కోరిన కోర్కెలు తీర్చే పాతాళ గణపతి
కోరిన కోర్కెలు తీర్చే పాతాళ గణపతి ఏటా పెరుగుతుంటాడు !
- లక్ష్మి రమణ
వినాయకుని రూప విలాసమే అంతుపట్టని ఒక దివ్యత్వానికి ప్రతీక. రూపంలో, శక్తిలో, అనుగ్రహంలో ఆయన తీరే వేరు ! గణపత్యావలంబకులకు ఆయన అనుగ్రహం ఎంతటి అపారమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు . పంచభూతాత్మకమైన గణపతి ఇందుగలడని అందులేడనే సందేహమే వలదు . ఎందెందు వెతికినా , దివ్యమై , భవ్యమై విరాజమానమవుతారు. ఆ విధంగా పాతాళం నుండీ గణపతి వ్యక్తమైన క్షేత్రం పాదగిరి. శ్రీ కాళహస్తిలోనూ పాతాళంనుండీ వ్యక్తమైన గణపతి క్షేత్రం ఉంది . కానీ, పాదగిరి గణపతి కాణిపాక గణపతిలాగా ఏటా పెరుగుతూ ఉండడడం విశేషం . విశేషమైనది, అపూర్వమైది ఈ స్వయంభూ పాతాళ గణపతి వ్యక్తమైన పాదగిరి క్షేత్రం .
పాదగిరిలో ఉన్న పాతాళ వినాయకుణ్ణి శ్రీ లింగాకార గణపతిగా పిలుస్తారు . స్వయంగా శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయకుడే పాదగిరిలో ఇలా పాతాళ వినాయకుడిగా వెలిశాడని స్థానికుల నమ్మిక. ఇక్కడ వినాయకుణ్ణి శరణన్న వారికి కోరిన కోర్కెలు ఫలిస్తాయని , సత్యమున్న దేవుడనే భక్తుల విశ్వాసం . ఇక్కడి వినాయకుడు స్వయంభువుగా వ్యక్తమవ్వడానికి సంబంధించిన స్థానిక ఉదంతం కూడా ఎంతో మహిమాన్వితంగా అనిపిస్తుంది .
స్థానిక గాథ :
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తిరులమల వేంకటేశుడు కొలువై ఉన్నాడు . అదే జిల్లాలోని కుప్పం మండలం, కంగు గ్రామంలో రామచంద్రయ్య అనే హరికథా కళాకారుడు ఉండేవారు . ఆయన వెంకటేశ్వర మహత్యాన్ని గానం చేస్తే, భక్తులు ఆ స్వామి లీలామృతాన్ని గ్రోలి తన్మయులయ్యేవారు. అంతటి భక్తి పారవశ్యంతో నిండిన హరికథా గానం చేసేవారు . ఒకనాటి రాత్రి హరి స్వరూపుడైన వినాయకుడు ఆయనకి స్వామిని దర్శనం ఇచ్చారు. గోపాలకృష్ణపురానికి పడమర వైపున ఉన్న పందిగుట్టూరు గుట్ట ప్రాంతంలో తానూ స్వయంభువుగా వెలిశానని చెప్పారు . పాతాళ గణపతిగా ఉన్న తనకి అక్కడే ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించారు . భక్తి మెండుగా ఉన్న చోట ఇక సంశయాలకీ, సందేహాలకీ తావెక్కడుంటుంది?
తనకి వచ్చిన స్వప్నవృత్తాంతాన్ని రామచంద్రయ్య గ్రామంలోని ప్రజలకు తెలియజేశారు . స్వప్నంలో కనిపించిన అన్వేషణ సాగించిన వారి శ్రమకి ఫలాన్ని అనుగ్రహిస్తూ స్వామి గుట్ట ప్రాంతంలోని ఒక దొన(పాతాళం)లో దర్శనమిచ్చారు . అక్కడ చిన్నగా లింగాకారంలో వక్రతుండ వినాయకుడి రూపం కన్పించింది. భగవంతుడు ప్రకటమయ్యాక ఆయన ప్రభ చాలా వేగంగా ఇతర ప్రాంతాలకి వ్యాపిస్తుంది . సుగంధాన్ని వెదజల్లే అపూర్వ పుష్పం జన్మించాక , దాని ఉనికిని ఆ పుష్ప పరిమళమే స్వయంగా తెలిజేస్తుంది .
వెంటనే పరిసర గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. వక్రతుండుడైన శ్రీ లింగాకార గణపతిని పూజించారు . చక్కని ఆలయాన్ని నిర్మించారు . అప్పటి నుండీ అక్కడ స్వామి నిత్యపూజలు అందుకుంటూ , భక్తులని అనుగ్రహిస్తూ ఉన్నారు .
దక్షిణాభిముఖుడైన గణపతి :
ఈ క్షేత్రంలో స్వామివారు దక్షిణాభిముఖంగా కొలువుతీరడం మరో విశేషం.
ఇలా దక్షిణాభిముఖంగా ఉండే వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకుంటే సర్వపాపాలూ నశిస్తాయని, యమబాధలు ఉండవని పురాణకథనం. ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈ స్వామీ నిత్యమూ కాణిపాక గణపతిలాగా పెరుగుతూ ఉండడం ఇక్కడి మరో విశేషం . వినాయకుడి ఆలయం నిర్మించేనాటికి స్వామివారి విగ్రహ పరిమాణం చిన్నదిగా ఉండేదనీ ప్రస్తుతం ఆ పరిమాణం బాగా పెరిగిందని ఆలయ అర్చకులు తెలియజేస్తున్నారు .
ఏటా ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తారు. స్వామికి ఇష్టమైన బుధవారం రోజున , సంకటాలని తొలగించే , సంకష్టహర చతుర్దశి రోజున ప్రత్యేక అభిషేకాలూ, హోమాలూ నిర్వహిస్తారు.
తిరుమల శ్రీనివాసుడి యాత్ర, శ్రీకాళహస్తి యాత్ర, కాణిపాక వరసిద్ధి వినాయకుని యాత్రకి వెళ్లేవారు ఈ లింగరూప వక్రతుండుని దర్శనానికి వెళ్ళవచ్చు . సమీపంలోనే , నాగదేవత ఆలయం ఉంది. వీరి అనుగ్రహం వలన సంతానం కలుగుతుందని , సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మిక .
ఇలా చేరుకోవచ్చు:
పాదగిరి పాతాళ వినాయకస్వామిని దర్శించుకోవడానికి రైలు రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి నుండీ సుమారు 64 కిలోమీటర్లు, కాణిపాకానికి 7 కిలోమీటర్లు, చిత్తూరుకు 20 కిలోమీటర్ల దూరంలో స్వామివారి ఆలయం ఉంది. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే బస్సులో గోపాలకృష్ణపురం, పందిగొట్టూరు మధ్యలో దిగి కొంతదూరం కాలికనడకన వెళ్లి స్వామి దర్శనం చేసుకోవచ్చు. రైలు మార్గంలో వచ్చే భక్తులు తిరుపతి, చిత్తూరు రైల్వే స్టేషన్లలో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి ఇక్కడికి చేరుకోవచ్చు.
#pathalavinayaka #padagirivinayaka #lingakaraganapati
Tags: pathala Vinayaka, Padagiri, Vinayaka, Pathala, Lingakara, Ganapati,