వినాయకుడు శిలగా మారి పూజలందుకుంటున్న ఆలయం !
విభీషణుడు వెంటాడిన వినాయకుడు శిలగా మారి పూజలందుకుంటున్న ఆలయం !
-లక్ష్మీ రమణ
భూకైలాస్ సినిమాని తెలుగువారందరూ ఖచ్చితంగా చూసే ఉంటారు. శివుని ఆత్మా లింగాన్ని లంకకి తరలించుకు వెళితే, ఇక రావణాసురుని ఓడించడం అనేది లోకంలో ఎవరికీ సాధ్యంకాదని , మాయోపాయంతో అడ్డుకుంటాడు వినాయకుడు . అలాంటి ఒక కార్యాన్ని అతని తమ్ముడు, రావణుని తర్వాత లంకాధిపతి అయినా విభీషణుడి విషయంలోనూ భిజానవేసుకొని నెరవేర్చారట గణాధిపతి . ఈ కథకి మూలం మాత్రం శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద . ఇంటాకీ కథేంటంటే,
రావణాసురుడు , విభీషణుడూ కూడా సంధ్యావందనా తత్పరులు . అందుకే రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకకి తీసుకెళుతున్న సమయంలో సాయం సంధ్యా సమయం కావడం, ఆయన సన్ధాయ వార్చుకోవడానికి వెళ్లడం అనే నియామాన్నీ గణాధిపతి తనకి అనుకూలంగా మార్చుకొని, లింగాన్ని భూమిమీద పెట్టేశాడు. ఇదే కథ తమ్ముడు విభీషణుడు విషయంలోనూ పునరావృతం అయ్యింది.
రావణుడు అపార శివ భక్తుడైతే, విభీషణుడు శ్రీరంగనాధుని భక్తుడు. శ్రీ రంగనాధుని నిత్యమూ అర్చించేవాడు. శ్రీ రాముడు రావణవధ అనంతరం తన పట్టాభిషేక మహోత్సవానికి వచ్చిన తన మిత్రులందరికీ అనేక కానుకలను యిచ్చి సత్కరిస్తూ, విభీషణునకు ఇక్ష్వాకు వంశీయులు తమ పూజా మందిరం లో నిత్యమూ అర్చించే 'రంగనాధుని' ప్రతిమను బహూకరించాడు.
శివుని ఆత్మలింగం ఎంతటి అనుగ్రహప్రదాయమో , తనని తానె అర్చించుకున్న ఇక్ష్వాకుకుల తిలకుని రంగనాథుని ప్రతిమా అంతే అనుగ్రహప్రదాయకం. దీనిని రామ భక్తుడే అయినా , రాక్షసుడైన విభీషుణుడి వెంట లంకకి తరలిపోకుండా అడ్డుకోమని తిరిగి గణాధిపతినే ఆరాధించారు దేవతలు. దాంతో ఆయన మల్లి బ్రాహ్మణ బాలునిగా రూపుదాల్చి, లంకకు తిరిగి వెళ్తున్న విభీషణుడి దృష్టిని ఆకర్షించాడు. కావేరీ నదీ తీరానికి చేరుకొని, తనకు సంధ్యా వందన విధుల సమయం కావడంతో, ఆ విధిని నిర్వర్తించేంతవరకూ బాలుణ్ణి విగ్రహాన్ని పట్టుకొని నిలబడమని అర్థించాడు. ముమ్మారు పిలిచినా పలకకపోతే, కిందపెట్టేసి వెళ్లిపోతానని ఆ బాలుడు షరతు పెట్టిననా ఒప్పుకున్నాడు.
ఇంకేముంది, గణపతికి అవకాశం దొరికింది . ముమ్మారు పిలిచినా పలకలేదన్న నెపంతో అక్కడ ఇసుక తిన్నెలమీద రంగనాధుని ప్రతిమను వుంచాడు గణనాధుడు . తన సంధ్యావందన, జప, తపాదులు నిర్వహించుకుని, పరుగుపరుగున వచ్చిన విభీషణుడు మరలా విగ్రహాన్ని తీసుకుని పోవడానికి ప్రయత్నం చేస్తే ఆ విగ్రహం కదలలేదు.
దీంతో ఆగ్రహంతో బాలుడిని పట్టుకోవాలని చూస్తాడు విభీషణుడు . బాలుడు వెంటనే పారిపోతాడు. అతన్ని పట్టుకోవాలని వెంటపడ్డాడు. చాలాదూరం పరుగెత్తిన వినాయకుడు ఒక కొండపైకి వెళతాడు. చివరకు బాలుడిని పట్టుకున్న విభీషణుడు నుదుటిపై గట్టిగా కొట్టడంతో స్వామి నవ్వుతూ అసలు రూపంతో దర్శనమిచ్చాడు. వెంటనే విభీషణుడు స్వామివారిని క్షమాపణలు కోరాడు. గణపతి అతనిని అనుగ్రహించాడు.
కానీ రంగనాథుణ్ణి తన వెంట తీసుకు వెళ్లలేకపోయాననే బాధతో ఖిన్నుడైన విభీషనుడికి, రంగనాధుడు దర్శనమిచ్చి ఈ కావేరీనదీతీర ప్రాంతము తనకు తగినది, నచ్చింది అని చెప్పి, తనను అక్కడే నిలుపమని కోరడంతో, అక్కడే రంగనాధ ఆలయ నిర్మాణం చేశాడట. ఆ రంగనాథుని చెంతనే వినాయకుడు అక్కడే స్వయంభువుగా వెలసినట్టు తెలుస్తోంది. నిత్యమూ అక్కడికే వచ్చి విభీషణుడు ఈ ఆలయాలకు వచ్చి అర్చనాదికాలు చేసేవాడని స్థల ఐతిహ్యం .
ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందో చెప్పనే లేదుకదూ! స్వయంగా వినాయకుడే విగ్రహంగా నిలిచినా ఈ క్షేత్రం తమిళనాడులోని తిరుచ్చిలోని రాక్‌ఫోర్ట్‌పై ఉంది. ఈ స్వామీ దర్శనం వలన సర్వ విజ్ఞాలూ తొలగిపోయి, కార్యసిద్ధి, ఆటంకాలని ఎదుర్కొనే బుద్ధి కలుగుతాయని చెబుతారు .