ఒకపుట్టనుండి దివ్యతేజస్సుని గమనించి, ఇదే “సుబ్రమణ్య క్షేత్రమని ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని “శిష్యులకు వివరించాడు అగస్త్యుడు. కుమారమూర్తికే సుబ్రమణ్యమని పేరని మాండవ్యుడనే శిష్యుని సందేహాన్ని నివృత్తి చేశాడు. కుమారస్వామి ఉరగ (పాము) రూపం లో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిష్యులకు వివరించారు అగస్య్తమహర్షి.
“సనక,సనకస,సనత్కుమార సనత్సు జాతులనెడి దేవర్షులు ఎప్పుడూ ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు, పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ భగవదారాధనలోనే కాలం గడుపుతుంటారు. వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు. ఆ సమయం లో పరమేశ్వరుడు కైలాసంలో లేడు. లోకమాత పార్వతి,కుమారస్వామి కొలువు తీరి ఉన్నారు. అదేసమయంలో శచీ,స్వాహా మొదలైన దేవతాస్త్రీలు, లక్ష్మీ సరస్వతులు, పార్వతీ దేవి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు రంగు రంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూచి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోయాడు.
“ కుమారా! నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ? ఆ స్త్రీ మూర్తులు నాలా కన్పించలేదా? ఆ తాపసులు మీ తండ్రిలాగా లేరా? భేదమేమైనా కన్పించినదా ?” యని జగదంబ కుమారుని ప్రశ్నించింది . ఆ ప్రశ్న విన్న కుమారస్వామి లోలోన పశ్చాత్తాప పడ్డాడు . తల్లి పాదాలపై బడి క్షమాపణ కోరుకున్నాడు. తల్లి కాదన్న వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపం తో తపస్సు ప్రారంభించాడు.
ఈ విషయాన్నంతటిని దివ్యదృష్టితో చూచి శిష్యుల కెరింగించిన అగస్త్యుడు మహాతేజస్సు వచ్చే పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. పడగవలే ఉండే శివలింగాన్ని దివ్యతేజస్సు వచ్చే పుట్టమీద ప్రతిష్టించాడు. ” అత్రస్నానం తు కుర్యాచ్చేత్కోటి జన్మాఘ నాశనమ్, “ .... అని కృష్ణానది లో స్నానం చేసి లోపాముద్ర తో కలసి శిష్యసమేతంగా శివలింగానికి పూజలు నిర్వహించారు అగస్త్యమహర్షి.
కాలాంతరంలో ఆ ప్రదేశమంతా పుట్టల తో నిండిపోయింది. ఆ పుట్టలున్న ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్తులు కులవృత్తి తో జీవిస్తుండేవారు. వారిలో వీరారపు పర్వతాలు ఒకరు . ఈతను మహాభక్తుడు. అతనికి స్వామికలలో కన్పించి, తాను ఎక్కడున్నది చెప్పి, లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి , ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడు. పర్వతాలు తన స్వప్న వృత్తాంతాన్ని తనవారందరికి చెప్పి, దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించాడు. తనవృత్తిని స్వామికి అంకితం చేశాడు. మట్టితో స్వామికి ఇష్టమైన వాటిని తయారు చేసి, వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరచేవాడు. అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మత్తుల సమయంలో శిథిలమై పోగా మిగిలిన నంది,గుర్రము ఈనాటికీ స్వామి వారి కళ్యాణమండపంలో భద్రంగా ఉండి, భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని తొలిరోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్లని, కాలక్రమేణా అది మోపిదేవి స్ధిరపడిందని చెపుతారు.
ఆలయప్రత్యేకత.:
స్వామివారి ఆలయం తూర్పుదిశగా ఉంటుంది. గర్భగుడిలో పాము చుట్టల మీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం. స్వామికి వేరే పానమట్టం ఉండదు. పానమట్టం క్రింద అందరికీ కనబడే విధంగా లోపలికి ఒక రంధ్రం ఉంటుంది. అర్చన ,అభిషేక సమయాల్లో ఆ రంధ్రంలో పాలుపోయడం జరుగు తుంది. ఆలయప్రదక్షిణమార్గంలో ఉన్న పుట్టనుండి గర్భగుడిలోకి దారి ఉన్నట్లు, ఆ దారి నుండే దేవతాసర్పం పయనిస్తుందని భక్తుల విశ్వాసం. ఇప్పటికీ ఇక్కడ ఆ సుబ్రహ్మణ్యుని సడి భక్తులకి వినిపిస్తుందని, అదృష్టవంతులకి దర్శనభాగ్యం దొరుకుతుందని ప్రతీతి .
ఇక్కడ స్వామివారి ఆలయంలో పుట్టలో పాలుపోయడం విశేషసేవ గా భక్తులు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించడం, చూపు మందగించినవారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం,మనోవ్యాధి, చర్మసంబంధవ్యాధులను నశింపజేయడం, విద్యాభివృద్ధి సకలసంపదలను సమకూర్చడం మొదలైన ఎన్నో మహిమలను స్వామి అందిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్ముతున్నారు.
స్వామి వారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీరమ్రొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైన మొక్కులు తీర్చుకుంటారు. నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమౌతున్న యువతులు ప్రత్యేకపూజలు జరిపించుకుంటారు.
భారత దేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి ఒకే చోట కొలువై ఉన్నాడు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారత దేశంలో మరెక్కడా లేదు.
ఇలా చేరుకోవచ్చు .
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మోపి దేవి క్షేత్రాన్ని చేరుకోవడానికి నిత్యం బస్సు సర్వీసులు ఉన్నాయి.
గుడివాడ లేదా విజయవాడకు రైలు సౌకర్యం ఉంది . అక్కడినుండి మోపిదేవికి బస్సులు అందుబాటులో ఉంటాయి .
దగ్గరి విమానాశ్రయం గన్నవరం .