అపూర్వ మహిమాన్వితాలైన అష్ట వినాయక క్షేత్రాలు.
అపూర్వ మహిమాన్వితాలైన అష్ట వినాయక క్షేత్రాలు.
సేకరణ
అష్ట వినాయక క్షేత్రాలు దర్శిస్తే సకలకష్టాలు తొలగి, సర్వసుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రండి ఆ క్షేత్ర దర్శనాన్ని ఈ అక్షరాలతో చేద్దాం.
మయూరగణపతి క్షేత్రం: (Mayura Ganapati)
ఈ క్షేత్రం బారామతి తాలూకాలోని ‘మోర్ గావ్’ గ్రామంలో ఉంది. ఈ క్షేత్రంలో ఉండే వినాయకుని ‘మయూరేశ్వర్’ అని పిలుస్తారు. నిజానికి వినాయకుని వాహనం ఎలుక కదా. కానీ, ఇక్కడ వినాయకుని వాహనం మయూరం (నెమలి). పూర్వం సింధురాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలోని ప్రజలను, మునులను, దేవతలను నానా కష్టాలు పెడుతూంటే.., వారు రక్షించమని వినాయకుని ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు మయూరవాహనం మీద వచ్చి ఆ రాక్షసుణ్ణి సంహరించి అందరికీ ఆనందం కలిగించాడు. ఇక్కడి వినాయకుడు మయూరవాహనం మీద భక్తులకు దర్శనమిస్తాడు. అందుకే ఈ స్వామిని ‘మోరేశ్వర్’ (Moreswar) అని పిలుస్తారు. హిందీభాషలో మోర్ అంటే ‘నెమలి’. అరణ్యవాస కాలంలో పాండవులు ఈ స్వామిని పూజించారని, వారు పూజించిన అసలైన వినాయక విగ్రహం, ప్రస్తుతమున్న విగ్రహానికి వెనుక ఉన్నదనీ స్థానికులు చెప్తారు. ఈ ఆలయం చూడడానికి హిందూ ఆలయంలా కాక నాలుగువైపులా మినార్లతో మసీదులా కనిపిస్తుంది. తురుష్క చక్రవర్తుల దాడుల నుంచి కాపాడడం కోసం ఈ ఆలయాన్ని అలా కట్టారనీ, బహమనీయుల కాలంలో ఈ ఆలయం నిర్మించబడిందనీ చరిత్రకారులు చెప్తారు. ఈ క్షేత్రంలో వినాయకచవితినాడు, విజయదశమినాడు ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి.
సిద్ధివినాయక క్షేత్రం: (Siddi Vinayaka)
ఈ క్షేత్రం అహ్మదునగర్ జిల్లాలోని ‘శ్రీగొండ’ పట్టణానికి సమీపంలోనున్న చిన్న కొండ మీద ఉంది. ఈ ఆలయాన్ని పేష్వాలు నిర్మించారు. సాధారణంగా వినాయకుని తొండం ఎడమచేతి వైపు వొంగి ఉంటుంది. కానీ, ఇక్కడి వినాయకుని తొండం మాత్రం కుడిచేతి వైపుకు వొంగి ఉంటుంది. అదే ఈ వినాయకుని ప్రత్యేకత. ఇక్కడి వినాయకుడు సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. పూర్వం మధు,కైటభులనే రాక్షసులను సంహరించడం కోసం శ్రీమహావిష్ణువు ఈ వినాయకుని సహాయం తీసుకున్నాడనీ, అందుకు కృతఙ్ఞతగా శ్రీమహావిష్ణువే స్వయంగా ఈ లంబోదరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి, ఆలయం నిర్మించాడనీ స్థలపురాణం చెప్తుంది. ఈ ఆలయానికి ఒక్క ప్రదక్షిణ పూర్తి చేయాలంటే సుమారు అరగంట సేపు కొండ చుట్టి రావాల్సిందే. అయినా కోరిన కోరికలు తీర్చే కార్యసిద్ధి గణపతి కనుక భక్తులు ఎంతో భక్తిగా గిరి ప్రదక్షిణం చేసి తమ మొక్కులు తీర్చుకుంటారు.
బల్లాలేశ్వర క్షేత్రం: (Ballaleswara)
ఈ క్షేత్రం ‘పాలి’ అనే గ్రామంలో ఉంది. పూర్వం ఈ గ్రామం పేరు ‘పల్లిపుర్’. ఈ గ్రామానికి చెందిన కల్యాణ్ సేఠ్ కుమారుని పేరు ‘బల్లాల్’. ఇతను గొప్ప వినాయక భక్తుడు. బల్లాల్ తన స్నేహితులతో కలసి అడవికి వెళ్లి అక్కడున్న రాతి వినాయకుని పూజించి, రోజూ ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడట. అతని స్నేహితుల తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకుని కల్యాణ్ సేఠ్ కు ఫిర్యాదు చేసారు. కోపం వచ్చిన సేఠ్ ‘బల్లాల్’ను అడవికి తీసుకునివెళ్లి, అతన్ని చెట్టుకి కట్టి స్పృహతప్పేలా చావకొట్టి, ఆ రాతివిగ్రహాన్ని విసిరేసి వెళ్లిపోయాడు. ఆపస్మారకస్థితిలో ఉన్న బల్లాల్, వినాయకుని ప్రార్థించాడు. వినాయకుడు వచ్చి బల్లాల్ కట్లువిప్పి విడిపించి, ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. ‘ఈ రాతిలోనే నువ్వు ఉండాలి’ అని కోరుకున్నాడు. భక్తుని కోరిక మేరకు వినాయకుడు ఆ రాతివిగ్రహంలో ఐక్యమయ్యాడు. ప్రస్తుతం ఆలయంలోనున్న విగ్రహం అదే. ముందు ఈ ఆలయాన్ని చెక్కలతో నిర్మించారు. ఈ ఆలయం వెనుక దుండి వినాయకును విగ్రహం ఉంటుంది. అదే బల్లాల్ తండ్రి విసిరిపారేసిన రాతి వినాయకవిగ్రహం. భక్తులు ముందుగా దుండి వినాయకుని దర్శించాకే ప్రధాన ఆలయంలోని వినాయకుని దర్శిస్తారు. బల్లాల్ కోరిక మేరకు వెలిసిన ఈ వినాయకుని ‘బల్లాలేశ్వర్’ అని పిలుస్తారు.
వరదవినాయక క్షేత్రం: (Varada Vinayaka)
పుణె నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలోని ‘మహద్’ గ్రామంలో వెలిసిన ఈ గణపతిని ‘వరదవినాయకుడు’ అంటారు. పూర్వం ఈ ప్రాంతాన్నిరుక్మాంగదుడు అనే రాజు పాలించేవాడు. ఒకరోజు రుక్మాంగదుడు భార్యా సమేతుడై ఈ గ్రామంలోని ‘వాచక్నవి’ దర్శనార్థం వచ్చాడు. ఋషిపత్ని మహారాజుని చూసి ముచ్చటపడుతుంది. మహారాజు ఆమె కోరికను సున్నితంగా తిరస్కరించి వెళ్లిపోయాడు. ఈ సంగతి తెలిసి ఇంద్రుడు మహారాజు రూపంలోవచ్చి ఋషిపత్నితో కలుస్తాడు. ఆ కారణంగా ‘గృత్సమధుడు’ అనే పుత్రుడు కలుగుతాడు. అతను పెరిగి పెద్దవాడయ్యాక, తన జన్మరహస్యం తెలుసుకుని వినాయకుని గురించి తపస్సు చేపాడు. వినాయకుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘అందరి పాపాలు పోయేలా నువ్వు ఇక్కడ ఉండాలి’ అని కోరాడు. అతని భక్తికి మెచ్చి వినాయకుడు అక్కడ స్వయంభువుడుగా వెలిసాడు. అదే వరదవినాయక క్షేత్రం. ఈ ఆలయంలోని దీపం 1892 నుంచీ అఖండంగా వెలుగుతూనే ఉండడం విశేషం. ఈ స్వామిని భక్తులు స్వయంగా తాకి, అర్చనలు చేసుకోవడం ఈ ఆలయం ప్రత్యేకత.
చింతామణి గణపతి క్షేత్రం: (Chintamani Ganapati)
పుణెకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘థేవూర్’ గ్రామంలో ఈ క్షేత్రం ఉంది. ఈ గ్రామంలో ఒకప్పుడు కపిల మహాముని కొంత కాలం తపస్సు చేసాడట. ఆయన దగ్గర భక్తుల కోరికలు తీర్చే ‘చింతామణి’ అనే మణి ఉంది. ఓసారి ఈ ప్రాంతాన్ని పాలించే అభిజిత్ మహారాజు కుమారుడు ‘గుణ’ కపిలమహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ మణి ప్రభావాన్ని గుర్తించి, ఆ మణిని అపహరించాడు. కపిలమహర్షి గణపతి సాయంతో ఆ రాజును జయించి ఆ మణిని తిరిగి పొంది దాన్ని గణపతి మెడలో అలంకరిప్తాడు. అప్పటి నుంచి ఈ గ్రామం ‘కదంబనగర్’ గానూ.., ఈ స్వామి ‘చింతామణి గణపతి’ గానూ ప్రసిద్ధి పొందాడు. ఈ ఆలయాన్ని పేష్వాల కాలంలో నిర్మించారు.
గిరిజాత్మజ్ వినాయక క్షేత్రం:(Giritatmaja Vinayaka)
పుణెకు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘లేన్యాద్రి’ పర్వతంమీద బౌద్ధగుహల మధ్యన ఉన్న ఆలయమే ‘గిరిజాత్మజ్ వినాయక ఆలయం’. పార్వతీదేవి సంతానం కోసం ఇక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాతే నలుగుపిండితో చేసిన బాలగణపతికి ప్రాణం పోసిందనీ, తనకు కౌమారప్రాయం వచ్చేవరకూ గణపతి తన తల్లితో కలిసి ఇక్కడే ఉన్నడనీ పౌరాణిక ప్రమాణం. ఈ గణపతి అచ్చు నలుగుపిండితో చేసినట్టే…రూపురేఖలు స్పష్టంగా కనిపించకుండా ఉంటాడు. ఈ గణపతిని దర్శించాలంటే 307 మెట్లు ఎక్కాలి. స్తంభాలు లేకుండా కేవలం ఏకశిలనే ఆలయంగా మలిచి మెట్లు నిర్మించారు. విద్యుద్ధీపాల అవసరం లేకుండా పగటివేళలో సూర్యకిరణాలు ఆలయంలో పడేలా నిర్మించడంచేత ఈ స్వామిని సుఖంగా దర్శించకోవచ్చు. అదే ఈ ఆలయం ప్రత్యేకత.
విఘ్నహార్ వినాయక క్షేత్రం (Vighnahar Vinayaka)
ఓఝూర్ పట్టణంలో కుకడి నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలోని వినాయకుడు …సిద్ధి, బుద్ధి సమేతుడై కొలువుతీరి ఉంటాడు. పూర్వం ఈ ప్రాంతంలో విఘ్నాసురుడు అనే రాక్షసుడు మునులను హింసిస్తూంటే.., వారు వినాయకుని ప్రార్థించగా..ఆ ఏకదంతుడు చాలా కాలం ఆ రాక్షసునితో యుద్ధం చేసాడు. వినాయకుని గెలవడం తనవల్ల కాదని గ్రహించిన ఆ రాక్షసుడు వినాయకుని శరణుకోరి, తన పేరుమీద నీవు ఇక్కడే కొలువుతీరాలనీ వేడుకున్నాడు. వినాయకుడు అతని కోరిక తీర్చాడు. అందుకే ఈ స్వామిని ‘విఘ్నహార్ వినాయక్’ అని అంటారు. అప్పట్లో ఈ స్వామికి మునులే ఆలయం కట్టించారు. తరువాతి కాలంలో ‘చిమాజి’ ఆ ఆలయాన్ని పునర్నిర్మించాడు. బంగారుపూతతో మిలమిల మెరిసే ఈ ఆలయశిఖరం చూపరులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
మహాగణపతి క్షేత్రం (Maha Ganapati)
‘రంజన్ గావ్’గా పిలవబడే ఈ గ్రామంలో కొలువున్న ఈ వినాయకుడినే ‘మహాగణపతి’గా భావించి కొలుస్తారు. త్రిపురాసుర సంహార కాలంలో పరమేశ్వరుడే ఈ గణపతిని తలచుకుని యుద్ధం చేసి వారిని సంహరించాడు. అందుకు ప్రతిగా శివుడే ఈ ‘మహాగణపతిని’ ఇక్కడ ప్రతిష్ఠించాడనీ…గణేశపురాణం చెబుతుంది. దక్షిణాయనంలో సూర్యకిరణాలు నేరుగా ఈ విగ్రహంమీద పడేలా ఈ ఆలయం నిర్మించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. 18 వ శతాబ్దంలో పేష్వాలు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. సిద్ధి, బుద్ధి సమేతుడై పద్మంలో కొలువు తీరివుండే ఈ వినాయకుడి విగ్రహానికి క్రింది భాగంలో పది తొండాలు, ఇరవై చేతులు గల ‘మహోత్కట్’ వినాయకుని విగ్రహం ఉందని భక్తులు చబుతారు గానీ.. అది నిజం కాదని ఆలయ ధర్మకర్తలు చెప్తారు.
ఈ ఎనిమిది వినాయక క్షేత్రాలలోనూ అర్చనలు, అభిషేకాలు, ప్రసాద వితరణలు ఒకే విధంగా ఉంటాయి. ఈ క్షేత్రం దర్శించుకున్నాక తిరిగి ‘మయూరేశ్వరుని’ దర్శిస్తేనే ఈ యాత్ర పూర్తయినట్లు అని భక్తులు గ్రహించాలి.
శుభం !!
Asta Vinayaka Kshetra, Ganapathi Temples
#astavinayaka