చదువులో గొప్ప ఫలితాలు సాధించడానికి
చదువులో గొప్ప ఫలితాలు సాధించడానికి ఈ ఆలయాన్ని దర్శించండి .
- లక్ష్మి రమణ
విఘ్నాలు తొలగి బాగా చదువు రావాలంటే విజ్ఞాన గణపతిని పూజించాలి. అనసూయదేవి పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి త్రిమూర్తులు రావడం, అనసూయ వారిని పసిబిడ్డలుగా మార్చి లాలించడం ఒక అద్భుతమైన గాధ. ఆమె పాతివ్రత్యానికి మెచ్చిన త్రిమూర్తులు ఆమెని వరం కోరుకోమన్నారు. ఆ దంపతుల కోరిక పైన త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు వారికి జన్మించాడు. ఆయన ఎన్నో మహిమలను చూపారు. సద్గురుడైన ఆ త్రిమూర్తి స్వరూపుడు స్వయంగా విద్యార్థుల కోసం విజ్ఞాన గణపతిని ఈ ఊరిలో ప్రతిష్టించారు . ఈ గణపతిని దర్శించుకుంటే, అర్చించుకుంటే, వారికి విఘ్నాలు తొలగిపోయి బాగా చదువు వస్తుంది. ఎందరో విద్యార్థులు ఇక్కడికి వచ్చి సత్ఫలితాలు పొందారని చెబుతారు.
విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరగడానికి బాగా చదువుకోవడానికి చదివింది గుర్తుండడానికి చక్కగా పరీక్షలు రాయడానికి చదువుకు సంబంధించిన ఏ సమస్యనైనా విజ్ఞాన గణపతి పరిష్కరిస్తారట. విజ్ఞాన గణపతిని ఆరాధించి చదువులలో ఎదగవచ్చని భక్తుల విశ్వాసం. ఇక్కడి గొప్ప విశేషం ఏమిటంటే , జగద్గురువు అయినా దత్తాత్రేయులవారు , జ్ఞానానికి అధిదైవంగా గణపతిని ప్రతిష్ఠ చేయడం . ఇక్కడ ఆ గురువే, గురువుని ప్రతిష్ఠ చేశారు. అందువల్ల ఇది చాలా మహిమాన్వితమైన , జ్ఞానదాయకమైన క్షేత్రం నిస్సందేహంగా !!
ఋషులు తపస్సు చేసిన పవిత్ర ప్రాంతం రాక్షసభువనం. మహారాష్ట్రలో భీడ్- షాగడ్ ల మధ్య ఉన్న ఒక చిన్న ఊరు ఇది. ఈ ఊరి పక్కనుండి పవిత్ర గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ గోదావరి ప్రవహిస్తుందో అక్కడ వేదం , విజ్ఞానం వర్ధిల్లుతుంది . అందువల్ల ఈ రాక్షసభువనంలోని విఘ్నేశ్వరుణ్ణి దర్శించడం వలన విద్యార్థుల సమస్యలు తీరి చక్కని పరీక్షా ఫలితాలని పొందుతారు. సాధకులు వారు పొందాలనుకున్న ఆధ్యాత్మిక ఉన్నతిని ఈ స్వామి అనుగ్రహం వలన పొందగలుగుతారు.
అంతేకాదు, ఇది అర్ధాష్టమ శని దోషాలు తొలగించే క్షేత్రం కూడా ! ఇక్కడ అగస్త్యుడు తదితర ఋషులు తపస్సు చేస్తూ ఉండగా, వారి దగ్గరకు రామచంద్రుడు వచ్చారు. అర్ధాష్టమ శని నుంచి విముక్తిని పొందే మార్గం చెప్పమని అగస్త్యున్ని శ్రీరాముడు అడిగారు. వాతాపీ ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు తమని బాధిస్తున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పిస్తే అర్ధాష్టమ శని బాధల నుంచి విముక్తి పొందే మార్గం చెబుతానని ఆగస్యుడు అన్నారు. అప్పుడు రాముడు అందుకు అంగీకరించి ఆ రాక్షసులను తరిమేశారు.
ఆగస్యుడు రాముని చేత శని విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి పూజారికాలు నిర్వహించాలని, రామచంద్రుడు శని బాధల నుండి విముక్తిని పొందాడని స్థానిక గాధ చెబుతోంది. ఇది భారతదేశంలోని మొట్టమొదటి శనీశ్వరాలయం ఇక్కడ శనికి అభిషేకం చేస్తే ఆ గ్రహదోషాలు తప్పక తొలిగిపోతాయని చెబుతారు.