కార్యసిద్ధి గణపతి క్షేత్రం .
మహా మహిమాన్వితుడైన కార్యసిద్ధి గణపతి క్షేత్రం .
- లక్ష్మి రమణ
విఘ్నేశ్వరుడు (Vighneswara) కార్యసిద్ధి (karya Siddi) దాయకుడు. అయన దర్శనం, అర్చనం అనంతమైన ఫలాన్ని అనుగ్రహించే విశేషాలు. అందుకే మన పెద్దలు ప్రధమ పూజ్యునిగా గణపతిని ఆరాధించాలని నిర్దేశించారు. గణపతి (Ganapati) దేవాలయాల్లో ఏటా పెరిగే స్వయంభువులైన వినాయకులు తెలుగు నేల మీద ఇద్దరే ఇద్దరున్నారు. ఒకరు కాణిపాకం (Kanipakam) సిద్ధి వినాయకుడైతే, (Siddi Vinayaka) రెండవ గణపతి విశాఖపట్నంలోని చోడవరంలో ఉన్న కార్యసిద్ధి వినాయకుడు. చోడవరంలో వినాయకునికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మహా మహిమాన్వితుడని, ఆర్తుల పాలిటి కొంగుబంగారమని విశ్వశించే ఈ గణపతిని క్షేత్రాన్ని దర్శిద్దాం రండి.
విశాఖజిల్లా (Vizag District) చోడవరం (Chodavaram) లోని వెలసిన చోడవరం గణపతి దేవాలయంకి (Ganapati Temple) కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. చోడవరానికి తూర్పు ముఖంలో వున్న ఈ ఆలయాన్ని సుమారు 600 సంవత్సరాల క్రితం మత్స్యవంశపు రాజులు నిర్మించినట్లు చెబుతారు. ఈ ఆలయంలో గర్భగుడి ద్వారంపైనా తలపైభాగంలో చేప చిహ్నాలు ఉండడంతో ఈయనని మత్స్యగణపతిగానూ పేర్కొంటారు.
గణపతి ఆవిర్భావం:
ఈ సిద్ధి వినాయకుని ఆవిర్భావ ఘట్టాన్ని ఆవిష్కరించడం సామాన్యమైన విషయం కాదు. మత్స్యవంశపు రాజులు పరిపాలిస్తున్న ఆ కాలంలో ఒక సారి విపరీతమైన కరువొచ్చి పడింది. ఆ కరువు నుండీ బయటపడడానికి ఒక చెరువు తవ్వించాలని ఆ రాజు ఆలోచించారు. ఇప్పుడున్న చోడవరం నడిబొడ్డున ఎకరాల కొద్దీ ఉన్న ఖాళీ స్థలంలో ఆ చెరువు తవ్వించాలని ఆయన సంకల్పం. సరే, రాజు తలచుకుంటే దెబ్బలకి కొదవేముంది ? వెంటనే పలుగులు పారలు పట్టుకొని పనివాళ్ళు చెకచెకా తవ్వడం మొదలుపెట్టారు.
కానీ, నీరు ఉబకాల్సిన ఆ తవ్వకంలో నెత్తురు పొంగడం మొదలెట్టింది. ఎర్రటి నీరు ఆ ప్రాంతాన్నంతా చిత్తడిగా మార్చేసింది. ఆ ఎర్రటి నీరు ఉబుకుతోంది ఒక పొడవాటి ఏనుగు తొండం వంటి శిల నుండీ అని గమనించిన ఆ ఊరి పూజారిగారు ఆ శిలని జాగ్రత్తగా తీయించారు. అప్పుడందరికళ్ళకీ కనిపించాడు మహా లంబోదరుడైన ఈ సిద్ధి గణపతి.
తనకి అక్కడే గుడి కట్టమని ఆ రాజుగారికి కలలో అనుగ్రహించడంతో చోడవరంలో మత్స్య వంశీయులు ఈ గణపతి ఆలయాన్ని నిర్మించారని స్థానిక గణపతి ఆవిర్భావ కథనం.
వింత ఆచారం :
గణపతి ఉత్సవాల్లో ఈ ఆలయాన్ని దర్శించడానికి వచ్చే భక్తుల కాళ్ళు రక్తసిక్తాలై పోతాయి. ఎందుకంటె, గణపతిని వెలికి తీసినప్పుడు ఆయన రక్తం చిందారు. కాబట్టి ఆయన ఆవిర్భవించిన వినాయక చవితినాడు ఈ ఆలయంలో పల్లేరుకాయలు పరుస్తారు. గతంలో పల్లేరుకాయలు నీగుడిలో పరిపిస్తామని స్థానికులు మొక్కులు కూడా మొక్కుకునేవారట. అయితే, కాలంతో పాటు ఈ పద్ధతిని ఆచరించేవారు కూడా తగ్గిపోయారు. కాంక్రీటు మయమైపోతున్న ఈ ప్రాంతంలో అంతలా పల్లేరు చెట్లు , పల్లేరు కాయలూకూడా కనుమరుగుగై పోతున్నాయని చెప్పాలి.
స్వామి దర్శనం :
ఆంధ్ర రాష్ట్రంలో స్వయంభూ విఘ్నేశ్వరాలయాలు ఉన్న క్షేత్రాలు రెండే రెండు. ఒకటి చిత్తూరు జిల్లా కాణిపాకంలో ఉండగా రెండవది విశాఖ జిల్లా చోడవరంలో ఉంది. ఇక్కడి విఘ్నేశ్వరుని విగ్రహము నడుము పై భాగము మాత్రమే దర్శనమిస్తుంది. తొండం చివరి భాగం పైకి కనిపించదు. ఈ విగ్రహం ఏటేటా పెరుగుతుందని ప్రతీతి. ఈ స్వామిని దర్శించిన వారికి సర్వకార్య సిద్ధి కలుగుతుందని, కామ్యములన్ని అనుగ్రహించి కాపాడే వరదుడని పేరు.
ఇలా చేరుకోవాలి : ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నానికి చేరుకోవడానికి అన్ని ప్రధాన పట్టణాల నుండీ రైలు, విమాన, బస్సు సౌకర్యాలున్నాయి. అక్కడి నుండి చోడవరానికి రోడ్డు మార్గంలో తేలికగా చేరుకోవచ్చు.
శుభం .
Chodavaram Karyasiddi Ganapati Temple
#ganapati #ganesa #ganesha #ganapathi #vinayaka #Vighneswara #Vighneshwara