Online Puja Services

నురగ వినాయకుడి ఆలయం

18.119.124.52

వివాహ సమస్య తొలగించే నురగ వినాయకుడి ఆలయం !
లక్ష్మీ రమణ 

అన్నింటా ఇమిడిపోతాడు గణపయ్య. తానున్న పదార్ధం ఏదైనా, అందులోని పరమార్థమే పరమానందమని అనుగ్రహిస్తుంటాడు. సరేగానీ ఇంద్రుడికి ఆ సముద్రపు నురగకి కూడా ఏదో విడదీయరాని సంబంధమే ఉంది . ఆ నురగతోటె వజ్రాయుధాన్ని తయారు చేసుకున్నాడు . ఆనక తెల్లని క్షీరసాగరం నురగలో తన పాపాలు పోయేందుకు గణపతిని చేసుకున్నాడు . కానీ ఆ గణపతి ఈ భువిపై కొలువయ్యాడు . ఆ క్షేత్రాన్ని ఇప్పుడు మనం దర్శిద్దాం . నురగలో తయారయిన వినాయకుణ్ణి ఎలా అర్చిస్తారో తెలుసుకుందాం .  
 
గణనాథులను విభిన్నరకాలుగా తయారు చేస్తుంటారు. స్వీట్స్ తో, కూరగాయలు, పూలు,పండ్లు,  చెరుకుగడలు,రుద్రాక్షలు,నాణాలు, డబ్బులు ఇలా ఒకటేమిటి, లంబోదరుడు అడగని పదార్థమూ , ఆయన ఒప్పని అవతారము లేదంటే అతిశయోక్తి కాదు. మట్టితో చేసే వినాయకులు పర్యావరణ మూర్తులుగా సుప్రసిద్ధిని పొందాయి . అయితే, సముద్ర నురగలో కదా మనం వినాయకుడు తయారయ్యారని చెప్పుకున్నాం ! అలా తయారైన వినాయకుడు ఆ రూపంలో ఉండగలడా ? ఉన్న  యుగాల తరబడి నిలువగలడా, నిలిచినా ఒక విగ్రహరూపంలో పూజలు అందుకోగలడా అనేవి ప్రశ్నలు . 

ఈ ప్రశ్నలకి సమాధానం చెబుతుంది తమిళనాడులోని  ‘సముద్ర నురగ’తో  తయారైన వినాయకుడి గుడి . సముద్ర ‘నురగ’తో వినాయకుడు అనే మాటకూడా  వినటానికి నమ్మశక్యంగా లేదు కదూ. ఇది ఎన్నో వేల ఏళ్ళనుంచి వస్తున్న పురాణగాధ. తరాలనుంచీ భక్తులు నమ్మి కొలిచిన దైవ చరిత్ర. సముద్ర ‘నురగ’ వినాయకుడు తమిళనాడులో కొలువై ఉన్నాడు. కుంభకోణానికి 6 కి.మీ. ల దూరం ఉంది. తంజావూర్ జిల్లా, కుంభకోణం తాలూకాలోని ఒక గ్రామం ‘తిరువలన్ చుహి’. తన తల్లి తండ్రులతో సహా కొలువు తీరాడు పాల సముద్ర నురగతో తయారు చేయబడిన శ్వేత వినాయకుడు.  

వైట్ వినాయగర్ కోవెల అని ఈ ఆలయాన్ని పిలుస్తారు .  చిన్నగా ఉండే ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. అసలు సముద్ర నురుగ నుంచి వినాయకుడు ఎలా ఆవిర్భించాడు అనేదానికి ఒక కథ ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించిన కధ గురించి అందరికీ తెలుసు. ఏ పూజైనా, కార్యక్రమమైనా వినాయకుడి పూజతోనే ప్రారంభం అవుతుందనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ పాల సముద్రాన్ని మధించే మహత్తర కార్యక్రమానికి మాత్రం వినాయక పూజని చేయటం దేవతలు మరిచి పోయారట.  అందుకే సముద్ర మధనంలో ముందు హాలాహలం (కాలకూట విషం. దీన్ని శివుడు తన కంఠంలో బంధించాడు) పుట్టిందిట. దీంతో దేవతలంతా శివుడిని వేడుకున్నారు. అప్పటికప్పుడు వినాయకుణ్ణి తయారు చేసుకోవడానికి తగిన పదార్థంగా మంధర పర్వతం మీదున్న మట్టి కనిపించలేదో ఏమో మరి , పాల సముద్రం నుంచి పుట్టిన నురగతో వినాయకుణ్ణి తయారు చేసి, పూజించారుట. ఆ తర్వాత లక్ష్మీదేవి, కామధేనువుతో పాటు అమృతభాండం పుట్టింది. దాని కోసం దేవతలు, రాక్షసులు కొట్లాట అంతా ఓ పేద్ద కథ. 

ఇదిలా ఉంటె, ఇంద్రుడు అహల్య విషయంలో పొందిన శాపానికి ఏంచేయాలో తెలీక , ఆ శాప విముక్తి కోసం  ఈ శ్వేత వినాయకుడిని పట్టుకుని శివార్చన చేస్తూ ఎన్నో  ప్రదేశాలు తిరుగుతూ తమిళనాడులోని ఈ ప్రాంతానికి  వచ్చాడుట. అప్పుడు నురగ వినాయకుడు   ‘తిరువలన్ చుహి’లో ఉండిపోవాలనుకున్నాడు. దానికి తండ్రిని సహాయం అడిగాడు. దీంతో శివుడు చిన్నపిల్లాడి రూపంలో ఇంద్రుడి దగ్గరకు వచ్చాడుట. ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి ఆ బాలుడి చేతికిచ్చి తాను శివార్చన ముగించుకు వచ్చేదాకా కింద పెట్టవద్దని చెప్పి మరీ వెళ్ళాడు.  బాలుడి రూపంలో ఉన్న శివుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడ వున్న బలిపీఠం కింద పెట్టి వెళ్ళి పోయాడుట.  తిరిగి వచ్చిన ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడనుంచి తీసుకెళ్ళాలని విశ్వ  ప్రయత్నాలు చేశాడు. కానీ సాధ్యం కాలేదు. 

దేవ శిల్పిని రప్పించి రధం తయారు చేయించి, ఏకంగా శ్వేత  వినాయక విగ్రహం వున్న ఆ ప్రదేశాన్నే తీసుకు వెళ్ళేందుకు యత్నించాడు.  ఆ సమయంలో  శ్వేత వినాయకుడు అశరీరవాణి ద్వారా నేను ఇక్కడే కొలువుదీరాలనుకున్నాననీ, ప్రతి వినాయక చవితికీ వచ్చి శ్వేత విగ్రహాన్ని పూజించమని తెలిపాడు. అలాచేస్తే రోజూ గణపతిని పూజించిన ఫలితం వస్తుందని చెప్పింది అశరీరవాణి.  అందుకే ప్రతి వినాయక చవితికి ఇంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుణ్ణి పూజిస్తాడని భక్తుల నమ్మకం.

శ్వేత వినాయకుడిది చిన్న విగ్రహమే.  ఈ వినాయకుడి విగ్రహం సముద్ర నురగతో తయారుకాబడటంతో ఈ విగ్రహానికి వస్త్రాలు కట్టరు, పూలు పెట్టరు, అభిషేకాలు వంటి క్రతువులు చేయరు. అస్సలు విగ్రహాన్ని పూజారులు కూడా  తాకరు.  కేవలం పచ్చ కర్పూరం పొడి మాత్రం చల్లుతారు, అదీ కూడా చెయ్యి తగలకుండా.

వినాయకుడు ఇక్కడ ఇంద్రదేవి కమలాంబాల్ (మహా విష్ణువు కళ్ళనుంచి పుట్టింది), బుధ్ధి దేవి (బ్రహ్మ వాక్కునుంచి పుట్టింది) అనే వారిని వివాహం చేసుకున్నాడుట.   అందుకే ఇక్కడ ఈ స్వామిని సేవిస్తే వివాహ విషయాలలో వున్న అడ్డంకులు తొలగి పోతాయని భక్తుల నమ్మకం.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore